వరంగల్ లో మొదలైన ఎన్నికల హడావుడి

వరంగల్: సాధారణ ఎన్నికలకు ఏడాదికి ముందే ఓరుగల్లు పాలిటిక్స్ హీటెక్కాయి. అన్ని పార్టీల ముఖ్య నేతలు ఏదో ఒక ఇష్యూతో జనంలో ఉంటున్నారు. మోడీ సర్కార్  8 ఏళ్ల పాలనపై కమలం నేతలు జనాలకు వివరిస్తున్నారు. పల్లె, పట్టణ ప్రగతి పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు గులాబీ లీడర్లు.  ఇక కేంద్ర, రాష్ట్ర వైఫల్యాలపై  హస్తం పార్టీ పోరుబాట పట్టింది. ఇక ల్యాండ్ పూలింగ్ ఇష్యూతో అన్నదాతలు తమ భూములు  కాపాడుకునేందుకు ఆందోళనలు  చేస్తున్నారు. ఇలా  పొలిటికల్ పార్టీల  ప్రోగ్రామ్స్, సామాన్య ప్రజల పోరాటాలతో  ఓరుగల్లులో  హడావిడి నడుస్తోంది.

ఊరూరా బీజేపీ సంబరాలు...

కేంద్రంలో మోడీ ఎనిమిదేళ్ల పాలనపై ఊరూరా కమలం పార్టీ సంబరాలు నిర్వహిస్తోంది. జిల్లా కేంద్రాలతో పాటు పల్లెల్లోనూ బీజేపీ నాయకులు సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ సర్కార్ వైఫల్యాలు, ప్రజా సమస్యలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. పెంచిన విద్యుత్ , ఆర్టీసీ బస్సు చార్జీలు తగ్గించాలని, ధాన్యం కొనుగోలు చేయాలని బీజేపీ ధర్నాలు చేస్తోంది. బీజేపీ ముఖ్య నేతలు ఈటల రాజేందర్, రఘునందన్  రావులతో సమావేశాలు ఏర్పాటు చేసి క్యాడర్ లో జోష్ నింపుతున్నారు.

పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో గులాబీ లీడర్లు బిజీ...

పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో నిత్యం జనంలో ఉండేలా గులాబీ లీడర్లు ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతిరాథోడ్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. అదే విధంగా బీజేపీ విమర్శలకు కౌంటర్ ఇస్తూ... కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ధాన్యం కొనుగోళ్లు చేయకుండా ప్రభుత్వాన్ని, రైతులను ఇబ్బంది పెడుతున్నారని విమర్శిస్తున్నారు. సికింద్రాబాద్ అల్లర్లకు సంబంధించి రాకేశ్ మృతి అంశాన్ని వాడుకుంటూ టీఆర్ఎస్ పార్టీ కేంద్రంపై విమర్శలకు దిగుతోంది.

రైతు డిక్లరేషన్ తో జోష్ మీదున్న కాంగ్రెస్...

వరంగల్  లో రాహుల్ గాంధీ సభతో  హస్తం పార్టీ యాక్టివ్ అయ్యింది. రచ్చబండ కార్యక్రమం పేరుతో కాంగ్రెస్ నాయకులు ఊరూరా తిరుగుతూ రైతు డిక్లరేషన్ గురించి ప్రజలకు వివరిస్తున్నారు. ఈ క్రమంలోనే హన్మకొండ జిల్లా ఆత్మకూరులో టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డ, ములుగు ఎమ్మెల్యే సీతక్క పర్యటించారు. తాము అధికారంలోకి వస్తే ఏక కాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రచారం చేస్తున్నారు. పంట మద్దతు ధర కల్పిస్తామని చెప్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై వరుస ఆందోళనలు చేస్తున్నారు. అలాగే సికింద్రాబాద్ అల్లర్లకు టీఆర్ఎస్, బీజేపీలే కారణమంటూ కాంగ్రెస్ నేతలు  దాడులు చేస్తున్నారు. 

ప్రజా సమస్యల బాట పట్టిన వామపక్షాలు...

ఇక ప్రజా సమస్యలపై పోరుబాట పట్టాయి వామపక్షాలు. సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీ పార్టీల నాయకులు తమ అనుబంధ సంఘాలతో కలిసి పోరాటాలు చేస్తున్నారు. ఇళ్లు లేని నిరు పేదలకు స్థలాలు ఇవ్వాలని, పెంచిన ఆర్టీసీ చార్జీలు, చార్జీలు తగ్గించాలని డిమాండ్  చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నాయి.

మరోవైపు ఔటర్ రింగ్ రోడ్ కోసం ల్యాండ్ పూలింగ్ కు  రాష్ట్ర ప్రభుత్వం రెడీ అయ్యింది. తమకు జీవనాధారమైన భూములు ఇచ్చేది లేదని రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. దీంతో ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ ను రద్దు చేసుకుంది. ఇలా అన్ని పొలిటికల్ పార్టీల ప్రజల మధ్య బిజీ బిజీగా తిరుగుతుండటంతో ఏడాది ముందే  వరంగలో లో ఎన్నికల వాతావరణం నెలకొంది.