ఉపాధి డబ్బులు కాజేసిన పోస్ట్​మాస్టర్​

  • విత్‌ డ్రా పేపర్లపై సంతకాలు తీసుకొని రూ.లక్ష డ్రా చేసిన వైనం
  • 15 రోజులుగా తప్పించుకు తిరుగుతున్న పోస్ట్​మాస్టర్​ 
  • డబ్బులు ఇప్పించాలని ఆందోళనకు దిగిన కూలీలు

గూడూరు, వెలుగు: ఉపాధి హామీ పథకంలో పని చేసిన కూలీలకు అందాల్సిన డబ్బులను ఓ పోస్ట్‌ మాస్టర్‌ కాజేశాడు. మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలంలో కూలీలతో విత్‌ డ్రా పేపర్లపై సంతకాలు తీసుకొని దర్జాగా వారి అకౌంట్ల నుంచి డ్రా చేసుకున్నాడు. పొనుగోడు పంచాయతీ పరిధిలోని టేకులతండాకు చెందిన 32 మంది కూలీలు ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్నారు. రెండు నెలలు చేసిన పనికి డబ్బులను ప్రభుత్వం వారి అకౌంట్లలో జమ చేసింది.

ఈ డబ్బులను కూలీలకు అందించాల్సిన పొనుగోడు పోస్ట్​మాస్టర్​ శరత్‌బాబు కాజేసేందుకు ప్లాన్‌ చేశాడు. గత నెల 24న టేకులతండాకు వచ్చి కూలీలతో విత్‌డ్రా పేపర్లపై సంతకాలు చేయించుకున్నాడు. డబ్బులు అకౌంట్లలో పడతాయని, పిలిచినప్పుడు వచ్చి తీసుకోవాలని చెప్పి వెళ్లిపోయాడు. తర్వాత విత్‌ డ్రా పేపర్లతో కూలీల అకౌంట్లలో డబ్బులను డ్రా చేసుకున్నాడు. కూలీలు తమ డబ్బుల కోసం పోస్ట్‌ ఆఫీస్‌కు ఎన్నిసార్లు వెళ్లినా శరత్‌బాబు కలవడం లేదు.

దీంతో అతడిని ఎలాగైనా పట్టుకోవాలని గురువారం గూడూరు హెడ్‌ పోస్ట్‌ ఆఫీస్‌ వద్ద వేచి ఉన్నారు. అక్కడికి వచ్చిన శరత్‌బాబును పట్టుకొని తమ డబ్బుల విషయంపై నిలదీయడంతో పారిపోయాడు. శుక్రవారం మరోసారి గూడూరు పోస్టాఫీస్​ వద్దకు వచ్చి ఆందోళనకు దిగారు. గూడూరు పోస్ట్​మాస్టర్​ను కలిసి తమ బాధ వెళ్లగక్కారు. దీంతో ఆయన కూలీల అకౌంట్లను చెక్‌ చేయగా గత నెల 24వ తేదీన సుమారు రూ. లక్ష డ్రా చేసినట్టు కనిపించింది.

దీంతో తాము మోసపోయామని గ్రహించిన కూలీలు ఎంపీడీవోను కలిసి పోస్ట్​మాస్టర్​ నుంచి తమ డబ్బులు ఇప్పించాలని డిమాండ్‌ చేశారు.