అమ్మకు ఆస్పత్రిలోనే ఎంత కష్టమో!

అమ్మకు ఆస్పత్రిలోనే ఎంత కష్టమో!
  • జగిత్యాల జనరల్​ ఆస్పత్రిలో బాలింతల అవస్థలు
  • ఆపరేషన్​ థియేటర్​ జనరల్​ ఆస్పత్రిలో..
  • పిల్లల వెంటిలేటర్లు  ఎంసీహెచ్​లో ..

జగిత్యాల, వెలుగు : జగిత్యాల జిల్లా కేంద్రం లో ఈ నెల 4న హెల్త్ మినిస్టర్ హరీశ్​ రావు ఎంసీహెచ్(మాతా శిశు సంరక్షణ కేంద్రం) ప్రారంభించారు.  తల్లీ బిడ్డకు  ఓకే దగ్గర మంచి ట్రీట్మెంట్​ అందించాలన్నది ముఖ్య ఉద్దేశ్యం. అయితే  కేంద్రంలో పూర్తి స్థాయి  సేవలు అందడం లేదు.  డెలివరీలు చేసేందుకు  ఎంసీహెచ్ లో సదుపాయలు లేవు.  గర్బిణికి జనరల్ ఆస్పత్రిలో డెలివరీ చేసి,  మెరుగైన ఆరోగ్యం కోసం శిశువును ఎంసీహెచ్ కి తెస్తుండడంతో బాలింతలు, బంధువులు ఇబ్బందులు పడుతున్నారు.   జిల్లా ఆస్పత్రి లో  నెలకు   250–300  వరకూ డెలివరీలు అవుతున్నాయి.   ఎంసీహెచ్​ లో మెటర్నటి, చిల్డ్రన్స్, సైకియాట్రి, జనరల్ మెడిసిన్ సేవలు అందించాల్సి ఉంది.  కానీ  కేవలం ఓపీ సేవలు, చిల్డ్రన్స్ ఐసీయూ సేవలు మాత్రమే అందుతున్నాయి. దీంతో ఎంసీహెచ్ లో ఓపీ చూసిన తర్వాత  జనరల్ ఆస్పత్రికి తరలించి డెలివరీ చేయడంతో అవస్థలు ఎదురవుతున్నాయి.  తల్లి, శిశువు ఆరోగ్యం నిలకడగా ఉంటే మూడ్రోజుల్లో 102 వెహికిల్స్ ద్వారా ఎంసీహెచ్ కు తరలిస్తున్నారు. అప్పుడే సిజేరియన్  అయిన బాలింతలు ట్రావెల్ చేయడంతో ఆరోగ్య సమస్యలు తలెత్తున్నాయి. ఒకవేళ శిశువు ఉమ్మనీరు మింగినా, ఆరోగ్య సమస్యలు తలెత్తినా చికిత్స కోసం ఎంసీహెచ్ కు తరలిస్తున్నారు. దీంతో శిశువు తల్లిపాలకు దూరం కావాల్సిన పరిస్థతులు ఏర్పడుతున్నాయి.
 

శానిటేషన్ సిబ్బంది లేకుండా..
 ఎంసీహెచ్ కి సుమారు 300 మందికి పైగా శానిటేషన్ సిబ్బంది, వార్డు బాయ్స్, సెక్యూరిటీ గార్డు అవసరం ఉండగా, ఇంకా మంజూరు కాలేదు. దీంతో  సిబ్బంది లేకుండానే  సర్జరీలు చేస్తే బాలింతలకు, నవజాత శిశువులకు ఇన్ ఫెక్షన్ వచ్చే అవకాశం ఉందని డాక్టర్లు అభిప్రాయ పడుతున్నారు. పూర్తి స్థాయిలో సేవలు అందుబాటులోకి వచ్చేందుకు ఇంకా ఎన్ని రోజులు టైం పడుతుందో అని స్థానికులు వాపోతున్నారు.   
 

మెరుగైన సేవలందిస్తాం .. 
ప్రస్తుతం ఎంసీహెచ్ బిల్డింగ్ లోకి జనరల్ ఆస్పత్రి నుంచి మెటర్నటి, చిల్డ్రన్స్, సైక్యాట్రి, జనరల్ మెడిసిన్, అప్తమాలజీ సేవలను అందించేలా ఏర్పాట్లు చేశాం. మరో మూడు రోజుల్లో అపరేషన్ థియేటర్ ను అందుబాటులోకి తీసుకువచ్చి, తల్లి శిశువులకు సేవలందిస్తాం-  డాక్టర్ రాములు, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సుపరిండెంట్, జగిత్యాల