మధుయాష్కీ.. నీకు హైదరాబాద్ తో పనేంటీ.. పోస్టర్లపై కాంగ్రెస్ లో గరం గరం

  • మధు యాష్కీకి ఎల్‌‌‌‌బీ నగర్‌‌‌‌‌‌‌‌  టికెట్‌‌‌‌ ఇవ్వొద్దు
  • ఆయనకు వ్యతిరేకంగా గాంధీ భవన్ వద్ద ఫ్లెక్సీలు
  • సేవ్‌‌‌‌ ఎల్‌‌‌‌బీ నగర్‌‌‌‌‌‌‌‌.. గో బ్యాక్‌‌‌‌ టు నిజామాబాద్‌‌‌‌’’అంటూ పోస్టర్లు 
  • ఇది బీఆర్ఎస్ నాయకుల పనేనని కాంగ్రెస్‌‌‌‌ ఆరోపణలు
  • పోస్టర్ల వెనుక సుధీర్ రెడ్డి హస్తం ఉందన్న మధు యాష్కీ

ఎల్‌‌‌‌బీ నగర్, వెలుగు: మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ అధ్యక్షుడు మధు యాష్కీ గౌడ్‌‌‌‌కు వ్యతిరేకంగా గాంధీ భవన్‌‌‌‌ ముందు ఫ్లెక్సీలు వెలిశాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మధు యాష్కీకి ఎల్‌‌‌‌బీ నగర్‌‌‌‌‌‌‌‌ టికెట్‌‌‌‌ ఇవ్వొద్దని అందులో పేర్కొన్నారు. ‘‘సేవ్‌‌‌‌ ఎల్‌‌‌‌బీ నగర్‌‌‌‌‌‌‌‌.. కాంగ్రెస్‌‌‌‌ పార్టీ ప్లీజ్‌‌‌‌ సే నో టికెట్‌‌‌‌ టు పారాచూట్‌‌‌‌ లీడర్స్‌‌‌‌.. గో బ్యాక్‌‌‌‌ టు నిజామాబాద్‌‌‌‌”అని ఎల్‌‌‌‌బీ నగర్‌‌‌‌‌‌‌‌ కాంగ్రెస్ పార్టీ పేరుతో ఫ్లెక్సీలు వెలిశాయి. దీంతో పార్టీలో కలవరం మొదలవడంతో ఈ ఫ్లెక్సీలతో తమకు సంబంధం లేదంటే తమకు లేదని ఎల్‌‌‌‌బీ నగర్‌‌‌‌‌‌‌‌ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రెస్‌‌‌‌మీట్లు పెట్టి చెబుతున్నారు. ఆ పోస్టర్లను వేయించింది ఎల్బీ నగర్​ టికెట్ ఆశిస్తున్న పార్టీ సీనియర్‌‌‌‌‌‌‌‌ నాయకుడు జక్కిడి ప్రభాకర్ రెడ్డే అన్న ప్రచారమూ జరిగింది. 

అయితే, దీనిపై ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. గాంధీ భవన్ వద్ద ఫ్లెక్సీలు వేసింది తామేనని ప్రచారం జరుగుతోందని, అందులో నిజం లేదని స్పష్టం చేశారు. ఎల్‌‌‌‌బీ నగర్‌‌‌‌‌‌‌‌లో సర్వేలన్నీ తనకు అనుకూలంగానే ఉన్నాయని, దీంతో పార్టీ టికెట్ తనకే వస్తుందని, గెలుపు కూడా తనదే అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కష్టపడే వారిని పార్టీ గుర్తిస్తుందని చెప్పారు. 35 ఏండ్లుగా తాను పార్టీకి సేవ చేస్తున్నానని, కౌన్సిలర్‌‌‌‌‌‌‌‌గా కూడా పని చేశానని పేర్కొన్నారు. పార్టీ నిర్ణయం మేరకు ఎల్‌‌‌‌బీ నగర్‌‌‌‌‌‌‌‌లో పని చేసుకుంటున్నట్లు తెలిపారు. ఈ స్థానం నుంచి తనకే ఎక్కువ గెలుపు అవకాశాలు ఉన్నాయన్నారు. తనకున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక కొంతమంది ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

కోవర్టుల సంగతి తేలుస్తం: మధు యాష్కీ

పోస్టర్ల ఘటనకు సంబంధించి ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఉన్నారని మధు యాష్కీ ఆరోపించారు. ఈసారి తాను ఎల్బీ నగర్ టికెట్ ఆశిస్తున్నానన్న సంగతి తెలిసి సుధీర్ రెడ్డికి భయం పట్టుకుందన్నారు. ఆయన ఓడిపోతాడన్న భయంతోనే పోస్టర్లు వేయించారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసిన వ్యక్తి సుధీర్ రెడ్డి అని అన్నారు. ఆయన వేసే ఎంగిలి మెతుకులకు ఆశపడేవాళ్లు, కోవర్టులు పార్టీలో ఉండి ఉంటారని, వాళ్లే ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని, వాళ్ల సంగతేందో తేలుస్తామని చెప్పారు. 

తనకు ఎల్బీ నగర్ సెగ్మెంట్‌‌‌‌లో మంచి ఫాలోయింగ్ పెరిగిందని, ఇటీవల పెండ్లికి వెళితే ఎంతో మంది నేతలు తనతో మాట్లాడారన్నారు. తాను నాన్ లోకల్ కాదని, పుట్టి పెరిగిందంతా అక్కడేనన్నారు. ఎవరైనా ఎక్కడి నుంచైనా టికెట్ కోసం దరఖాస్తు చేసుకునే హక్కు ఉందని, టికెట్ ఎవరికొస్తుందో ఎవరికి తెలుసన్నారు. కాగా, జక్కడి ప్రభాకర్‌‌‌‌‌‌‌‌ రెడ్డిపై తాను పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారన్న వార్తలను మధుయాష్కీ కొట్టిపారేశారు. తన స్థాయికి ఎవరి మీదా ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. అయితే, మధుయాష్కీ చేసిన కోవర్ట్ వ్యాఖ్యలు పార్టీలో చర్చకు దారి తీశాయి. ఎవరా కోవర్టులంటూ పలువురు నేతలు చర్చించుకుంటున్నారు.

ఇది దుర్మార్గపు చర్య: చల్లా

మధు యాష్కీపై వెలసిన పోస్టర్లపై రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, ఎల్బీనగర్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మల్ రెడ్డి రాంరెడ్డితో కలసి సోమవారం మీడియాతో మాట్లాడారు. మధుయాష్కీని ఉద్దేశించి గాంధీ భవన్ వద్ద పోస్టర్లు వేయడం దుర్మార్గపు చర్య అని పేర్కొన్నారు. ఆ ఫ్లెక్సీలు తమ పార్టీ వారు వేసిన, మిగతా పార్టీల వారు వేసినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌‌‌‌ పార్టీ విజయం ఖాయం అని తెలియడంతో స్థానిక బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ ఎమ్మెల్యే గుండెలో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు. 

రాష్ట్రంలో బలమైన బీసీ నేత మధు యాష్కీ ఎల్‌‌‌‌బీ నగర్ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి భయపడుతూ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మధు యాష్కీ ఎల్‌‌‌‌బీ నగర్ నియోజకవర్గంలోనే పుట్టి పెరిగిన విషయం అందరికి తెలుసని గుర్తుచేశారు. ఎల్‌‌‌‌బీ నగర్‌‌‌‌‌‌‌‌లో కాంగ్రెస్ గెలుపును ఎవ్వరు ఆపలేరన్నారు.