భారతదేశం ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన నాగరికత, ఎన్నో వేల సంవత్సరాల ఘన చరిత్ర కలిగి ఉన్నది. 1550వ సంవత్సరం వరకూ ప్రస్తుత అగ్రరాజ్యం అమెరికా గురించి ప్రపంచానికి చాలా తక్కువగా తెలుసు. అదే ఆఫ్రికా గురించి అయితే 200 సంవత్సరాల క్రితం వరకూ ఎవరికీ ఏమీ తెలియదనే చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాగరికత ప్రాంతాలను పరిశీలిస్తే వాటిలో చైనా, రోమ్, గ్రీస్, ఈజిప్ట్, ఇరాన్, ఇరాక్ ప్రాంతాలు ఉన్నాయి. కానీ, వీటన్నిటికంటే ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్న భారతీయ నాగరికత చరిత్ర అత్యంత పురాతనమైనది.
ఆసక్తికరంగా, అన్ని పురాతన నాగరికతలకు సామీప్యం ఉన్న ఒక సాధారణ విషయాన్ని మనం గమనించవచ్చు. అది ఏమిటంటే ‘అన్నం తినడం’ ఎన్నో వేల సంవత్సరాలుగా ఆసియా ఖండంలోని ప్రజలు అన్నం (రైస్) తింటున్నారు. అయితే, అమెరికా ఖండంతోపాటు యూరప్, ఆఫ్రికా భూమధ్య రేఖకు దక్షిణాన ఉన్న ప్రాంతాలలోని ప్రజలకు బియ్యం గురించి తెలియదనే చెప్పాలి. అదేవిధంగా తొలి లిఖిత భాషలు కూడా ఆసియాలోనే అభివృద్ధి చెందినాయి.
వందల ఏండ్లుగా కులం ఉనికి
భారతదేశం గురించి మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. భారత్లో వందల సంవత్సరాలుగా కులం అనేది శాశ్వత ఉనికిని కలిగి ఉంది. స్వాతంత్ర్యం తరువాత మహాత్మా గాంధీ, ఇతర ప్రముఖ నాయకులు ఆర్థిక, సామాజిక పురోగతి కులంపై ఆధారపడి ఉంటుందని భావించారు. అణగారిన కులాలకు సహాయం చేయడానికి ఒక నిశ్చయాత్మక చర్య ద్వారా వాటి సమస్యలను పరిష్కరించాలి. అందుచేతనే మన రాజ్యాంగంలో కూడా కులాన్ని పొందుపరిచారు.
దేశ ప్రజలకు అన్నింటినీ మార్చుకునే స్వేచ్ఛ ఉంది. కానీ, కులం, షెడ్యూల్ కులాలు అదేవిధంగా షెడ్యూల్ తెగలు రాజ్యాంగం ద్వారా ప్రస్తావించబడ్డాయి. 1977లో వెనుకబడిన కులాల ఆర్థిక స్థితిగతుల సమాచారాన్ని సేకరించేందుకు అప్పటి కేంద్ర ప్రభుత్వం మండల్ కమిషన్ను ఏర్పాటు చేసింది. మండల్ కమిషన్ నివేదిక ఆధారంగా 1992లో కేంద్ర ప్రభుత్వం ఓబీసీలకు ఉద్యోగాలను రిజర్వు చేసింది. 2006లో జరిగిన 92వ రాజ్యాంగ సవరణ ఆమోదం పొందిన తరువాత ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఓబీసీలకు సీట్లు రిజర్వు చేయబడ్డాయి.
బిహార్ కులగణన విప్లవాత్మకం
గొప్ప సామాజిక విప్లవం అన్నట్లుగా ‘కుల గణన’ అనే విప్లవాత్మక ఆలోచన తెరపైకి వచ్చింది. కులగణన దేశవ్యాప్తంగా వివిధ కులాల వాస్తవ జనాభా సంఖ్యను తెలియజేస్తోందని, ఆ తర్వాత ప్రభుత్వం వివిధ కులాల జనాభా ప్రకారం వారి అభివృద్ధికి అవసరమైన వనరులను కేటాయిస్తుందని కొందరు రాజకీయ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆధిపత్య బీసీ కులాలు కొన్నిమాత్రమే చాలావరకు ప్రయోజనాలను లాక్కున్నాయని రాజకీయ నేతలకు స్పష్టంగా తెలుసు. అయితే తమ హోదా కొనసాగించాలంటే బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని తద్వారా ఆధిపత్య బీసీ కులాల ప్రయోజనాలను కొనసాగించాలని కోరుతున్నారు. కానీ, అసలు విషయం ఏమిటంటే ఆధిపత్య బీసీ కులాలు బీసీల వర్గీకరణను ఏమాత్రం కోరుకోవడం లేదు.
