నాణ్యత లేని రోడ్లు, వాటిపై ఏర్పడిన గుంతలవల్ల ఏటా కొన్ని వేల ఆక్సిడెంట్లు జరుగుతున్నాయి. వాటివల్ల చాలామంది చనిపోతున్నారు. ఇంకొందరు గాయాలపాలవుతున్నారు. అయినా ఈ సమస్యల్ని పట్టించుకోవు కొన్ని ప్రభుత్వాలు. వాటితో విసుగెత్తి పోయిన కొన్ని సంస్థలు గుంతల్ని పూడ్చే పనులు చేస్తుంటాయి. అలా బెంగళూరుకు చెందిన డాక్టర్. ప్రతాప్ భీమసేన రావు మొదలు పెట్టిందే ‘పాట్ హోల్ రాజా’. దీని ద్వారా వేస్ట్ ప్లాస్టిక్ మెటీరియల్తో రోడ్లపై గుంతల్ని పూడ్చుతున్నాడు ప్రతాప్.
ప్రతాప్ భీమసేన రావు.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పైలట్‌గా చేసి రిటైర్ అయినా, ప్రజలకు సేవ చేయాలనే అతని కోరిక మాత్రం తగ్గలేదు. అందుకే ‘పాట్ హోల్ రాజా’ పేరుతో ఒక ఎన్జీఓను ప్రారంభించాడు. ఈ ఆలోచన నచ్చి తను చేస్తున్న సాఫ్ట్‌వేర్ జాబ్‌ని వదిలేసి ప్రతాప్‌తో చేరాడు సౌరభ్ కుమార్. ఇద్దరూ కలిసి బెంగళూరులో ఉన్న రోడ్ల గుంతల్ని ప్లాస్టిక్ వేస్ట్‌తో పూడ్చేవాళ్లు. వీళ్లకు కొన్ని ఎన్జీవోలు సాయం చేసేవి. ప్లాస్టిక్ వేస్ట్‌తో పూడ్చిన రోడ్లవల్ల వర్షాకాలంలో నీళ్లు రోడ్లపైనే నిలిచేవి. ఈ సమస్యకి పరిష్కారంగా ఏదైనా చేయాలనుకున్నారు వీళ్లు.
పాట్ హోల్ రాజాతో..
చాలా రీసెర్చ్‌లు చేశాక ‘గ్రిడ్‌మ్యాట్స్’ ఆలోచన వచ్చింది. గ్రిడ్‌మ్యాట్స్ చూడ్డానికి తేనెపట్టులాగ ఉంటాయి. వీటిని పాలీప్రొప్లిన్ వేస్ట్‌తో తయారుచేస్తున్నారు. 100% ప్లాస్టిక్ వేస్ట్‌ని రీసైకిల్ చేసి దీన్ని తయారుచేస్తారు. ఇవి రోడ్డుపై నీళ్లు నిల్వ ఉండకుండా మ్యాట్‌పై ఫ్లో అయ్యేలా చేస్తాయి. నీళ్లని పీల్చుకొని భూమిలోకి పంపుతాయి కూడా. మామూలు ప్లాస్టిక్ రోడ్డు తయారీకి అయ్యే ఖర్చుకంటే 25% తక్కువ ఖర్చు అవుతుంది వీటికి. అంతేకాదు ఎక్కువ కాలం మన్నుతాయి కూడా. వీటిని తయారుచేయడానికి బెంగళూరుకు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న హోసూర్‌లో వీళ్ల వేర్ హౌజ్‌ని స్టార్ట్ చేశారు. హర్యానాలోని ‘సర్వాషాగున్’ కంపెనీతో పార్ట్‌నర్‌షిప్ తీసుకొని మెషిన్స్ కొనుక్కున్నారు. గ్రిడ్‌మ్యాట్స్ తయారుచేయడానికి కావాల్సిన ప్లాస్టిక్ ఎక్కువగా ఇండస్ట్రీస్ గార్బేజ్ నుంచే వస్తుంది. వాటిని ప్లాస్టిక్ రీసైకిల్ కంపెనీలు తీసుకొని శుభ్రం చేసి పాట్‌హోల్‌రాజాకి ఇస్తారు. ఇంకొందరు స్వచ్ఛందంగా సేకరించి ఇస్తుంటారు. వాటితో గ్రిడ్‌మ్యాట్స్ తయారుచేస్తారు ప్రతాప్, సౌరభ్. వాటిని ఒక ఆటోమెటెడ్ మెషిన్ సాయంతో రోడ్డుపై వేస్తారు. ఈ మెషిన్ కేవలం 15 నిమిషాల్లో మూడు స్టేజ్‌ల్లో తన పని పూర్తి చేస్తుంది. ముందు గుంతని చెత్త, తేమ లేకుండా క్లీన్ చేస్తుంది. అందులో హై ప్రెజర్ గాలితో కావాల్సినట్టు గుంతను అడ్జస్ట్ చేస్తుంది. తరువాత గ్రిడ్‌మ్యాట్‌ని అమర్చుతుంది. వీటిని మొదటిసారి ఎబిబి ఇండియా లిమిటెడ్ ఫ్యాక్టరీ, బెంగళూరు పోలీస్ స్టేషన్ పరిధిలో వేశారు. అవి హెవీ వెయిట్‌ని కూడా తట్టుకోవడంతో బెంగళూరులో మిగిలిన ఏరియాల్లో కూడా గ్రిడ్‌మ్యాట్స్‌ని వేశారు.
కార్పొరేట్ కంపెనీల సాయంతో..
పాట్‌హోల్‌రాజాకు చాలాకంపెనీలు డబ్బు సాయాన్ని అందిస్తున్నాయి. వాళ్ల సిఎస్‌ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ)లో భాగంగా ముందుకొచ్చి పాట్‌హోల్‌రాజాతో కలిసి పనిచేస్తున్నారు. పోలీస్, పబ్లిక్ కూడా పాట్‌హోల్‌రాజాతో కలిసిపోతున్నారు. ఎక్కడ పని జరుగుతుంటే అక్కడికి వచ్చి హెల్ప్ చేస్తుంటారు వీళ్లు. ఈ సంస్థ బెంగళూరులో ఉండే చాలామంది కూలీలకు, ట్రాన్స్‌జెండర్లకు ఉపాధి కల్పించింది. కర్ణాటక ప్రభుత్వం బెస్ట్ వలంటీర్ అవార్డ్ కూడా ఇచ్చింది ప్రతాప్‌కు. ఇప్పుడు గ్రిడ్‌మ్యాట్స్ కావాలని దేశంలోని చాలా రాష్ట్రాలతో పాటు, ఆఫ్రికా, దక్షిణ ఆసియా దేశాలు అడుగుతున్నాయట. ‘‘రోడ్డుపై గుంతల్ని చూసినప్పుడు చాలామంది ‘అది గవర్నమెంట్ పని. వాళ్లే వచ్చి చేయాలి’అనుకుంటారు. కానీ, వాటిని రిపేర్ చేసుకోవడం మన బాధ్యత కూడా. ఆ ఆలోచనను పోగొట్టేందుకే పాట్‌హోల్ రాజాని మొదలు పెట్టాం. ఇంతమంది మాకు సాయంగా వస్తారని ఎప్పుడూ అనుకోలేదు. త్వరలో దేశంలోని మిగతా రాష్ట్రాల్లో కూడా గ్రిడ్ మ్యాట్స్‌ని తీసుకొస్తాం” అంటున్నాడు ప్రతాప్.