
పేదరికం ఒక సాంఘిక, ఆర్థిక సమస్య. ఇందుకు అనేక సాంఘిక, ఆర్థిక, రాజకీయ, వ్యవస్థాపక కారణాలు ఉన్నాయి. పేదరిక ప్రభావం ఒక విషవలయం లాంటిది. నిరుద్యోగం వల్ల పేదరికం, పేదరికం వల్ల నిరుద్యోగం సంభవిస్తుంది. అందువల్ల ఏది కారణమో ఏది ఫలితమో కచ్చితంగా చెప్పలేం. అందువల్ల పేదరిక అంచనాలు కీలకమైనవి. ప్రణాళిక సంఘం, నీతి ఆయోగ్ పేదరిక అంచనాలపై నియమించిన కమిటీలు ముఖ్యమైన సిఫారసులు చేశాయి.
వై.కె.అలఘ్ కమిటీ: ఈ కమిటీని అలఘ్ అధ్యక్షతన ప్రణాళిక సంఘం ఏర్పాటు చేసింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు పేదరిక రేఖను పోషకాల అవసరాలు, వాటి వినియోగ వ్యయం ఆధారంగా నిర్మించారు. గ్రామీణ ప్రాంతాల్లో 2400 క్యాలరీల శక్తి ఇచ్చే ఆహారం, పట్టణ ప్రాంతాల్లో 2100 క్యాలరీల శక్తిని ఇచ్చే ఆహారాన్ని ప్రతిపాదికగా తీసుకుని పేదరికాన్ని లెక్కించాలని సిఫారసు చేసింది. ద్రవ్యోల్బణం కోసం ధరల స్థాయిని సర్దుబాటు చేయడం ద్వారా తర్వాతి సంవత్సరాలకు పేదరిక అంచనాలను లెక్కించాలి.
లాక్డావాలా కమిటీ: ఈ కమిటీని 1989లో ప్రణాళిక సంఘం నియమించింది. 1993లో నివేదిక సమర్పించింది. పేదరికంపై వేసిన మొదటి కమిటీ ఇదే. పారిశ్రామిక కార్మికుల వినియోగదారుల సూచీ(సీపీఐ–సీడబ్ల్యూ), వ్యవసాయ కార్మికుల వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ–ఏఎల్)లను లెక్కించడానికి ఉపయోగించే వస్తువుల, సేవలు పేదల వినియోగ విధానాలను ప్రతిబింబిస్తుందని తెలిపారు.
కమిటీ సూచనలు
- యూఆర్‌పీ (యూనిఫాం రీకాల్ పీరియడ్) పద్ధతిని అనుసరించాలని సూచించింది.
- గ్రామీణ ప్రాంతవాసులు రోజుకి సగటును 2400 క్యాలరీల శక్తినిచ్చే ఆహారం, పట్టణ ప్రాంత వాసులు రోజుకి సగటున 2100 క్యాలరీల శక్తినిచ్చే ఆహారం ఆధారంగా పేదరికాన్ని లెక్కించారు. ఈ రెండింటిని నెలవారీ రూపంలోకి మార్చాలి.
- హెచ్‌సీఆర్ (హెడ్ కౌంట్ రేషియో) పద్ధతి ఆధారంగా వివిధ రాష్ట్రాల వారీగా పేదరికాన్ని లెక్కించాలని సూచించారు.
- రాష్ట్రాల వారీగా పేదరికాన్ని లెక్కించాలి.
- ఈ కమిటీ రాష్ట్రాల మధ్య ఉండే ధర వ్యత్యాసం బట్టి ఆయా రాష్ట్రాలు ప్రత్యేక వినియోగదారుల ధరల సూచీ ఆధారంగా పేదరికాన్ని గణించాలని సూచించింది.
- పట్టణ ప్రాంతాల్లో సీపీఐ–ఐడబ్ల్యూ, గ్రామీణ ప్రాంతాల్లో సీపీఐ–ఏఎల్లను ఉపయోగించి రాష్ట్రాల్లో నిర్దిష్ట దారిద్ర్యరేఖలను రూపొందించాలి.
- జాతీయ ఖాతాల గణాంకాల ఆధారంగా పేదరిక అంచనాల స్కేలింగ్‌ను నిలిపివేయాలి.
