సత్తుపల్లి, వెలుగు: ఖననం చేసిన మృతదేహానికి పోస్టుమార్టం చేసిన ఘటన మండల పరిధిలోని గంగారంలో శుక్రవారం జరిగింది. ఒకే గ్రామానికి చెందిన బండారి విజయ్ కుమార్ (38), విజయ కుమారితో ఎనిమిదేండ్ల కింద పెండ్లి జరిగింది. విజయ్ కొంతకాలంగా ఖమ్మంలోనీ ఓ గ్రానైట్ ఫ్యాక్టరీలో కూలీగా పనిచేస్తూ అక్కడే నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 4న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని మృతి చెందగా, స్వగ్రామంలో దహన సంస్కారాలు చేశారు.
10 రోజుల తర్వాత తల్లిదండ్రులు బండారి బాబు, వజ్రమ్మ తమ కుమారుడి మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ ఫిర్యాదు చేయగా, ఖమ్మం టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఖమ్మం నుంచి వచ్చిన ఎస్ఐజీ సూరజ్, వైద్యులు రాథోడ్ వినాయక్, సత్తుపల్లి గిర్దావర్ నరేశ్ ఆధ్వర్యంలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు.