వరంగల్, కాశిబుగ్గ, వెలుగు: వరంగల్ రూరల్ జిల్లా గీసుగొండ మండలం గొర్రెకుంటలోని పాడుబడ్డ బావిలో తొమ్మిది మృతదేహాలు బయటపడ్డ ఘటనలో కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. 9 మంది బతికుండగానే బావిలోకి పడినట్లు పోస్ట్‌మార్టం ప్రైమరీ రిపోర్టులో డాక్టర్లు పేర్కొన్నారు. అయితే అందరూ ఆత్మహత్య చేసుకున్నారా? ఎవరైనా మత్తుమందు లేదా విషం ఇచ్చి బావిలోకి పడేశారా? అనే విషయంలో క్లారిటీ రాలేదు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఏడుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. మక్సూద్ బుధవారం సాయంత్రం బీహార్‌కు చెందిన ఇద్దరు యువకులతో చాలాసార్లు ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం. దీంతో పోలీసులు వారి ద్వారా సీన్ రీ కన్స్ట్రక్షన్ చేపట్టి ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. మిస్టరీని చేధించేందుకు ఏడు బృందాలు పని చేస్తున్నట్లు ఆఫీసర్లు చెబుతున్నారు.
గంటలో 30 కాల్స్!
కేసులో పోలీసులు కొంత డెవలప్మెంట్ సాధించినట్లు తెలుస్తోంది. ఎక్కడా ఎలాంటి ఆధారాలు దొరక్కపోవడంతో.. కేవలం మక్సూద్ సెల్ ఫోన్ డేటా ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. మక్సూద్ సెల్‌ఫోన్ నుంచి బుధవారం సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్యలో దాదాపు 20 నుంచి 30 కాల్స్ వెళ్లినట్లు తెలుస్తోంది. అందులో బీహార్‌కు చెందిన సంజయ్ యాదవ్, మోహన్‌తో ఎక్కువగా మాట్లాడినట్లు సమాచారం. తర్వాత మక్సూద్ ఫోన్ వరంగల్‌కు 20 కిలోమీటర్ల దూరంలోని కట్ర్యాల దగ్గర 9 గంటల సమయంలో స్విచ్చాఫ్ అయినట్లు తెలుస్తోంది. మిగతా ఏడుగురి ఫోన్లు బావి దగ్గర 6.30 నుంచి 7.30 గంటల మధ్యలోనే స్విచ్చాఫ్ అయినట్లు పోలీసులు గుర్తించారు. శనివారం సాయంత్రానికి 2ఫోన్లు దొరికినట్లు తెలిసింది. ఘటనా స్థలానికి కొంతదూరంలో పడి ఉన్నట్లు సమాచారం.
సీన్ రీ కన్స్ట్రక్షన్
బావి పరిసరాలు, మక్సూద్ కుటుంబం ఉంటున్న ఇల్లు దగ్గర సైంటిఫిక్ ఎవిడెన్స్ సేకరిచేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. ముందురోజు వారంతా ఎక్కడ భోజనం చేసి ఉంటారు..? అక్కడ ఏం జరిగి ఉంటుంది? అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. వీరందరినీ ఒక్కరే చంపారా? వేరే వాళ్ల హస్తం ఉందా? అంతమందిని బావి దగ్గరికి ఎలా తీసుకెళ్లారు? అనే కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. అదుపులోకి తీసుకున్న ఇద్దరు యువకులను సీన్ రీ కన్స్ట్రక్షన్ కోసం అక్కడికి తీసుకెళ్లారు. మరో నలుగురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఎంజీఎంలో పోస్టుమార్టం చేసిన రజాక్ అలీ..సాయినాథ్ ట్రేడర్స్ ప్రాంగణాన్ని పరిశీలించారు. మరోవైపు మక్సూద్ కుమార్తె బుస్రాకు ఉన్న సంబంధాల విషయం గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇందులో భాగంగా కరీమాబాద్ శాంతినగర్‌కు చెందిన మిద్దెపాక యాకూబ్‌ను విచారించారు.
మత్తు మందా..? విషమా..?
నాలుగు బాడీల మీద స్వల్పగాయాలు ఉన్నట్లుగా పోస్ట్‌మార్టం రిపోర్టులో వెల్లడైంది. చనిపోయే ముందు వీళ్ల మధ్య పెనుగులాట జరిగిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ బావిలో పడినప్పుడు దాని అంచులు, గోడలు గీసుకుపోయే అవకాశం ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. వీరంతా ఏదైనా మత్తుమందు వల్ల అపస్మారక స్థితిలోకి వెళ్లారా..? లేదా పాయిజన్ కలిసిన ఆహారం తిన్నారా.. అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఫుడ్ శాంపిల్స్ కూడా టెస్టుకు పంపించారు. అయితే వాటి రిపోర్టులు రావాలంటే దాదాపు వారం పదిరోజులు పట్టే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
అన్ని కోణాల్లో దర్యాప్తు చేయండి: హోంమంత్రి
హైదరాబాద్,వెలుగు: బావిలో 9 డెడ్ బాడీలు బయటపడ్డ ఘటనపై రాష్ర్ట హోం మంత్రి మహమూద్ అలీ స్పందించారు. కేసు వివరాలను అడిగి తెలుసుకున్న ఆయన.. అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు జరపాలని వరంగల్ సీపీ వి.రవీందర్‌ను శనివారం ఆదేశించారు.