అడ్డంకులను దాటుకొని  టీచర్లుగా.. కల నెరవేరిందని సంబరం

అడ్డంకులను దాటుకొని  టీచర్లుగా.. కల నెరవేరిందని సంబరం

మంచిర్యాల/నెట్​వర్క్, వెలుగు : కష్టాన్ని నమ్ముకుని.. అడ్డంకులు దాటుకుని.. తాము అనుకున్న లక్ష్యాన్ని సాధించారు.. పేదరికం, సంసార బాధ్యతల్లాంటి అవాంతరాలను అధిగమించి టీచర్  ఉద్యోగాలు పొందారు. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీలో ఉద్యోగాలు పొందిన వారికి మంగళవారం ఆయా జిల్లాల్లో నిర్వహించిన కౌన్సిలింగ్​లో పోస్టింగ్​ ఇచ్చారు. ఎన్నో ఏండ్ల తర్వాత తమ కష్టానికి ఫలితం దక్కిందంటున్న కొందరు అభ్యర్థులు  ఎందరికో స్పూర్తినిస్తున్నారు. 

ఇంటర్​లో పెండ్లి.. 40 ఏండ్లకు కొలువు

ఆమె పేద కుటుంబంలో పుట్టింది. మేనమామలు పెంచి పెద్ద చేశారు. చదివించారు. ఇంటర్  కాగానే పెండ్లి చేశారు. అందరి లాగే ఆమె కూడా అత్తారింట్లో అడుగుపెట్టింది. ఇద్దరు పిల్లలు పుట్టారు. తొమ్మిదేండ్లు గడిచాయి. ఇంటర్ తో ఆగిన చదువును కంటిన్యూ చేయాలన్న ఆశ అలాగే మిగిలిపోయింది. అదే విషయాన్ని భర్తతో చెప్పింది. అతడు సరే అన్నాడు. ఫ్యామిలీ మెంబర్స్  ఓకే చెప్పారు.

ఓవైపు పిల్లల పెంపకం, కుటుంబ బాధ్యతలు చూసుకుంటూనే మరోవైపు చదువు కొనసాగించింది. డిగ్రీ, ఆ తర్వాత ఎంఏ హెచ్​పీటీ పూర్తి చేసింది. రెండు సార్లు గవర్నమెంట్ కొలువు వచ్చినట్టే వచ్చి చేజారింది. ఈ ఓటమితో ఆమెలో పట్టుదల మరింత పెరిగింది. డీఎస్సీ–2024లో స్కూల్ అసిస్టెంట్(హిందీ) జిల్లా ఫస్ట్  ర్యాంక్, లాంగ్వేజ్  పండిట్ (ఎల్పీ) సెకండ్  ర్యాంక్  సాధించింది. గవర్నమెంట్  జాబ్ సాధించాలన్న కలను సాకారం చేసుకుంది. పెండ్లి, పిల్లలు, వయసు ఇవేవీ లక్ష్యానికి అడ్డుకాదని నిరూపించింది 

రెబల్లి స్వప్న.. 

‘మా సొంతూరు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్  మండలం కూనారం. మా మేనమామలు కృష్ణస్వామి, మురళి మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్​లో ఉండేవారు. వారికి ఆడపిల్లలు లేకపోవడంతో నన్ను చిన్నప్పటి నుంచి తమ వద్దే పెంచుకున్నారు. ఆర్కేపీలోని సరస్వతి శిశుమందిర్​లో టెన్త్, మంచిర్యాలలో ఇంటర్  చదివాను. ఆ తర్వాత జనగామ జిల్లా బమ్మెర గ్రామానికి చెందిన కృపతో పెండ్లి చేసి అత్తారింటికి పంపారు. నాకు పెండ్లి ఇష్టం లేదని, చదువుకోవాలని ఉందని చెప్పాను. భర్త, అత్తింటి వారు ఒప్పుకున్నా పాప,  బాబు పుట్టారు.

