మంచిర్యాల, వెలుగు : మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం ఆవడం గ్రామ శివారులోని సుమారు 1,200 ఎకరాల ప్రభుత్వ భూములు మాయమయ్యాయి. గతంలో ఇక్కడ పనిచేసిన కొందరు రెవెన్యూ ఆఫీసర్లు విచ్చలవిడిగా అసైన్డ్ పట్టాలు జారీ చేశారు. అసెంబ్లీ రివ్యూ కమిటీ (ఏఆర్సీ) ఆమోదం, ప్రొసీడింగ్స్ లేకుండానే ప్రైవేట్ వ్యక్తులను భూములను అప్పగించి కోట్లాది రూపాయలు దండుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
డైరెక్ట్‌గా ధరణిలోకి..ఆవడం గ్రామంలోని భూములకు సంబంధించి బోగస్ డాక్యుమెంట్లు సృష్టించి 1980 నుంచి 2016 వరకు పాత పహాణీల్లో డైరెక్ట్‌గా ఎక్కించారు. ప్రభుత్వ అనుమతి లేకుండానే ఇల్లీగల్ ప్రోసీడింగ్స్ రెడీ చేసి పాస్ బుక్‌లు జారీ చేశారు. వీటి ఆధారంగానే 2018 నుంచి ధరణిలోకి ఎక్కించారు. కాగా 1995 సంవత్సరంలో 35 మందికి నకిలీ ఫైనల్ పట్టా సర్టిఫికెట్లు ఇచ్చారని, ఇందుకు సంబంధించిన ఏఆర్‌సీ ఫైల్ నెన్నెల తహసీల్దార్ ఆఫీస్‌లో కనిపించడం లేదని గతంలోనే బెల్లంపల్లి ఆర్డీవో రిపోర్ట్ ఇచ్చారు.
బై నంబర్లతో బోగస్ పట్టాలుఆవడం గ్రామ శివార్లలోని పలు సర్వేనంబర్లలో మొత్తం 2,092 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఇందులో 460 సర్వే నంబర్‌లోని 785.16 ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్‌గా రికార్డుల్లో ఉంది. మిగతా 1,307 ఎకరాల పరంపోగు (పీపీ) భూముల్లో 100 ఎకరాలను మాత్రమే ఏఆర్సీ ఆమోదంతో అసైన్డ్ పట్టాలు ఇచ్చారు. 2004 నుంచి 2013 వరకు ఏడో విడత భూపంపిణీలో సర్వేనంబర్ 406/2లోని 2.16 ఎకరాలను ఒక్కరికే పంపిణీ చేశారు. ఒక ఫ్యామిలీకి ఐదు ఎకరాలే అసైన్డ్ చేయాల్సి ఉండగా, కొందరికి 10 నుంచి 20 ఎకరాలు ఇచ్చారు. మిగిలిన సుమారు 1,200 ఎకరాల భూములను ఇష్టారీతిన పంచిపెట్టారు. సర్వేనంబర్ 151లో 77.37 ఎకరాలు, 578లో 488.22 ఎకరాలు, 590లో 197.08 ఎకరాలు, 668లో 61.22 ఎకరాల భూములున్నాయి. ఈ సర్వేనంబర్లకు బై నంబర్లు వేసి బోగస్ పట్టాలు జారీ చేశారు.
ఇల్లీగల్ పట్టాలకు లొకేషన్ స్కెచ్‌లు
ఆవడం శివారుతో పాటు మండలంలోని వివిధ గ్రామ శివార్లలోని ఇల్లీగల్ పట్టాలకు లొకేషన్ స్కెచ్‌లు, మోఖా పంచనామా సర్టిఫికెట్లు జారీ చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ధరణి రికార్డులు, పాత బోగస్ పట్టాల ఆధారంగా తహసీల్దార్ ఆఫీస్‌లో పనిచేస్తున్న కొందరు ఆఫీసర్లు ఈ దందాతో జేబులు నింపుకుంటున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి క్షేత్రస్థాయిలో విచారణ జరిపి బోగస్ పట్టాలను రద్దు చేసి ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.