పూడ్చిపెట్టిన విద్యార్థిని డెడ్​బాడీకి పోస్టుమార్టం

పూడ్చిపెట్టిన విద్యార్థిని డెడ్​బాడీకి పోస్టుమార్టం
  • 13 రోజల కింద ఆత్మహత్య చేసుకున్న ఇంటర్ స్టూడెంట్
  • మృతిపై అనుమానాలున్నాయని తల్లిదండ్రుల కంప్లయింట్​

టేక్మాల్, వెలుగు: మెదక్​ జిల్లా టేక్మాల్​ మండల పరిధిలో పదమూడు రోజుల కింద పూడ్చిపెట్టిన ఓ విద్యార్థిని డెడ్​బాడీని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. తంపులూర్ ​గ్రామానికి చెందిన సుప్రజ (16) హవేలి ఘన్​పూర్ ​మండల పరిధిలోని మహాత్మా జ్యోతిబా పూలే రెసిడెన్షియల్​ కాలేజీలో ఇంటర్​ ఫస్ట్​ ఇయర్​ చదివేది. గత నెల 30న గురుకులం నుంచి ఇంటికి వచ్చిన సుప్రజ 31న ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

చదువు ఒత్తిడి భరించలేక సూసైడ్​చేసుకుందని కుటుంబసభ్యులు భావించి అంత్యక్రియలు నిర్వహించారు. అయితే,  సుప్రజ చదువు ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోలేదని, అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు కొన్ని నెలలుగా మాయమాటలు చెప్తూ ప్రేమ పేరుతో వేధించాడని తెలిసింది. దీంతో మృతురాలి మామ  సాయిలు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమె మృతిపై తమకు అనుమానాలున్నాయని చెప్పడంతో కేసు నమోదు చేసిన పోలీసులు మంగళవారం పూడ్చిన సుప్రజ డెడ్ బాడీని వెలికి తీసి పోస్టుమార్టం నిర్వహించారు.