తల్లిపాల ప్రాముఖ్యతను తెలియజేయాలి : కలెక్టర్ తేజస్ నందలాల్

సూర్యాపేట, వెలుగు : తల్లిపాల ప్రాముఖ్యతను ప్రతిఒక్కరికీ తెలియజేయాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధికారులకు సూచించారు. గురువారం కలెక్టర్ చాంబర్ లో పోషణ్ అభియాన్ లో భాగంగా తల్లిపాల వారోత్సవాల పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో ఈనెల ఒకటి నుంచి 7 వరకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ని ప్రభుత్వ, ప్రైవేట్ ప్రసూతి ఆస్పత్రుల్లో ప్రసవించే తల్లులకు తల్లిపాల ప్రాముఖ్యతను వివరించాలని సూచించారు. ఇందులో భాగంగా తల్లిపాల ప్రాముఖ్యత, పౌష్టికాహారంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.  జిల్లా మహిళా, శిశు సంక్షేమశాఖ అధికారి నరసింహారావు, అధికారులు పాల్గొన్నారు. 

కలెక్టర్ ​ఆకస్మిక తనిఖీలు.. 

మునగాల/ నడిగూడెం, వెలుగు : నాగార్జునసాగర్ ఎడమ కాల గట్టుపై ఏర్పాటు చేసిన సంపద వనాలను కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వాటి నిర్వహణ సరిగా లేకపోవడంపై సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  సంపదవనాల నిర్వహణపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించినందుకు ఏపీవో శ్రీనివాస్, టీఏ సురేశ్ కు షోకాజ్ నోటీసు ఇవ్వాలని ఏవోను ఆదేశించారు.

మొదటగా ప్రభుత్వ ఆస్పత్రిని కలెక్టర్​తనిఖీ చేశారు. వైద్యశాలలో మందుల స్టాక్ గదిని పరిశీలించి వైద్యాధికారి ఫణీశ్వరరావుతో మాట్లాడి సిబ్బంది వివరాలు తెలుసుకున్నారు. సరైన వైద్యంతోపాటు మందులు ఇస్తున్నారా..? అని రోగులను అడిగి తెలుసుకున్నారు. అదే సమయంలో విధులకు ఆలస్యంగా వచ్చిన డాక్టర్ టి.విద్యాసాగర్ ను కలెక్టర్ మందలించారు. అనంతరం నడిగూడెం జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల, శ్రీయాదగిరి లక్ష్మీనరసింహ ఫెర్టిలైజర్స్ షాప్, తహసీల్దార్​కార్యాలయం, కస్తూర్బా పాఠశాలను పరిశీలించారు.