- నేడు కామారెడ్డి మున్సిపల్ లో ఎన్నిక
- కాంగ్రెస్ లో ఇద్దరి మధ్య తీవ్ర పోటీ
- కౌన్సిలర్ల అభిప్రాయాలు తీసుకున్న షబ్బీర్‌అలీ
- షీల్డ్ కవర్‌లో పేరు ప్రకటిస్తామని వెల్లడి
- వేచి చూస్తున్న బీజేపీ, బీఆర్ఎస్
కామారెడ్డి , కామారెడ్డిటౌన్, వెలుగు: కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ పదవి ఎవరిని వరించనుందో సోమవారం తేలిపోనుంది. కాంగ్రెస్ కు మెజార్టీ సభ్యులు ఉండగా చైర్ పర్సన్ గా గడ్డం ఇందుప్రియ, కౌన్సిలర్ ఉరుదొండ వనిత మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కౌన్సిలర్లు, పార్టీ ముఖ్య నేతల మద్దతుతో చైర్‌పర్సన్ పదవి దక్కించుకోవాలని ఇద్దరు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ లో చైర్‌పర్సన్ పేరు ఖరారయితే అనంతరం జరిగే పరిణామాలపై బీజేపీ, బీఆర్‌ఎస్ దృష్టి సారించాయి.
క్యాంపు రాజకీయాలు
ఇప్పటికే కాంగ్రెస్‌లో ఉన్న 26 మంది కౌన్సిలర్లను హైదరాబాద్ తరలించారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఆదివారం కౌన్సిలర్లతో భేటీ అయి ఒక్కొక్కరి అభిప్రాయాన్ని తీసుకున్నారు. చైర్‌పర్సన్‌గా ఇందుప్రియ పేరు కొంతమంది వనిత పేరు మరికొందరు ప్రతిపాదించినట్లు సమాచారం. కౌన్సిలర్ల అభిప్రాయాలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి షీల్డు కవర్ లో చైర్‌పర్సన్ పేరు ప్రకటిస్తామని షబ్బీర్ అలీ చెప్పారు.
చివరి వరకు వేచి చూసే ధోరణిలో
చైర్‌పర్సన్ ఎన్నిక విషయంలో కాంగ్రెస్ ఎవరిని ఖరారు చేస్తుందో, ఆ పార్టీలో చోటు చేసుకునే పరిణామాలపై వేచి చూడాలని బీజేపీ, బీఆర్‌ఎస్ నాయకులు ఉన్నారు. మొత్తం 49 మందిలో ప్రస్తుతం కౌన్సిల్‌లో కాంగ్రెస్ 27, బీఆర్‌ఎస్16, బీజేపీ నుంచి ఆరుగురు కౌన్సిలర్లు ఉన్నారు. సరైన వ్యక్తి పేరు చైర్‌పర్సన్‌గా ప్రకటించకపోతే బీజేపీ నుంచి తాము కూడా రేసులో ఉంటామని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ నేతలు అప్రమత్తమయ్యారు.
బీఆర్ఎస్ నుంచి ఒకరిని ఖరారు చేసి
బీఆర్‌ఎస్ నుంచి కౌన్సిలర్ అనూషను పోటీకి దింపాలని ఆ పార్టీకి చెందిన కొందరు కౌన్సిలర్లు, పార్టీ లీడర్లు నిర్ణయించారు. దీంతో వీరు మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాలు చేశారు. ఆ పార్టీకి చెందిన లీడర్లే మళ్లీ మరో కౌన్సిలర్ పేరును ప్రపోజల్ చేశారు. దీంతో మారిన పరిస్థితుల్లో కౌన్సిలర్అనూష భర్త ప్రసన్నకుమార్ ఆదివారం షబ్బీర్‌అలీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.