బీసీ వర్గీకరణ జరిగితే వారి ఆధిపత్యం తగ్గిపోవడంతోపాటు వాటా కూడా తగ్గుతుందన్న ఆందోళన భావన నెలకొంది. బిహార్లో నితీశ్ కుమార్ సర్కారు ఆధ్వర్యంలో ఇటీవల కులగణన జరిగింది. ఈ కులగణనను విప్లవాత్మక చర్యగా ప్రతిపక్షాలు పేర్కొంటున్నాయి. అయితే మరోవైపు బిహార్లో జరిగిన కులగణనలో యాదవులు అదేవిధంగా ముస్లింల గణాంకాలు వాస్తవాలు కాదని, నకిలీవని కేంద్ర హోంమంత్రి అమిత్షా విమర్శిస్తున్నారు. బిహార్ రాష్ట్ర ప్రభుత్వం ఆ వర్గాలను అధిక సంఖ్యలో ఉన్న జనాభాగా చూపించాలని కోరుకుంటుందని అమిత్ షా ఆరోపించారు. కాగా, ఫేక్ ఫిగర్లను ఉపయోగించి పెద్దవాటాను కైవసం చేసుకునేందుకు ప్రయత్నాలు సహజంగానే జరుగుతాయి.
బీసీ కేటగిరీలో వందల కులాలు
దేశవ్యాప్తంగా వెనుకబడిన కులాలకు చెందిన బీసీ కేటగిరీలో వందల సంఖ్యలో కులాలు ఉన్నాయి. వీటిలో తక్కువ సంఖ్యలో ఉన్న కుమ్మర్లు లేదా స్వర్ణకారుల కులాలు కూడా ఉన్నాయి. చిన్నకులాలకు చెందిన ప్రజలు చెల్లాచెదురుగా ఉన్నారు. అదేవిధంగా కొన్ని వెనుకబడిన తరగతులకు చెందిన కులాల ప్రజలకు భూస్వాముల మాదిరిగా భారీగా భూమిని కలిగి ఉండరు. సామాజిక, ఆర్థిక తదితర కారణాలతో వారికి కేటాయించిన ఉద్యోగాలు కూడా పొందలేకపోతుంటారు.
అదేవిధంగా వారికి కేటాయించిన రాజకీయ అవకాశాలను అందిపుచ్చుకోలేకపోతారు. ఎందుకంటే ఆధిపత్య బీసీ కులాలే వారి ప్రయోజనాలను కూడా పొందుతుంటాయి. వెనుకబడిన కులాలకు కేటాయించిన స్థానాల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నాయకుల కులాలను పరిశీలిస్తే తెలుగు రాష్ట్రాల్లో కేవలం ఆరు బీసీ కులాలవారికే అన్ని పదవులు దక్కుతున్నాయి. భారతదేశ వ్యాప్తంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితిని పరిగణనలోకి తీసుకుంటే కొన్ని ఆధిపత్య బీసీ కులాల నాయకులే బీసీలకు కేటాయించిన అన్ని స్థానాలను కైవసం చేసుకుంటున్న పరిస్థితి కనపడుతున్నది. దీంతో బీసీల్లో అణగారిన వర్గాలు ఆగ్రహాన్నివ్యక్తం చేస్తున్నాయి.
ఆధిపత్య బీసీలను
బహిర్గతం చేస్తున్న కులగణన
1977 నుంచి ఉత్తరప్రదేశ్, బీహార్‌లోని యాదవులు వంటి అనేక ఆధిపత్య బీసీ కులాలు బీసీవర్గాల్లో అత్యధికంగా లబ్ధి పొందుతున్నాయని వెల్లడైంది. తెలుగు రాష్ట్రాల్లో గౌడ్‌లు, యాదవులు, కొప్పుల వెలమలు, మున్నూరు కాపులు, ముదిరాజ్‌లు అత్యధిక స్థానాల్లో గెలుపొందారు. ఈ ఆధిపత్య కులాలు బీసీ జనాభాలో 20% మాత్రమే ఉన్నాయి. అయినప్పటికీ, వందలాది మంది ఇతర వెనుకబడిన తరగతులైన రజకులు, స్వర్ణకారులు తదితర కులాలకు చెందినవారికంటే అధికంగా లబ్ధి పొందారు. మాదిగలు షెడ్యూల్ కులాల వర్గీకరణ చేయాలని డిమాండ్ చేసినట్లే. బీసీల్లోనూ ఆధిపత్యం లేని వెనుకబడిన కులాలవారు వెనుకబడిన తరగతులను వర్గీకరించాలని డిమాండ్ చేస్తున్నారు. .
ప్రస్తుతం, యాదవులు ఇతర ఆధిపత్య బీసీలు కుల గణనను డిమాండ్ చేస్తున్నారు. కానీ, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కులగణన జరిగినప్పుడు బీసీలలోని అణగారిన వర్గాలు తమను అధికారికంగా అత్యంత వెనుకబడిన తరగతులుగా వర్గీకరించాలని, తమకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేయవచ్చు. ఎందుకంటే కొంతమంది ఆధిపత్య బీసీలు తమ ప్రయోజనాలు లాక్కుంటున్నారని వారు గ్రహిస్తారు.
