
1988లో ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి చెన్నైకి మంచినీళ్లు ఇవ్వడానికి తెలుగు గంగ ప్రాజెక్టు చేపట్టారు. ఇందుకోసం శ్రీశెలం రిజర్వాయర్ ప్రాంతంలో పోతిరెడ్డిపాడు గ్రామం దగ్గర 4 తూములతో హెడ్ రెగ్యులేటర్ నిర్మించారు. శ్రీశైలం రిజర్వాయర్ పూర్తిగా నిండినప్పుడు మాత్రమే రోజుకు 11,500 క్యూసెక్కుల నీటిని తీసుకోవడానికి సరిపడా కెపాసిటీతోనే దీన్ని నిర్మించారు. రోజుకు ఒక టీఎంసీ చొప్పున చెన్నైకి 15 టీఎంసీలు తీసుకెళ్లాలనేది దీని ఉద్దేశం.
2005లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు జీవో 170తో పోతిరెడ్డిపాడు విస్తరణకు తొలి అడుగువేశారు. నాలుగు తూములకు తోడు మరో ఏడుతూములు నిర్మించారు. దీంతో 11,500 క్యూసెక్కుల కెపాసిటీ కాస్తా 44వేల క్యూసెక్కులకు పెరిగింది. అంటే రోజుకు దాదాపు 4 టీఎంసీల నీటిని డ్రా చేసుకునే స్థాయికి పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంచుకున్నారు. పైగా శ్రీశైలం పూర్తిగా నిండకుండానే 854 అడుగుల మట్టం నుంచే మళ్లించుకునేలా అనుమతించారు. 2020 మేలో ఏపీలో జగన్ సర్కారు రాయలసీమ లిఫ్ట్ పేరుతో జీవో 203 జారీ చేసి, ఎలాంటి అనుమతులు లేకుండా పోతిరెడ్డిపాడు విస్తరణ, సంగమేశ్వరం లిఫ్ట్ ప్రాజెక్టు చేపట్టింది.
సంగమేశ్వరం నుంచి భారీగా నీటిని లిఫ్ట్ చేసి, పోతిరెడ్డిపాడు విస్తరణతో ఏకంగా రోజుకు 80వేల క్యూసెక్కుల నీటిని మళ్లించేలా వేగంగా పనులు చేపట్టారు. దీంతో పాటే బనకచర్ల రెగ్యులేటర్ కెపాసిటీ పెంపు, గాలేరు-నగరి కాలువల విస్తరణకు జగన్ సర్కారు అనుమతించింది. పోతిరెడ్డిపాడు నుంచి శ్రీశైలం మెయిన్ రైట్ కెనాల్ ద్వారా బనకచర్ల రెగ్యులేటర్ కాంప్లెక్స్ కు చేరుకునే నీరు అక్కడ మూడు కాలువకు మళ్లుతుంది.
ముఖ్యంగా వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా తెలుగు గంగ కాలువతో చెన్నైకి మంచినీళ్లు అందిస్తున్నారు. బనకచర్ల నుంచి రెండో మార్గం శ్రీశైలం రైట్ కెనాల్ ద్వారా కర్నూలు, కడప జిల్లాల్లో పలు ప్రాంతాలకు నీరు అందుతుంది. అట్లాగే మూడో మార్గం గాలేరు-నగరి వరద కాలువ ద్వారా మరికొంత నీటిని మళ్లిస్తున్నారు. వీటికి తోడు కేసీ కెనాల్ సమాంతరంగా పోతూ సీమకు నీళ్లిస్తుంది. సంగమేశ్వరం లిఫ్ట్ ద్వారా శ్రీశైలం డెడ్ స్టోరీజీ నుంచి కూడా దొడ్డిదారిన నీళ్లను తీసుకోవడానికి ఏర్పాట్లు చేయడంతో ఈ కాల్వల కెపాసిటీని మరింత పెంచుకుంటున్నారు.