సురేష్ టెండుల్కర్ కమిటీ: పేదరికపు అంచనా పద్ధతిని సమీక్షించేందుకు సురేష్ టెండుల్కర్ అధ్యక్షతన నిపుణుల కమిటీని 2005 డిసెంబర్లో ప్రణాళికా సంఘం నియమించింది. ఈ కమిటీ ముఖ్యమైన సూచనలు చేసింది. అవి.. 1. ఎన్ఎస్ఎస్ఓ ద్వారా సేకరించిన ప్రైవేటు కుటుంబ వినియోగ వ్యయం ఆధారంగానే పేదరిక అంచనాలు ఆధారపడి ఉండాలి. 2. ప్రస్తుతమున్న యూనిఫాం రీకాల్ పీరియడ్ (యూఆర్‌పీ), మిక్స్డ్ రీకాల్ పీరియడ్ (ఎంఆర్పీ) పద్ధతిని అనుసరించారు. 3. పేదరిక అంచనాలకు కేవలం క్యాలరీల వినియోగం మాత్రమే ప్రామాణికంగా ఎంచుకోరాదు. దీనికి బదులు కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్‌ను ఉపయోగించాలి. 4. ఎంఆర్పీ పద్ధతిలో అర్బన్ పావర్టీ లైన్ బాస్కెట్ (యూపీఎల్బీ)ను ఉపయోగించాలి. 5. పేదరికాన్ని అంచనా వేస్తూ ఆరోగ్యం, విద్యపై ప్రైవేట్ ఖర్చులను చేర్చాలి. 6. పేదరిక రేఖను నవీకరించాలి. 7. ధరలు, వినియోగ విధానాల్లో మార్పులు చేపట్టాలి. 8. ఈ కమిటీ పేదరికపు గీతను నిర్ణయించడానికి నెలవారి ఆహార వ్యయంతోపాటు అదనంగా ఐదు అంశాలపై వార్షిక సగటు వ్యయాలు కూడా తీసుకోవాలని సూచించింది. అవి.. వస్త్రాలు, విద్య, సంస్థాగత వైద్యం, మన్నికగల వస్తువులు, పాదరక్షలు.
2004-05 పేదరిక రేఖ ఆధారంగా
- గ్రామీణ ప్రాంతాల్లో రూ.446.68 తలసరి నెలసరి వినియోగ వ్యయం
- పట్టణ ప్రాంతాల్లో రూ.578.80 తలసరి నెలసరి వినియోగ వ్యయం
- ఎన్.సి.సక్సేనా కమిటీ: గ్రామీణ ప్రాంతాల్లో బీపీఎల్(బిలో పావర్టీ లైన్) కుటుంబాలను గుర్తించేందుకు సరైన పద్ధతిని సూచించడానికి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ 2009లో ఈ కమిటీని నియమించింది. (బీపీఎల్ అనే జనాభా లెక్కించడానికి. పేదరిక అంచనాలకు కాదు) ఈ కమిటీ మూడు రకాల పద్ధతులను సూచించింది.
ఎస్ఆర్ హషీ కమిటీ: పట్టణ ప్రాంతాల్లో బీపీఎల్ కుటుంబాలను గుర్తించేందుకు ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ కూడా ఆటోమెటిక్ ఎక్స్‌క్లూజన్, ఆటోమెటిక్ ఇన్‌క్లూజన్ లను తీసుకోవాలని సూచించింది. ఈ కమిటీ మూడు పద్ధతుల విధానాన్ని సూచించింది.
రంగరాజన్ కమిటీ: సురేష్ టెండూల్కర్ సూచించిన పేదరిక అంచనాలపై అనేక విమర్శలు రావడంతో ప్రధాన మంత్రి సూచనల మేరకు ప్రణాళికా సంఘం ఈ కమిటీని 2012లో నియమించింది. ఈ కమిటీకి రంగరాజన్ చైర్మన్ కాగా, మహేంద్రదేవ్, మహేశ్ వ్యాస్, కె.ఎల్.దత్తా, కె.సుందరం సభ్యులుగా ఉన్నారు. 2014, జూన్‌లో నివేదిక సమర్పించగా కేంద్ర ప్రభుత్వం ఆమోదించకపోవడం వల్ల సురేష్ టెండూల్కర్ నివేదికనే ప్రస్తుతం కొనసాగుతోంది. కుటుంబం చేసే వినియోగ వ్యయం ఆధారంగా పేదరికాన్ని గణిస్తారు. పోషకాలు అవసరాన్ని రంగరాజన్ కమిటీ సూచించింది.
క్యాలరీలు: పట్టణ ప్రాంతాల్లో 2090 క్యాలరీలు, గ్రామీణ ప్రాంతాల్లో 2155 క్యాలరీలు.
ప్రోటీన్స్: పట్టణ ప్రాంతాల్లో 50 గ్రాములు, గ్రామీణ ప్రాంతాల్లో 48 గ్రాములు
ఫ్యాట్స్: పట్టణ ప్రాంతాల్లో 28 గ్రాములు, గ్రామీణ ప్రాంతాల్లో 26 గ్రాములు