ఏపీ నుంచి వచ్చిన ఉద్యోగులకు పోస్టింగ్స్

ఏపీ నుంచి వచ్చిన ఉద్యోగులకు పోస్టింగ్స్
  • 44 మందికి శాఖలు కేటాయిస్తూ ఫైనాన్స్ డిపార్ట్​మెంట్ ఉత్తర్వులు

హైదరాబాద్, వెలుగు:  ఏపీలో పనిచేస్తూ స్వరాష్ట్రానికి వచ్చిన తెలంగాణ ఉద్యోగులకు ప్రభుత్వం పోస్టింగ్ లు ఇచ్చింది. ఈ మేరకు 44 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు  ఆయా శాఖల్లో పోస్టింగ్ ఇస్తూ బుధవారం ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. 

ఆయా శాఖలు వెంటనే వీరికి వారి క్యాడర్ కు అనుగుణంగా పోస్టింగ్ ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ 44 మందిలో ఆఫీస్ సబార్డినేట్, జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు, సూపరింటెండెంట్లు ఉన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు కమల్​నాథన్​ కమిటీ వీరిని.. తెలంగాణ  స్థానికత ఉన్నప్పటికీ ఏపీకి అలాట్ చేసింది.  

బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో వీరి సమస్య పరిష్కారానికి నోచుకోలేదు.  2023 డిసెంబర్ లో కాంగ్రెస్  అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ లో తెలంగాణ, ఏపీ సీఎంలు భేటీ అయ్యారు. అందులో ప్రధాన అంశంగా ఉద్యోగుల సమస్యపైనే చర్చించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలంగాణ టీఎన్జీవో నేతలు ఏపీ సీఎస్ ను వెళ్లి కలవడంతో నిరుడు సెప్టెంబర్ లో 44 మంది తెలంగాణ ఉద్యోగులను అక్కడి ప్రభుత్వం రిలీవ్ చేసింది.   

సెప్టెంబర్ 11న వారు ఏపీ నుంచి తెలంగాణకు రిలీవ్ కాగా..  పోస్టులు లేనందున అప్పటినుంచీ ఖాళీగానే ఉన్నారు. కాగా, ఏపీ నుంచి వచ్చిన తెలంగాణ ఉద్యోగులకు పోస్టింగ్ ఇవ్వడంపై టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మారం జగదీశ్వర్, ముజీబ్, హైదరాబాద్ సిటీ ప్రెసిడెంట్ కట్కూరి శ్రీకాంత్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.