పిల్లల ఆలనాపాలనతోనే తొమ్మిదేండ్లు గడిచిపోయాయి. వాళ్లు స్కూల్​కు వెళ్లడం ప్రారంభించాక ఖాళీ సమయంలో చదువుకుంటూ భర్త, పిల్లల ఎంకరేజ్​మెంట్​తో డిగ్రీ, ఎంఏ హెచ్​పీటీ పూర్తి చేశాను. 2017లో డీఎస్సీ రాసినా, 0.2 మార్కుల తేడాతో జాబ్  మిస్సయింది. గురుకుల్  టీజీటీ, పీజీటీ 1:2కు సెలక్టయినా జాబ్  రాలేదు. అయినా నేను కుంగిపోలేదు. మరింత కసితో చదివాను. ఈలోపు పిల్లలు పెద్దయ్యారు. పాప బీటెక్  ఫైనలియర్, బాబు బీటెక్  ఫస్టియర్  చదువుతున్నారు. మా ఆయన మీ సేవ సెంటర్  నడుపుతారు. పిల్లల చదువులు, ఇంటి ఖర్చులకు బాగా ఇబ్బందయ్యేది. అయినా నేను ఇంట్లో ఉండి చదవడం కుదరదని హాస్టల్​లో చేర్పించి కోచింగ్​కు పంపారు. ఇటీవల జరిగిన డీఎస్సీలో స్కూల్  అసిస్టెంట్(హిందీ) జిల్లా ఫస్ట్  ర్యాంక్, లాంగ్వేజ్  పండిట్  సెకండ్  ర్యాంక్  సాధించాను.

నేను ఇంటర్  వరకు మంచిర్యాలలో చదువుకోవడంతో ఈ జిల్లాలోనే లోకల్ కేటగిరీలో ఎస్ఏ(హిందీ)కి సెలక్టయ్యాను. అనుకున్నది సాధించాను. మంగళవారం బెల్లంపల్లి గవర్నమెంట్  హైస్కూల్​లో పోస్టింగ్  లెటర్  అందుకున్నాను. బుధవారం జాయిన్  అవుతాను. ఇప్పుడు నాతో పాటు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హ్యాపీ!’ అంటూ తన సక్సెస్ స్టోరీ చెప్పుకొచ్చారు. ఇంటర్​లో పెండ్లి చేసుకొని, పిల్లలు పుట్టాకా చదువుకొని, 40 ఏండ్ల వయసులో కొలువు సాధించిన స్వప్న ఎందరో మహిళలకు ఆదర్శం. అంతేకాదు, తన ఇద్దరు పిల్లలకూ ఈ తల్లే ఇన్స్పిరేషన్! 

51 ఏండ్లకు ఉద్యోగం..

మాది మధ్య తరగతి కుటుంబం. గతంలో చాలా సార్లు డీఎస్సీ రాసిన.. బార్డర్ లో మిస్  అయ్యింది. గవర్నమెంట్  జాబ్  లేదని పిల్లను ఇవ్వలేదు. పెళ్లి చేసుకోలేదు. 51 ఏండ్ల వయసులో టీచర్  ఉద్యోగం వచ్చింది. పదర మండలం ఇప్పలపల్లిలో బయాలజీ స్కూల్  అసిస్టెంట్ గా అపాయింట్  అయ్యాను. ఈ జాబ్ తో ఇప్పుడు నా లైఫ్ కు సెక్యూరిటీ వచ్చింది.  

