- హాజరుకానున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
నల్గొండ అర్బన్, వెలుగు : కాంగ్రెస్ 139వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈనెల 28న ఘనంగా నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు మోహన్ రెడ్డి, నల్గొండ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ రమేశ్ గౌడ్ తెలిపారు. గురువారం నల్గొండలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ 139వ వ్యవస్థాపక దినోత్సవానికి సంబంధించి పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా 28న మధ్యాహ్నం 3 గంటలకు ఎన్జీ కళాశాల నుంచి శివాజీనగర్, రామగిరి, బస్టాండ్ మీదుగా క్లాక్ టవర్ వరకు కాంగ్రెస్ జోడో ర్యాలీ చేపడుతామన్నారు.
సాయంత్రం 5 గంటలకు క్లాక్ టవర్ సెంటర్ లో బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరుకానున్నట్లు వివరించారు. కాంగ్రెస్ జోడో ర్యాలీ, సభకు నియోజకవర్గంలోని కాంగ్రెస్ శ్రేణులు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో నల్లగొండ, తిప్పర్తి, కనగల్ మండలాల పార్టీ అధ్యక్షులు లక్ష్మయ్య, రమేశ్, అనూఫ్ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ సంపత్ రెడ్డి, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు కార్తీక్, నల్గొండ పట్టణ అధ్యక్షుడు నాగరాజు, నాయకులు తదితరులు పాల్గొన్నారు .