మంచిర్యాల : ఆరుగురికి పోస్టుమార్టం పూర్తి

మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం వెంకటాపూర్లో సజీవ దహనమైన ఆరుగురి పోస్టుమార్టం పూర్తైంది. మృతదేహాల నుంచి సేకరించిన శాంపిల్స్ ను పోలీసులు ఫోరెన్సిక్, FSL రిపోర్ట్స్ కోసం పంపించారు. ఆరుగురిపై విష ప్రయోగం జరిగినట్లు పోస్టుమార్టం ప్రాథమిక రిపోర్టులో వెల్లడైంది. ఆహారంలో పాయిజన్ కలిపి వారంతా తిని చనిపోయాక నిందితులు అగ్నిప్రమాదం ఘటనగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.  

ఇల్లు దగ్ధం కావడంతో ఆ మంటల్లో చిక్కుకొని ఆరుగురు సజీవ దహనమయ్యారు. చనిపోయినవారిలో మాసు శివయ్య (50), ఆయన భార్య రాజ్యలక్ష్మి, శివయ్య వదిన కూతురు మౌనిక (35), హిమబిందు (4), స్వీటి (2), శాంతయ్య (సింగరేణి కార్మికుడు, మృతుడి బంధువు) ఉన్నారు. అయితే  ఈ ఘటనలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదానికి గురైన ఇంటికి కొద్ది దూరంలో రెండు క్యాన్లు కనిపించడం అనుమానాలకు తావిస్తోంది. గంటన్నర సమయంలోనే ఇల్లు మొత్తం కాలి బూడిదవగా..మంటలు ఒకేసారి ఎలా వ్యాప్తి చెందాయనే దానిపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై విచారణ చేపట్టాలని పోలీసులకు శివయ్య కుమారుడు ఫిర్యాదు చేశారు. అతడు ప్రేమ వివాహం చేసుకుని తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నాడని తెలుస్తోంది.