వెనుకబడిన కులాలు, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల్లోని ఆధిపత్య విభాగాలను కులగణన బహిర్గతం చేస్తుంది. అందుకే ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ మొదలైన రాష్ట్రాల్లోని అనేక చిన్న పార్టీలు వెనుకబడిన కులాలు, షెడ్యూల్ కులాలను వర్గీకరించాలని డిమాండ్ చేస్తున్నాయి. చిన్న కులాల పార్టీలు తమ వర్గాల ఓట్లను సమీకరించుకుని పెద్ద పార్టీలతో పొత్తులు పెట్టుకుని ఎమ్మెల్యేలు, ఎంపీల స్థానాలను పొందుతున్నాయి. బహుశా తెలుగు రాష్ట్రాల్లో కూడా చిన్న కులాలు పార్టీలు పెట్టుకునే సమయం వచ్చిందేమో.
కులగణన ఏమి వెల్లడిస్తుందంటే..
ఎటువంటి కులగణనను మనం పరిగణనలోకి తీసుకున్నా వాటి రికార్డుల్లో కొన్ని తప్పులు ఉంటాయనేది వాస్తవం. ప్రతి కులానికి చెందినవారు తమ కుల జనాభా పెద్ద సంఖ్యలో ఉన్నట్లు చూపించాలనుకుంటారు. మనం గమనించాల్సిన కీలక అంశం ఏమిటంటే.. ప్రస్తుతం అధిక సంఖ్యలో కులాంతర వివాహాలు జరుగుతున్నాయి. కులాంతర వివాహాలు చేసుకున్నవారికి జన్మించిన పిల్లల సంఖ్యను కులగణన వెల్లడించదు. కాబట్టి, ప్రస్తుతం అవలంబిస్తున్న పద్ధతి ప్రకారం కులాంతరం వివాహం చేసుకున్నవారికి పుట్టిన బిడ్డ తన తల్లిదండ్రుల తక్కువ కులాన్ని క్లెయిమ్ చేయవచ్చు.
ఇదేవిధంగా ఇక ముందు జరిగితే రిజర్వుడు కులాల సంఖ్య త్వరలోనే మరింత పెరుగుతుంది. ఎందుకంటే రిజర్వేషను కోరుకునే ఏ కుమారుడు లేదా కుమార్తె అయినా తల్లిదండ్రుల ఉన్నత కులాన్ని క్లెయిమ్ చేయరు. ఉదాహరణకు ఒక అగ్రవర్ణ కులానికి చెందిన మహిళ షెడ్యూల్ కులానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకుంటే.. వారికి పుట్టిన సంతానం రిజర్వేషన్ల ఫలాలు పొందటానికి షెడ్యూల్ క్యాస్ట్ స్టేటస్ కోసమే క్లెయిమ్ చేస్తారు.
రాజకీయ పరిణామాలు
బిహార్లో నిర్వహించిన కుల గణనలోని గణాంకాలను గమనిస్తే యాదవులు మొత్తం జనాభాలో 8శాతం ఉన్నారు. కానీ, బిహార్ శాసన సభలో సంఖ్యాపరంగా 70మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే ఇది 26 శాతానికి సమానం. ఇది న్యాయమేనా అంటే ఖచ్చితంగా అవును అనలేం. కానీ, చిన్న కులాలకు చెందిన జనాభా చెదిరిపోయి కేంద్రీకృతం కాకపోవడంతో ఆ కులాలకు చెందినవారిని ఎమ్మెల్యేలను చేయడం అసాధ్యం. ఉదాహరణకు రజకులను తీసుకుంటే వారు ప్రతి గ్రామం లేదా పట్టణంలో తక్కువ సంఖ్యలో ఉన్నారు. రజక వర్గాలవారు ఎక్కుడా ఆధిపత్య బీసీల కులాల తరహాలో కేంద్రీకృతమై లేరు. అందుకే రజకులు, కుమ్మర్లుకు చెందిన నాయకులు ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఎన్నిక కాలేకపోతున్నారు.
ప్రస్తుతం కులగణన దేశవ్యాప్తంగా ఖచ్చితంగా నిర్వహిస్తే బీసీ వర్గాల్లో విభజన వచ్చే అవకాశం ఉంది. కాగా, షెడ్యూల్ కులాలకు చెందిన మాదిగలు తమను మాలల నుంచి వేరు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వర్గీకరణ ద్వారా మాత్రమే అట్టడుగున ఉన్న బీసీల అభివృద్ధికి బాటలు వేయాల్సి ఉంటుంది.
- డా. పెంటపాటి పుల్లారావు, పొలిటికల్ ఎనలిస్ట్