గ్రూప్ 2 వాయిదా .. అభ్యర్థుల విజ్ఞప్తులతో సర్కార్ నిర్ణయం

గ్రూప్ 2 వాయిదా .. అభ్యర్థుల విజ్ఞప్తులతో సర్కార్ నిర్ణయం
  • డిసెంబర్​లో ఎగ్జామ్.. త్వరలో కొత్త తేదీలు: టీజీపీఎస్సీ
  • సీడీపీవో, ఈవో పరీక్షలు రద్దు

హైదరాబాద్, వెలుగు: గ్రూప్ 2 ఎగ్జామ్​ను ప్రభుత్వం వాయిదా వేసింది. అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా.. వాటిని డిసెంబర్​లో నిర్వహిస్తామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) శుక్రవారం ప్రకటించింది. త్వరలోనే కొత్త తేదీలను ప్రకటిస్తామని వెల్లడించింది. రాష్ట్రంలో 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి 2022 డిసెంబర్ 29న టీజీపీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీనికి 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 2023 ఆగస్టు 29,30 తేదీల్లో పరీక్ష నిర్వహిస్తామని అప్పట్లో ప్రకటించారు.

అయితే ప్రిపరేషన్ కు టైమ్ కావాలని నిరుద్యోగులు ఆందోళన చేయడంతో అప్పటి సర్కార్ ఎగ్జామ్ వాయిదా వేసింది. దీంతో అదే ఏడాది నవంబర్ 2,3 తేదీల్లో నిర్వహిస్తామని టీజీపీఎస్సీ కొత్త షెడ్యూల్ ఇచ్చింది. కానీ అప్పుడు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల హడావిడి మొదలుకావడంతో మళ్లీ వాయిదా వేశారు. జనవరి 6,7 తేదీల్లో పరీక్షలు పెడ్తామని రీషెడ్యూల్ రిలీజ్ చేశారు. అయితే రాష్ట్రంలో కొత్త గవర్నమెంట్ రావడంతో పరీక్షలను మరోసారి వాయిదా వేశారు. అప్పటికే కొందరు కమిషన్ సభ్యులు రాజీనామా చేయడంతో కొత్త కమిషన్ ఏర్పడే వరకు ఆగాల్సి వచ్చింది. కొత్త కమిషన్ ఏర్పడిన తర్వాత ఆగస్టు 7,8 తేదీల్లో గ్రూప్ 2 నిర్వహిస్తామని టీజీపీఎస్సీ ప్రకటించింది. మరో మూడు వారాల్లో పరీక్ష నిర్వహించాల్సి ఉండగా, ఎగ్జామ్ మళ్లీ వాయిదా వేయాలని అభ్యర్థులు ఆందోళనలు చేపట్టారు. డీఎస్సీ పరీక్షలు జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు జరుగుతున్నాయని, దీంతో రెండింటికీ మధ్య గ్యాప్ తక్కువగా ఉందని, ప్రిపరేషన్ కు ఇబ్బంది అవుతుందని అభ్యర్థులు ప్రభుత్వానికి విన్నవించారు. అభ్యర్థుల విజ్ఞప్తుల నేపథ్యంలో గ్రూప్ 2 వాయిదాకు ప్రభుత్వం అంగీకరించింది. దీంతో ఎగ్జామ్ ను వాయిదా వేస్తూ శుక్రవారం జరిగిన సమావేశంలో టీజీపీఎస్సీ నిర్ణయం తీసుకుంది.