మంత్రి వర్గ విస్తరణ వాయిదా! కుదరని ఏకాభిప్రాయం

మంత్రి వర్గ విస్తరణ వాయిదా! కుదరని ఏకాభిప్రాయం
  •  ఢిల్లీ బయల్దేరిన సీఎం రేవంత్ రెడ్డి
  •  పీసీసీ చీఫ్​ పై అధికారిక ప్రకటన!
  •  రాజ్యసభ ఎంపీ పదవికి కేకే రాజీనామా
  •  సీఎం నేతృత్వంలో ఏఐసీసీ పెద్దల సమక్షంలో కాంగ్రెస్ లోకి   

హైదరాబాద్: రాష్ట్ర కేబినెట్ విస్తరణ వాయిదా పడినట్టు తెలుస్తోంది. మొత్తం ఆరు మంత్రి పదవులను భర్తీ చేయాల్సి ఉండగా ఏకాభిప్రాయం కుదరకపోవడంతోనే వాయిదా వేసినట్టు తెలుస్తోంది.  మొత్తం 17 మంది మంత్రులకు గాను 11 మంది మంత్రులు, స్పీకర్ ప్రమాణం స్వీకరించారు. మరో ఆరు పోస్టులను పార్లమెంటు ఎన్నికల తర్వాత భర్తీ చేయాలని కాంగ్రెస్ అధినాయకత్వం భావించింది. 

సామాజిక సమీకరణాలు, పార్లమెంటు ఎన్నికల పెర్ ఫార్మెన్స్ ఆధారంగా ఫైనల్ చేయాలనుకున్నారు. ఆరుగురిలో నలుగురి పేర్లు ప్రచారం  జరిగినప్పటికీ చివరన ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో ఫైనల్ చేసే నిర్ణయాన్ని కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ఏఐసీసీకే అప్పగించింది. కేబినెట్ అంశంపై కూలంకశంగా చర్చించేందుకు సమయం లేకపోవడంతోనే ఏఐసీసీ మంత్రివర్గ విస్తరణను వాయిదా వేసినట్టు సమాచారం. 

ఢిల్లీకి సీఎం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. రాష్ట్రానికి  సంబంధించిన కీలక అంశాలపై చర్చించేందుకు ఆయన హస్తిన బాట పట్టారని సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ నేతృత్వంలో ఏఐసీసీ చీఫ్ ఖర్గే సమక్షంలో బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఆ వెంటనే కేకే తన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తారని తెలుస్తోంది. 

ఇవాళే పీసీసీ చీఫ్ ఫైనల్

పీసీసీ చీఫ్ ఎవరనేది ఇవాళ తేలిపోనుంది. ఆశావహులంతా ఢిల్లీలోనే ఉండటం.. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇవాళ హస్తినబాట పట్టడంతో ఇవాళ తేల్చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పీసీసీ చీఫ్ రేసులో ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ ముందున్నారు. దాదాపు ఆయననే ఫైనల్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, నిజామాబాద్ మాజీ ఎంపీ మధుయాష్కీ, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఢిల్లీలోనే ఉన్నారు. వీళ్లంతా తమ వంతు ప్రయత్నాలను కొనసాగిస్తున్నారని తెలుస్తోంది.