చంద్రమౌళి, అచ్చంపేట

భర్త ఆటో డ్రైవర్  భార్య స్కూల్ అసిస్టెంట్

సిద్దిపేట పట్టణం గణేశ్ నగర్ కు చెందిన ఆటో డ్రైవర్​ కట్టా చంద్రం భార్య కట్టా రజిత బయాలజికల్  సైన్స్  విభాగంలో  స్కూల్  అసిస్టెంట్  ఉద్యోగం సాధించింది. సిద్దిపేటకు చెందిన చంద్రంతో 2010లో రజితకు వివాహం జరిగింది. చదువుపై ఉన్న ఆసక్తిని గమనించిన చంద్రం భార్యను డిగ్రీ, బీఎడ్​ వరకు చదివించారు. భర్త ఆటో నడుపుతూ సంపాదించిన  ఆదాయంతో రజిత ముగ్గురు పిల్లలను సాదుతూనే పదేండ్లుగా వివిధ పోటీ పరీక్షలకు హాజరయ్యారు.

డీఎస్సీ బయోలాజికల్  సైన్స్ లో 17 పోస్టులే ఉండగా, మంచి ర్యాంకు సాధించి ఉద్యోగం దక్కించుకున్నారు. తమ కష్టాలు  పిల్లలు పడకూడదన్న ఆశయంతో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని భర్త ప్రోత్సహించాడు. పిల్లల్ని తానే చూసుకుంటూ చదువుకునేందుకు సహకరించాడు. కోచింగ్​తీసుకునే అవకాశం లేని రజిత ఇంట్లోనే  యూట్యూబ్ లో క్లాసులు వింటూ, బుక్స్​ చదువుతూ డీఎస్సీకి  ప్రిపేరై  లక్ష్యం సాధించింది

ఆఖరి అవకాశంలో..

నా వయసు 48 సంవత్సరాలు. ఈ డీఎస్సే నాకు చివరి అవకాశం. ఎలాగైనా  కొలువు సాధించాలని కష్టపడి చదివాను. రాజన్నసిరిసిల్ల జిల్లా ఎస్సీ కేటగిరిలో రెండో ర్యాంక్, ఓపెన్ లో 12వ ర్యాంక్ వచ్చింది. 2012లో అర మార్క్ తో, 2018 లో కేవలం నాలుగు మార్కులతో కొలువుకు దూరమయ్యాను. ఈ డీఎస్సీనే నాకు చివరిది కావడంతో ఏడాది నుంచి ఇంటి వద్దే ప్రిపేర్  అయ్యాను. కొలువు సాధించాను. మాది నిరుపేద కుటుంబం. చిన్న బట్టల కొట్టు పెట్టాను. బతుకుదెరువు కోసం నాలుగేండ్లు దుబాయ్  కూడా వెళ్లాను. తిరిగొచ్చి డీఎస్సీకి ప్రిపేర్  అయ్యాను. ఉద్యోగం రావడం చాలా ఆనందంగా ఉంది.

తలే దేవదాస్, రాజన్న సిరిసిల్ల జిల్లా

భార్యాభర్తలిద్దరికీ  టీచర్ జాబులు

డీఎస్సీలో భార్యాభర్తలిద్దరూ ఒకేసారి టీచర్  ఉద్యోగాలకు సెలెక్ట్  అయ్యారు. మెదక్​ జిల్లా కొల్చారం మండలం కొంగోడ్ గ్రామానికి చెందిన భార్యాభర్తలు అల్లాదుర్గం శేఖులు, స్వప్న 2017లో డీఎస్సీ ఎగ్జామ్​ రాసినా ఉద్యోగం రాలేదు. నిరాశకు గురికాకుండా ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ కోసం  పట్టుదలతో చదివారు. రెండో ప్రయత్నంలో ఎస్జీటీ విభాగంలో ఇద్దరూ టీచర్  ఉద్యోగాలకు సెలెక్ట్  అయ్యారు. మంగళవారం నిర్వహించిన కౌన్సిలింగ్​లో భార్యాభర్తలిద్దరికీ ఒకే మండలంలో పోస్టింగ్  లభించింది. శేఖులుకు చిలప్ చెడ్  మండలం జగ్గంపేట స్కూల్​లో, స్వప్నకు అదే మండలం అంతారం స్కూల్​లో పోస్టింగ్  ఇచ్చారు.