ఖమ్మం టౌన్, వెలుగు : రేషన్ కార్డుతో సంబంధం లేకుండా రైతుల రుణమాఫీ చేయాలని సీపీఐ (ఎంఎల్ ) మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం రామ నర్సయ్య విజ్ఞాన కేంద్రంలోని మాస్ లైన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కుటుంబాన్ని నిర్ణయించడానికి రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకుంటామన్న ప్రభుత్వ ప్రకటనతో, అనేకమంది రైతులు భయాందోళనలకు గురవుతున్నారని తెలిపారు.
తొమ్మిది సంవత్సరాలుగా రేషన్ కార్డులు ఇవ్వలేదన్నారు. అందుకు దాన్ని పరిగణలోకి తీసుకోవద్దని సూచించారు. ల్యాండ్ ఎలీజీబిలిటీ కార్డు ద్వారా రుణాలు పొందిన రైతులందరికీ కూడా రుణమాఫీని అమలయ్యేలా చూడాలని కోరారు. కౌలు రైతులను గుర్తించి వారికి పంట రుణాలు ఇవ్వాలన్నారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా ఖమ్మం జిల్లాకు నీరు అందిస్తున్న ప్రభుత్వం ఇల్లెందు ప్రాంతాన్ని మినహాయించడం సరికాదన్నారు. రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, ఇంటి నిర్మాణానికి డబ్బులు, పెన్షన్లు, పోడు భూములకు పట్టాలు తదితర సమస్యలపై ఈనెల 22న తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన, 29న కలెక్టరేట్ల ఎదుట ప్రదర్శన, ఆగస్టు 21న చలో హైదరాబాద్ కార్యక్రమాలకు పిలుపునిచ్చినట్లు తెలిపారు.
ఆయన వెంట పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కే. రంగయ్య, చిన్న చంద్రన్న, గుమ్మడి నరసయ్య, వి. ప్రభాకర్, గోకినపల్లి వెంకటేశ్వర్లు, ముద్ద బిక్షం,ఎం. కృష్ణ,రామకృష్ణ, గుర్రం ఆచ్చయ్య, ఆవుల వెంకటేశ్వర్లు, జి. రామయ్య, సివై.పుల్లయ్య, అవుల అశోక్ ఉన్నారు.