
కోల్బెల్ట్, వెలుగు: బొగ్గు గనుల పెన్షనర్ల డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని, ఫిబ్రవరి 12న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టనున్న నిరసనను వాయిదా వేసుకున్నట్లు సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు దండం రాజ్ రాంచందర్ రావు, ప్రధాన కార్యదర్శులు భూపెల్లి బానయ్య, ఆళవందార్ వేణు మాదవ్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.
ఆలిండియా కోల్ పెన్షనర్స్ అసోసియేషన్ఆధ్వర్యంలో ఢిల్లీలో ఏఐసీపీఏ అత్యవసర సమావేశం జరిగిందని, కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ అధికారులు బొగ్గు పింఛన్దారుల పెన్షన్ పెంపుదల, ఇతర డిమాండ్లపై సానుకూలత వ్యక్తం చేశారన్నారు. వీటిపై చర్చించేందుకు మార్చి మొదటి వారంలో బిలాస్‌పూర్‌లో నిర్వహించే సదస్సుకు సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్లను కూడా ఆహ్వానించనున్నారని పేర్కొన్నారు. మూడేండ్లుగా డిమాండ్ల సాధన కోసం చేస్తున్న కృషికి ఫలితం దక్కే ఛాన్స్ ఉందని, ఇందుకు అండగా నిలిచిన ఆలిండియా కోల్ పెన్షనర్స్అసోసియేషన్లీడర్లకు రుణపడి ఉంటామన్నారు.