సాదలేక పసికందును అమ్మిన తల్లి

సాదలేక పసికందును అమ్మిన తల్లి
  • రూ.52 వేలకు కొన్న పిల్లల్లేని దంపతులు
  • ఆరుగురిపై కేసు నమోదు
  • నిర్మల్​ జిల్లా ఖానాపూర్​లో ఘటన

ఖానాపూర్, వెలుగు : కన్న బిడ్డను సాదలేక ఓ తల్లి తన బంధువులకు పసికందును విక్రయించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఐ సైదారావ్ తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్​ జిల్లా ఖానాపూర్ కు చెందిన ఆత్రం పద్మ ఈ నెల 6న తన కూతురు ఆత్రం అనిత, ఆమె 21 రోజుల కొడుకుతో కలిసి కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది. మిస్సింగ్  కేసు నమోదు చేసిన పోలీసులు, విచారణ చేపట్టారు. అయితే అనిత తన 21 రోజుల కొడుకును రూ.52 వేలకు అమ్మేసిందని తెలిసి పోలీసులు విస్తుపోయారు.

అనిత తన కొడుకును తీసుకొని కడెం మండలం బెల్లాల్  గ్రామానికి చెందిన తన చిన్నాన్న, చిన్నమ్మలైన కొమ్ము గంగారం అలియాస్ యోగి, భాగ్య వద్దకు వెళ్లింది. తన కొడుకును పెంచడం తనతో కాదని చెప్పడంతో.. సమీప బంధువైన జగిత్యాల జిల్లా సారంగాపూర్  మండలం రంగపేట గ్రామానికి చెందిన బెక్కం లక్ష్మీరాజం, రాధ దంపతులకు పిల్లలు లేరని, వారికి బిడ్డను ఇచ్చేయాలని సలహా ఇచ్చారు.

వారిని సంప్రదించగా, అనితకు రూ.52 వేలు చెల్లించి పిల్లాడిని తమ ఇంటికి తీసుకెళ్లారు. చైల్డ్  ప్రొటెక్షన్  అధికారులు, పోలీసులు పసికందును స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.