భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: జిల్లా సమగ్రాభివృద్ధిపై సీఎం రేవంత్రెడ్డి స్పష్టమైన విధానం ప్రకటించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్ డిమాండ్ చేశారు. కొత్తగూడెంలోని మంచికంటి భవన్లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. సోమవారం సీఎంతో పాటు పలువురు మంత్రులు జిల్లాలో పర్యటిస్తున్నందున జిల్లాలోని సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలన్నారు.
జిల్లాలో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజ్ బిల్డింగ్ ఇంకా నిర్మాణ దశలోనే ఉందని, సరైన స్పెషలిస్ట్ డాక్టర్లు, వైద్య సిబ్బంది లేరని తెలిపారు. అర్హులైన పేదలందరికీ ఇండ్ల స్థలాలు, డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. కొత్తగూడెంలో పేద ప్రజలకు పొజిషన్ పట్టాలిచ్చిన పాలకులు, అధికారులు స్థలం మాత్రం చూపించలేదన్నారు. గవర్నమెంట్ స్థలాల్లో గుడిసెలు వేసుకున్న ప్రజలకు హక్కు పత్రాలు, పెండింగ్లో ఉన్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని కోరారు. తునికాకు సేకరణకు టెండర్లు పూర్తి చేసి ఆకు సేకరణకు శ్రీకారం చుట్టాలన్నారు. సీతారామ ప్రాజెక్ట్ త్వరగా పూర్తి చేయాలని కోరారు. ఆయన వెంట సీపీఎ జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు, ఏజే రమేశ్, నాయకులు నర్సారెడ్డి, లిక్కి బాలరాజు, భూక్యా రమేశ్ఉన్నారు.