- రూ.7 కోట్లతో రెడింగ్టన్లా జిస్టిక్ ల్యాబ్: వర్సిటీ వీసీ
హైదరాబాద్, వెలుగు: యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో ఈ నెల నుంచి నాలుగు కోర్సులు ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని వర్సిటీ వీసీ వీఎల్వీఎస్ఎస్ సుబ్బారావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. లాజిస్టిక్స్, మెడికల్ అండ్ హెల్త్, ఫార్మా రంగాల్లో డిమాండ్ ఉన్న నాలుగు కోర్సులను మొదటి విడతలో ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు. కాగా.. దసరా సెలవుల తర్వాత ఈ కోర్సులకు సంబంధించి అడ్మిషన్లు, అర్హతల పూర్తి వివరాల నోటిఫికేషన్ ఇచ్చేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
త్వరలోనే మరిన్ని కోర్సులను ప్రారంభించేందుకు స్కిల్ యూనివర్సిటీ వివిధ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతోందని వీసీ తెలిపారు. ఇప్పటికే హైదరాబాద్‌లోని ఫ్యూచర్ సిటీలో 57 ఎకరాల విస్తీర్ణంలో యూనివర్సిటీ భవనాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమిపూజ చేశారు. ఈ ఏడాది గచ్చిబౌలిలో ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీలో తాత్కాలికంగా వర్సిటీ తరగతులను ప్రారంభించాలని బోర్డు చైర్మన్ ఆనంద్ మహీంద్రా సమక్షంలో ఇటీవల జరిగిన సమావేశంలో ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు తగిన ఏర్పాట్లు కూడా చేసింది. స్కిల్ యూనివర్సిటీ తాత్కాలిక క్యాంపస్‌లో లాజిస్టిక్స్ ల్యాబ్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రముఖ గ్లోబల్ లాజిస్టిక్స్ సొల్యూషన్స్ కంపెనీ రెడింగ్టన్ ముందుకు వచ్చింది.
ఇందు కోసం దాదాపు రూ.7 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధపడింది. లాజిస్టిక్స్ రంగానికి సంబంధించి రెండు షార్ట్ టర్మ్ కోర్సులను యూనివర్సిటీ ప్రారంభించనుంది. వేర్ హౌసింగ్ ఎగ్జిక్యూటివ్, కీ కన్జైనర్ ఎగ్జిక్యూటివ్ పేర్లతో ఈ కోర్సులను నిర్వహించనుంది. వీటి నిర్వహణకు లాజిస్టిక్స్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ సహకారం అందిస్తోంది. నర్సులకు ఉన్నతమైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఫైన్ (ఫినిషింగ్ స్కిల్స్ ఇన్ నర్సింగ్ ఎక్స్ లెన్స్) కోర్సును యూనివర్సిటీ ఈ ఏడాది నుంచే ప్రారంభిస్తోంది.
అపోలో మెడ్‌స్కిల్స్ లిమిటెడ్‌తో కలిసి ఈ కోర్సు నిర్వహించనుంది. అలాగే డాక్టర్ రెడ్డీస్ ఫార్మా అసోసియేట్ పేరుతో అప్రెంటిస్ షిప్ ఇండక్షన్ కోర్సును యూనివర్సిటీ ఈ ఏడాది నుంచే ప్రారంభించనుంది. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ సహకారంతో ఈ కోర్సును నిర్వహిస్తుంది. ఈ కోర్సు కాల వ్యవధి 6 నెలలు. ఇక స్కిల్ డెవెలప్ మెంట్ కోర్సుల్లో చేరిన విద్యార్థులకు క్యాంపస్ ప్లేస్ మెంట్ గ్యారంటీ అని వీసీ సుబ్బారావు అభిప్రాయపడ్డారు. నైపుణ్య శిక్షణ అందుకున్న విద్యార్థులకు నెలకు కనీసం రూ.20 వేల నుంచి రూ. 25 వేల వేతనం ఉండే ఉద్యోగాలు వస్తాయని ఆయన తెలిపారు.