ఖమ్మం టౌన్, వెలుగు : కోల్ బ్లాక్ ల ప్రైవేటీకరణను కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకోవాలని సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు అన్నారు. ఖమ్మం నగరంలోని ఆపార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం జాతీయ వనరులను, ఖనిజాలను, జాతి సంపదను కార్పొరేట్ కంపెనీలకు అప్పగించే ప్రణాళికను వేగవంతం చేస్తోందని ఆరోపించారు.
దేశంలోని 500 కోల్ బ్లాక్ ల్లో ఇప్పటికే 300 బ్లాక్ లను కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేసిందని గుర్తు చేశారు. ప్రభుత్వ సంస్థలు కోల్ టన్ను ను రూ.3 వేల నుంచి రూ.4 వేలకు అమ్మి, తిరిగి ప్రైవేట్ కంపెనీల నుంచి అదే టన్ను బొగ్గును రూ.18 వేలు పెట్టి 18 లక్షల టన్నులు కొనుగోలు చేయడం జాతి విద్రోహమన్నారు. రానున్న 15 ఏండ్లలో సింగరేణి ఉనికికే ముప్పు వాటిల్లనుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేటీకరణ ను రాష్ట్ర ప్రభుత్వం, రాజకీయ పక్షాలు, కార్మిక సంఘాలు వ్యతిరేకించాలని కోరారు.
భద్రాద్రికొత్తగూడెం : బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటాలు ఉధృతం చేయాల్సిన అవసరం ఉందని సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందా నర్సింహారావు తెలిపారు. కొత్తగూడెం ఏరియా పీవీకే–5ఇంక్లైన్ లో శనివారం ఏర్పాటు చేసిన పిట్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని శ్రావణపల్లి కోల్ బ్లాక్‌ను సింగరేణికి ఇచ్చే విధంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు.
బొగ్గు బ్లాకుల వేలాన్ని నిరసిస్తూ ఐక్య ఉద్యమాలను చేపట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని నాలుగు కోల్ బ్లాక్‌లను సింగరేణికే ఇచ్చే విధంగా కేంద్రం చర్యలు తీసుకోవాలని కొత్తగూడెం ఏరియా ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ రజాక్ పేర్కొన్నారు. కిష్టారం, జేవీఆర్ఓస్ మేనేజర్లతో పాటు పలు డిపార్ట్మెంట్ల అధికారులకు శనివారం వినతిపత్రం ఇచ్చారు.
సత్తుపల్లి : కేంద్ర ప్రభుత్వం చేపట్టిన బొగ్గు గనుల వేలంకు వ్యతిరేకంగా ఐఎన్టీయూసీ జనరల్ సెక్రటరీ త్యాగరాజన్, కొత్తగూడెం వైస్ ప్రెసిడెంట్ రజాక్ శనివారం పీవో ప్రహ్లాద్ కు మెమోరాండం ఇచ్చారు. అనంతరం పిట్ సెక్రటరీ రామారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ సింగరేణి మనుగడను కాపాడేందుకు సమ్మెకైనా వెనకాడబోమన్నారు.
పాల్వంచ : కేంద్ర ప్రభుత్వం దేశంలోని బొగ్గు బావులను ప్రైవేటీకరించేందుకు చేస్తున్న కుట్రను ప్రతి ఒక్కరూ తిప్పి కొట్టాలని సీఐటీయూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షుడు దొడ్డా రవికుమార్ పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ విధానాలను నిరసిస్తూ శనివారం యూనియన్ ఆధ్వర్యంలో పాల్వంచలోని అంబేద్కర్ సెంటర్లో నిరసన తెలిపారు.