- పోస్టల్ ఉద్యోగి చేతివాటం
- డిపాజిట్ దారుల రూ.20 లక్షలు కాజేసిండు
- నాగార్జునసాగర్ సబ్ పోస్టాఫీసులో ఘటన
హాలియా, వెలుగు : నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ పైలాన్ కాలనీలోని సబ్ పోస్టాఫీసులో ఖాతాదారులకు సంబంధించిన రూ.20 లక్షల నగదును పోస్ట్ మాస్టర్ మాయం చేశాడు. ఈ సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగార్జునసాగర్ లోని పైలాన్ కాలనీలోని బ్రాంచ్ పోస్టాఫీసులో రామకృష్ణ సబ్ పోస్ట్ మాస్టర్ గా విధులు నిర్వహిస్తున్నాడు.
డిపాజిట్ దారుల నుంచి సేకరించిన రూ.20 లక్షల నగదును వారి అకౌంట్లలో జమచేయలేదు. ఇక్కడి పోస్టాఫీసులో అవకతవకలు జరుగుతున్నాయని ఉన్నతాధికారులకు తెలియడంతో ముగాల రంగయ్య అనే పోస్ట్ మాస్టర్ ను డిప్యూటేషన్ పై ఇక్కడికి పోస్టింగ్ ఇచ్చారు. దీంతో రంగయ్య.. ఖాతాదారుల పుస్తకాలను తనిఖీ చేసి అకౌంట్లో ఉన్న మొత్తాన్ని పరిశీలించగా రూ.15 లక్షలపైనే నగదు స్వాహా అయినట్లు తేలింది. విషయం తెలుకున్న ఖాతాదారులు పోస్టాఫీసుకు వెళ్లి తమ అకౌంట్లను చెక్ చేసుకున్నారు.
డబ్బులు లేకపోవడంతో వారు ఆందోళనకు దిగారు. సబ్ పోస్ట్ మాస్టర్ రామకృష్ణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉన్నతాధికారులు దర్యాప్తు జరిపి న్యాయం చేయాలని కోరారు. కాగా, రామకృష్ణ పరారీలో ఉన్నట్లు సమాచారం. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విజయపురి సౌత్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.