
ఈరోజుల్లో పిల్లలను చదివించటమే తలకు మించిన భారం అవుతుంటే.. పొదుపు గురుంచి ఎక్కడ ఆలోచించాలి అనుకోకండి. పిల్లలు ఎదుగుతున్న కొద్దీ ఖర్చులు పెరుగుతుంటాయి. వారి చదువుల కోసం లక్షలు పోయాల్సి వస్తే.. వారి పుస్తకాలు, యూనిఫార్మ్ వంటి వాటి కోసం వేలకు వేలు ఖర్చు చేయాల్సి రావచ్చు. ఇలాంటి సమయంలో వారి ఉజ్వల భవిష్యత్తుకు ఆటంకాలు రాకుండా ఉండాలంటే, ముందస్తు ఆర్థిక ప్రణాళిక అవసరం. అలా అని వందల్లో.. వేలల్లో.. పొదుపు చేయపని చెప్పడం లేదు. రోజుకు 6 రూపాయలు.
పథకం పేరు.. బాల్ జీవన్ బీమా యోజన. ఇందులో రోజుకు రూ. 6 పొదుపు చేస్తూ పోతే మెచ్యూరిటీ సమయంలో లక్ష రూపాయల రాబడి మీ చేతికి అందుతుంది. అదెలా అన్న సందేహం మీకు రావచ్చు. ఇది వాస్తవమే. ఎలా..? ఈ పథకం ఏంటి..? ప్రయోజాలేంటి..? అన్న వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కనిష్టంగా రూ.6, గరిష్టంగా రూ.18
ఈ పథకంలో కనిష్టంగా రోజుకు రూ. 6 మొదలు గరిష్టంగా రూ.18 వరకు పెట్టుబడి పెట్టవచ్చు. అది ఎంతన్నది మీ ఆర్థిక స్తోమతను బట్టి మీరే నిర్ణయించుకోండి. పిల్లల పేరుపై తల్లిదండ్రులు ఈ పొదుపు ప్రారంభించాల్సి ఉంటుంది. 5 నుంచి 20 ఏళ్లలోపు పిల్లలు ఈ పథకంలో చేరవచ్చు. అలాగే, పిల్లల తల్లిదండ్రుల వయస్సు 45 ఏళ్లు మించకూడదు. ఒక కుటుంబంలో గరిష్టంగా ఇద్దరు పిల్లలు ఈ పథకం కింద ప్రయోజనం పొందవచ్చు. తక్కువ మొత్తంలో పొదుపు చేయాలనుకునే వారు కనీసం రోజుకు రూ.6 పొదుపు చేయండి. తద్వారా మెచ్యూరిటీ ముగిశాక రూ. లక్ష వరకు రాబడి పొందవచ్చు.
బాల్ జీవన్ బీమా యోజన ముఖ్య వివరాలు
- పిల్లల వయస్సు 5 నుంచి 20 సంవత్సరాల మధ్య ఉండాలి.
- పిల్లల పేరుపై వారి తల్లిదండ్రులు ఈ పొదుపు ప్రారంభించాలి.
- పాలసీదారుల (తల్లి/తండ్రి) వయస్సు 45 ఏళ్లు మించకూడదు.
- కనిష్టంగా రూ. 6, గరిష్టంగా రూ.18 వరకు పొదుపు చేయవచ్చు.
- ఒక కుటుంబంలో ఇద్దరు పిల్లలు ఈ పథకం కింద ప్రయోజనం పొందవచ్చు.
- ప్రతి రూ. 1000 మొత్తంపై.. ప్రతి ఏటా రూ. 48 బోనస్ కూడా ఇవ్వబడుతుంది.
- పాలసీ నుంచి మధ్యలో వైదొలగాలి అనుకుంటే, 5 సంవత్సరాల తర్వాత సరెండర్ చేసే అవకాశం ఉంది.
పాలసీదారు మరణిస్తే..
పాలసీ కాలవ్యవధిలో అర్ధాంతరంగా పాలసీదారు మరణిస్తే.. ఆ తరువాత పాలసీ ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. పాలసీ గడువు ముగిశాక, ఆ మొత్తాన్ని మీ పిల్లలకు అందజేస్తారు. ఒకవేళ బిడ్డ చనిపోతే, చైల్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ కింద నామినీకి సమ్ అష్యూర్ అమౌంట్ తో పాటు బోనస్ చెల్లిస్తారు.
అవసరమైన పత్రాలు
- పిల్లల ఆధార్ కార్డ్
- జనన ధృవీకరణ పత్రం
- నివాస ధృవీకరణ పత్రం
- మొబైల్ నంబర్
- పాస్పోర్ట్ సైజు ఫోటో
- తల్లిదండ్రుల ఆధార్ కార్డు
ఈ పథకంలో చేరాలనుకునే వారు మీ సమీపంలోని పోస్టాఫీసును సందర్శించండి.