ఢిల్లీలో బీజేపీ, ఆప్ మధ్య పోస్టర్‌‌ వార్

ఢిల్లీలో బీజేపీ, ఆప్ మధ్య పోస్టర్‌‌ వార్
  • కేజ్రీవాల్ ఫొటోతో బీజేపీ ‘స్కామ్’ సినిమా పోస్టర్
  • గోట్ సినిమా హీరోలా ఫొటో మార్ఫింగ్ తో ఆప్ కౌంటర్ 

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), బీజేపీ వినూత్న ప్రచారానికి తెర తీశాయి. సూపర్ హిట్ సినిమాలకు చెందిన పోస్టర్లను తమ పార్టీ అధినేతల ముఖాలతో మార్ఫింగ్ చేసి.. వాటిపై ఆ సినిమాలోని ఫేమస్ డైలాగ్స్ నే ముద్రించి ప్రత్యర్థులపైకి అస్త్రాలుగా వదులుతున్నాయి. 

బీజేపీ గురువారం ఆప్ చీఫ్ అర్వింద్ కేజ్రీవాల్ ను విమర్శిస్తూ తన ఎక్స్ అకౌంట్ లో ఓ పోస్ట్ పెట్టింది. హర్షద్ మెహతా స్కామ్ వెబ్ సిరీస్ 'స్కామ్ 1992' సినిమా పోస్టర్ తరహాలో  కేజ్రీవాల్ ఫొటోను మార్ఫింగ్ చేసి..దానికి 'ఓటర్ లిస్టులో స్కామ్  2024' అని టైటిల్ పెట్టింది. దీన్ని తన ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ పెట్టింది. "ఢిల్లీలో కేజ్రీవాల్ కొత్త గేమ్!  దొంగ ఓట్లతో  కేజ్రీవాల్ తన అధికారాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 

ఇటీవల చాలా మందిని ఓటరు జాబితాలో చేర్చారు. అయితే, కొత్త ఓటర్ల వయసు 40 నుంచి 80 ఏండ్ల మధ్య ఉంది. వారందరి అడ్రెస్ కూడా ఒకటే కావడం మరో విశేషం"క్యాప్షన్ ఇచ్చింది. దీనికి  బీజేపీ విమర్శలపై ఆప్ కూడా గట్టిగా  కౌంటర్ ఇచ్చింది. ఏఐ టూల్స్ తో  కేజ్రీవాల్ ను దేశ భక్తుడిగా పేర్కొంటూ 'గోట్(ఆల్ టైమ్ గ్రేటెస్ట్)' సినిమా పోస్టర్ ను వీడియోలా  క్రియోట్ చేసి వదిలింది. ఇలా ఎన్నికల  వేళ ఆప్, బీజేపీ మధ్య వినూత్న పోరు నెలకొంది.