నల్గొండ: మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. వ్యక్తిగతంగా దూషించే విధంగా ఉన్న ఈ పోస్టర్లు చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం మండలాల్లో ప్రత్యక్షమయ్యాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని తీవ్ర పదజాలంతో దూషిస్తూ.. కాంట్రాక్టుల కోసం అమ్ముకున్న వ్యక్తి అని పేర్కొంటూ పోస్టర్లు వేశారు. ఈ పోస్టర్లు ఎవరు వేశారన్నది తెలియడం లేదు. ఆయన వ్యతిరేకులు వేసినట్లు స్పష్టం అవుతోంది.
రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా వేసిన పోస్టర్లపై ఆయన అభిమానులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతల పనేనంటూ మండిపడుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటి చేసి గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొంత కాలంగా ఆ పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. అధికార టీఆర్ఎస్ పార్టీని తీవ్రంగా వ్యతిరేకించిన ఆయన.. సొంత పార్టీకి కూడా దూరమై.. చివరకు బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. అయితే చేరికకు ముందే ఢిల్లీ వెళ్లి అమిత్ షాను కలవడాన్ని కాంగ్రెస్ పార్టీలోని కొందరు తీవ్రంగా వ్యతిరేకించడంతో మనస్తాపానికి గురైనట్లు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటీవల ప్రకటించారు.
టీఆర్ఎస్ ను గద్దె దించడం కోసమే తాను గత్యంతరం లేక బీజేపీలో చేరుతున్నానని స్పష్టం చేశారు. చెప్పినట్లే ఈనెల 8వ తేదీన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యం అయింది. గతంలో జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ హోరాహోరీ పోరాడి అనూహ్య విజయం సాధించడం దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. దేశంలో అతి ఖరీదైన ఉప ఎన్నికగా ప్రచారం జరిగిన హుజూరాబాద్ తర్వాత తిరిగి ఇప్పుడు మునుగోడుకు ఉప ఎన్నికలు వస్తుండడం హాట్ టాపిక్ అయింది.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా వెలసిన పోస్టర్లను ఆయన అభిమానులు, కార్యకర్తలు తొలగిస్తున్నారు. రెచ్చగొట్టే కార్యకలాపాలపై సంయమనం పాటించాలని.. ప్రజాస్వామ్య బద్దంగా వ్యవహరించాలని నాయకులు సూచిస్తున్నారు.