- వందలాది కిలోమీటర్ల రోడ్లు ఖరాబ్
- మెయిన్ నుంచి గల్లీ రోడ్లదాకా ఇదే పరిస్థితి
- కాలనీల్లోకి ట్రాఫిక్ మళ్లించగా పడిన గుంతలు
- వాహనదారులకు తప్పని ఇబ్బందులు
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్లో ఏ రోడ్డును చూసినా.. ఏ ప్రాంతంలో చూసినా గుంతలే..! మెయిన్ రోడ్లనుంచి అంతర్గత రోడ్ల దాకా సాఫీగా ప్రయాణించేందుకు వీలు లేకుండా ఉంది. వర్షాలు పడక ముందే పాట్ హోల్స్ఉండగా, ఇటీవల వానలకు మరిన్ని గుంతలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం సిటీలో మొత్తం 25వేల పాట్ హోల్స్ఉన్నట్లు బల్దియా అధికారులు అంచనా వేశారు. వాస్తవానికి రోడ్ల పరిస్థితిని చూస్తే ఇంతకు డబుల్‌గా ఉన్నట్లు తెలుస్తుంది. కొన్నిచోట్ల వెహికల్స్ వెళ్లేందుకు ఇబ్బందులు ఉండగా వాహనదారులు వేరే రూట్లలో వెళ్తున్నారు.
కొన్నిచోట్ల పూర్తిగా ఇసుక తేలడంతో చెరువులను తలపిస్తున్నాయి. వర్షాకాలం ప్రారంభమైన తర్వాత పెద్దగా పనులు చేయకపోవడం, కొన్ని ప్రాంతాల్లోనూ రోడ్ల మరమ్మతులు చేసిన.. మళ్లీ వర్షాలు కురవడంతో రిపేర్లు చేసినా కొన్నిరోడ్లు కూడా పూర్తిగా డ్యామేజ్ అయ్యాయి. వానాకాలానికి ముందు నుంచి కూడా రోడ్ల పనులు సరిగా చేయడంలేదు.
70 శాతం రోడ్లపై..
జీహెచ్ఎంసీ పరిధిలో 9,013 కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయి. ఇందులో 2,846 కిలో మీటర్ల బీటీ రోడ్లు, 6,167 కిలోమీటర్ల అంతర్గత రోడ్లు ఉన్నాయి. ఇందులో 70 శాతం రోడ్లపై గుంతలు ఏర్పడ్డాయి. 709 కిలోమీటర్ల మేర ఉన్న సీఆర్ఎంపీ రోడ్లు మినహా మిగతా అన్ని రోడ్లు గుంతలమయంగానే ఉన్నాయి. ప్రతిసారి వర్షాలు పడినప్పుడు వేలల్లో పాట్‌హోల్స్ ఉండటం కామన్. అయినా ప్రస్తుతం మాత్రం రోడ్ల పరిస్థితి చూస్తే అధ్వానంగా ఉంది. అన్ని ప్రాంతాల్లో రోడ్లు డ్యామేజ్ అయినా పట్టించుకునేవారు లేరు.
శివారు మున్సిపాలిటీల్లోనూ ఇదే పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా రోడ్లు ధ్వం సమయ్యాయి. ఇండియన్ రోడ్ కాంగ్రెస్ ప్రకారం బీటీ రోడ్డు వేస్తే ఆరేళ్ల వరకు, అదే విధంగా సీసీ రోడ్డు అయితే10 ఏళ్లు ఖరాబ్ కాకుండా ఉండాల్సి ఉంది. కానీ ఇప్పుడు వేసిన రోడ్లు నెలల వ్యవధిలోనే పూర్తిగా గుంతలు పడుతున్నాయి. జీహెచ్ఎంసీలో అధికారులు, కాంట్రాక్టర్లు అవినీతికి పాల్పడుతుండటంతోనే ఇలా జరుగుతుందన్న ఆరోపణలు ఉన్నాయి. రోడ్లు డ్యామేజ్ అవడానికి ఇది కూడా ఓ కారణమని చెప్పొచ్చు.
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే
రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే హైదరాబాద్ సిటీ ఇలా తయారైంది. డల్లాస్, ఇస్తాంబుల్ తరహాలో సిటీని డెవలప్ చేస్తామని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. ప్రభుత్వం జీహెచ్ఎంసీ కి ఫండ్స్ ఇవ్వకపోవడంతోనే ఈ దుస్థితి ఏర్పడిందని ఎక్స్ పర్ట్స్ పేర్కొంటున్నారు. రోడ్లపై ప్రయాణించాలంటే గుంతులను చూసి జనం భయాందోళనకు గురవుతున్నా కూడా పట్టించుకునే వారు లేరు. ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా గుంతల రోడ్లపై తిరుగుతున్నా ఎందుకు పట్టించుకోవడంలేదో అర్థం కావడంలేదు. ప్రస్తుతం సిటీలో పనులు చేసే కాంట్రాక్టర్లకు కూడా టైమ్ కి బిల్లులు ఇవ్వకపోతుండగా వారు కూడా పనులు చేసేందుకు ముందుకు రావడంలేదు. బల్దియాకు రాష్ట్ర ప్రభుత్వం 3 వేల కోట్లు బాకీ ఉంది.
ఈ ప్రాంతాల్లో ఎక్కువ డ్యామేజ్
టోలిచౌకిలో రోడ్లపై పూర్తిగా ఇసుక తేలి చెరువులను తలపిస్తున్నాయి. ఇక్కడ రోడ్ల రిపేర్లకి సంబంధించి బల్దియా గ్రీవెన్స్ సెల్‌కి ఫిర్యాదులు వస్తున్నాయి. అయితే, పనులు చేయకుండానే పూర్తి చేసినట్లు ఫిర్యాదుదారులకు మెసెజ్‌లు పంపుతున్నారు. బంజారాహిల్స్ లోని ఏసీబీ క్వార్టర్స్, జూబ్లీహిల్స్, నానల్ నగర్, మెహిదీపట్నం, షేక్‌పేట, ప్యారడైస్, రాంగోపాల్‌పేట్, ముసారాంబాగ్, బాలానగర్, ఓవైసీ, బహదూర్‌పురా, ఎల్బీనగర్, కుత్బుల్లాపూర్, పాతబస్తీలోని చాలా ప్రాంతాల్లో రోడ్లు ఎక్కువగా డ్యామేజ్ అయ్యాయి. దీంతో వాహనాలు వెళ్లేందుకు ఇబ్బందిగా ఉంటుండగా.. వేరే రూట్ల నుంచి వెళుతున్నట్లు చెబుతున్నారు. వాహనాలు కాస్తా స్పీడ్ గా వెళితే స్కిడ్ అయి రైడర్లు కింద పడుతున్నారు.
రద్దీగా ఉండే ప్యారడైస్, షేక్‌పేట్, బహదూర్‌పురా లాంటి ప్రాంతాల్లో కూడా పాట్ హోల్స్ ఏర్పడ్డాయి. ఇక కాలనీల రోడ్లను అయితే కనీసం పట్టించుకోవడం లేదు. ఏవో పనుల కోసం గుంతలు తవ్విన ప్రాంతాల్లో కూడా తిరిగి రోడ్లను వేయడం లేదు. ఇప్పటి వరకు గుర్తించిన పాట్ హోల్స్‌ని పూడ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో చేయడం లేదు. శివారులోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోనూ పరిస్థితి అధ్వానంగా తయారైంది. జనాలు రోడ్లు నిర్మించాలని వేడుకుంటున్నా స్పందన లేదు.