ప్రభుత్వాలు పనిచేస్తుంటాయి. ప్రతిపక్షాలు విమర్శిస్తుంటాయి. అధికారానికి దూరంగా ఉన్న పార్టీలు ఇంకా ఈ పద్ధతినే కంటిన్యూ చేస్తున్నాయి. సర్కార్‌ను అదే పనిగా తప్పు పట్టడం సరికాదని జనం కోరుతున్నారు. పాజిటివ్‌గా ఆలోచించే ప్రతిపక్షాలనే ప్రజలు ఆదరిస్తారని చరిత్రలో ఎన్నో సార్లు రుజువైంది. అలాగే, పాజిటివ్ ప్రచారానికే ఓట్లు వేస్తున్నారని గడచిన మూడు నాలుగేళ్లలో జరిగిన ఎన్నికలను బట్టి పోల్ ఎక్స్‌పర్ట్‌లు ఒక అంచనాకు వస్తున్నారు.
జనం పొలిటికల్ లీడర్ల నుంచి ఆశించేది ఒక్కటే.. సమస్యల పరిష్కారం. చదువుకున్నోళ్లు సర్కారీ జాబుల నోటిఫికేషన్ల కోసం చూస్తారు. పేదలు తమ పిల్లలకు ప్రభుత్వ బడిలో మంచి స్టడీ దొరికితే చాలనుకుంటారు. చేతిలో డబ్బుల్లేని పేషెంట్లు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉచిత వైద్యం కోసం ఆశపడతారు. వ్యాపారులు బిజినెస్‌కి అనుకూల వాతావరణం, అవినీతి లేని పాలన ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తారు.
నాయకులు ఇవన్నీ అందించటానికి ప్రయత్నించాలి. ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించటానికి, వాళ్లను ఆర్థికంగా అభివృద్ధిలోకి తేవటానికి కృషి చేయాలి. కానీ.. ఈ రోజుల్లో చాలా మంది నేతలు తెల్లవారిన దగ్గర నుంచి పొద్దు పోయే వరకు ప్రత్యర్థులపై ఆరోపణలు గుప్పించటానికే సమయం కేటాయిస్తున్నారు. ముఖ్యంగా మీడియాలో ఒకరిపైఒకరు దుమ్మెత్తి పోసుకోవటానికి ప్రాధాన్యత ఇస్తారు.
ఫార్మాట్ మార్చని అపొజిషన్ పార్టీలు
ప్రెస్ మీట్లలో, మీడియా చర్చా కార్యక్రమాల్లో లీడర్లు ఫైటింగ్ చేసే అంశాల్లో ప్రజా సమస్యలూ ఉన్నాయి. కాకపోతే అపొజిషన్ నాయకులు ప్రభుత్వాన్ని నిందించడమే పనిగా పెట్టుకున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకు.. బీజేపీకి అధికార దాహం ఎక్కువని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ ఎద్దేవా చేస్తుంటారు. ప్రధాని మోడీ ప్రజలను గాలికొదిలేశారని బీఎస్పీ చీఫ్ మాయావతి మండిపడుతుంటారు. బీహార్ సీఎం నితీశ్‌కుమార్ గ్రౌండ్ లెవల్లో ఏం జరుగుతోందో తెలుసుకోవట్లేదని ఆర్జేడీ లీడర్ తేజశ్వీ యాదవ్ తప్పు పడుతుంటారు.
బడ్జెట్‌ను ప్రవేశపెట్టకముందే దానివల్ల మధ్యతరగతివాళ్లకు, పేదోళ్లకు, రైతులకు ఒరిగేదేం లేదంటూ ప్రతిపక్షాలు కళ్లు మూసుకొని అనేస్తాయి. దీన్నిబట్టి ప్రభుత్వ చర్యల పట్ల అపొజిషన్ పార్టీల రియాక్షన్ ఎలా ఉంటుందో ముందే ఊహించొచ్చు. న్యూస్ వినకపోయినా, చదవకపోయినా ప్రతిపక్ష నేతలు ఎలా స్పందిస్తారో ఇట్టే పసిగట్టొచ్చు. ప్రతిపక్షంగా వ్యవహరించటం చాలా ఈజీ అని, ఎంజాయ్‌బుల్‌గా ఉందని రాహుల్‌గాంధీ ఆ మధ్య అన్నారు కూడా.
సానుకూల ప్రచారాలతో సక్సెస్
ప్రతిపక్షాల వర్కింగ్ స్టైల్ చూస్తుంటే అవి ఎప్పుడూ నెగెటివ్‌గానే ఆలోచిస్తాయనే అభిప్రాయం ఏర్పడుతుంది. కానీ అపొజిషన్ అలా ఉండాలని పబ్లిక్ కోరుకోవట్లేదు. తాము అధికారంలోకి వస్తే ఏయే పథకాలు ప్రవేశపెడతామో, ఎంత బాగా అమలు చేస్తామో చెబితే బాగుంటుందని భావిస్తున్నారు. అపోజ్ చేయటం కన్నా ప్రపోజ్ చేయటం బెటర్ అని సూచిస్తున్నారు. భారీగా లేదా ఓ మోస్తారుగా సక్సెస్ అయిన పొలిటికల్ క్యాంపెయిన్లలో చాలా మటుకు పాజిటివ్ ప్రచారాలే ఉన్నట్లు చరిత్ర చెబుతోంది. లోక్‌పాల్ మూమెంట్ కరప్షన్‌ని నిరసించటానికి మాత్రమే పరిమితం కాలేదు. ప్రభుత్వం గనక ఇండిపెండెంట్ అంబుడ్స్‌మన్‌ను ఏర్పాటుచేస్తే అవినీతి దానంతట అదే పారిపోతుందని చెప్పింది.
ఆశావాదానికే జనం ఓటు
నాకూ ఒక కల ఉందన్న మార్టిన్ లూథర్‌కింగ్(జూనియర్) మానవ హక్కుల పరిరక్షణ ప్రతినిధిగా నేటికీ గుర్తింపు పొందుతున్నారు. ‘మనం సాధించగలం’ అంటూ ప్రజల్లో నమ్మకం కలిగించిన బరాక్ ఒబామా అమెరికా ప్రెసిడెంట్ అయిన నల్లజాతీయుడిగా రికార్డ్ సృష్టించాడు. ఒక్కసారి కాదు రెండు సార్లు గెలిచారు. ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ అని పిలుపునిచ్చిన డొనాల్డ్ ట్రంప్ నెగ్గారు. దీన్ని బట్టి ప్రజలు ఆశావాదానికే ఓటేస్తారని గ్రహించాలి.