పోలీస్ ​ఆఫీసర్ల పోస్టులు ఖాళీ... డీఐజీ, కమిషనర్​ కుర్చీల్లో ఇన్ చార్జీలు

  • మూడు డీసీపీ స్థానాల్లోనూ అదే పరిస్థితి 

నిజామాబాద్, వెలుగు: రాష్ట్రంలోని పోలీస్​శాఖలో సున్నితమైన జిల్లాగా నిజామాబాద్​కు పేరుంది. అయితే గతంలో ఎప్పుడూలేని రీతిలో ముఖ్యమైన పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి. అధికార పార్టీ పెద్దలు తమకు అనుకూలంగా పనిచేసే వారి కోసం వెతుకుతుండగా, కింది స్థాయి ఆఫీసర్లపై పర్యవేక్షణ కొరవడుతోంది. దీంతో కొందరు ఎస్ హెచ్ఓలు అక్రమ సంపాదన వైపు పరుగులు పెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

కమిషనర్​ లేక నెలన్నర...

పోలీసు కమిషనర్ నాగరాజ్ ​మార్చి నెలాఖరున రిటైరయ్యారు. సాధారణంగా ఒక అధికారి వెళ్లడానికి ముందే కొత్త అధికారి ఎంపిక దాదాపు పూర్తవుతుంది. జిల్లా పోలీసులను నిరంతరం పర్యవేక్షించాల్సిన కమిషనర్​పోస్టు నెలన్నర నుంచి ఖాళీగా ఉంది. నిర్మల్​ఎస్పీ ప్రవీణ్​కుమార్​ప్రస్తుతం నిజామాబాద్​కమిషనర్​గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నాగరాజ్​బ్యాచ్​కు చెందిన ఓ ఐపీఎస్​అధికారిని నియమిస్తున్నట్లు ప్రచారం జరిగింది. కానీ పరిస్థితులు ఆయనకు వ్యతిరేకంగా ఉండడంతో పోస్టింగ్​ఆగిపోయింది. గతంలో జిల్లాలో ఇన్​స్పెక్టర్​గా పనిచేసిన ఓ అధికారి కూతురు గ్రూపు-1 అధికారిగా పోలీసు శాఖలో చేరి ఐపీఎస్​అయ్యారు. ఆమెను నియమిస్తారనే ప్రచారం జోరుగా సాగుతుంది.

ఎన్నికల సీజన్​ అయినందున..

మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగునన్న నేపథ్యంలో కమిషనర్ లాంటి కీలకమైన పోస్ట్​లో తమకు అనుకూలంగా ఉండే వ్యక్తిని నియమించాలని పాలకపెద్దలు యోచిస్తున్నారు. జిల్లాలోని మంత్రి, ఎమ్మెల్సీ అండలు ఉన్న వారే కమిషనర్ పోస్టింగ్​దక్కించుకునే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. ఈ సారి బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్​ పార్టీలు అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఓట్ల పోలరైజేషన్​కోసం పోలీసుల సహాయం తీసుకోవాలని అధికార బీఆర్ఎస్​యోచిస్తోంది. ఇందుకోసం ఇద్దరు అధికారుల (అందులో ఒకరు మహిళ) పేర్లను నిశితంగా పరిశీలిస్తున్నారు.

పెద్దాఫీసర్​కు కింది పోస్టు బాధ్యత 

చంద్రశేఖర్​రెడ్డి ఐజీ హోదాలో ఉన్నారు. గతంలో జిల్లా ఎస్పీగా పనిచేశారనే కారణంతో ఆయన్ను ఇక్కడి డీఐజీ బాధ్యత అప్పజెప్పారు. డీఐజీగా శివశంకర్​రెడ్డి బదిలీ అయ్యాక ఏడాదిన్నర నుంచి ఈ కుర్చీలో పూర్తిస్థాయి అధికారిని నియమించలేదు. చంద్రశేఖర్​రెడ్డి హైదరాబాద్​నుంచి అప్పుడప్పుడు వచ్చివెళ్తున్నారు. కమిషనరేట్​పరిధిలోని మూడు డీసీపీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లా కమిషనర్​తర్వాత అంతటి ప్రయారిటీ ఉన్న కుర్చీలు ఇవి. డీసీపీ (అడ్మిన్) ఉషా విశ్వనాథ్​, డీసీపీ (లా అండ్​ఆర్డర్) అరవింద్​బాబు ట్రాన్స్​ఫర్​తర్వాత కొత్తవారిని నియమించలేదు.

డీసీపీ ఆపరేషన్స్​కార్యాలయానికి కొత్త ఆఫీసర్​పోస్టింగ్​లేక నెలలు గడుస్తున్నాయి. ముఖ్య పోస్టులు ఖాళీగా ఉండడంతో ఎస్ హెచ్ఓలపై ప్రత్యక్ష సూపర్ వైజింగ్​లేకుండా ఉంది. బోధన్, బాల్కొండ, ఆర్మూర్​డివిజన్​లో ఇసుక రీచ్​ఉన్న చోట అక్కడి పోలీసులు వ్యాపారం చేస్తున్నారు. బోధన్​డివిజన్​లోని ఓ ఎస్ఐ నెలన్నర కాలంలో రూ.కోట్లు సంపాదించారనే ప్రచారం పోలీసు శాఖలోనే జరుగుతోంది.