- పోల్ టు పోల్ శాటిలైట్ సర్వే చేపట్టిన డిస్కంలు
- విద్యుత్ వ్యవస్థ బలోపేతం కోసం కదిలిన యంత్రాంగం
- ప్రత్యేక యాప్‌లో వివరాలు అప్లోడ్
- మెరుగైన విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కరెంట్ సరఫరాపై విద్యుత్ సంస్థలుస్పెషల్ ఫోకస్పెట్టాయి. కరెంట్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు డిస్కంలు ప్రయత్నాలు మొదలెట్టాయి. కరెంటు వ్యవస్థ పనితీరును ఎప్పటికప్పుడు తెలుసుకొని బలోపేతం చేసే దిశగా కదిలాయి. ప్రత్యేకమైన సాఫ్ట్వేర్, అప్లికేషన్‌ను వినియోగించి పోల్ టు పోల్ వివరాలు నమోదు చేసేందుకు అధికారులు శాటిలైట్ సర్వే చేపడుతున్నారు. విద్యుత్ సరఫరాకు సంబంధించిన వివరాలన్నీ సేకరించి, ప్రత్యేక యాప్‌లో అప్లోడ్ చేయనున్నారు. దీంతో హైదరాబాద్ కార్పొరేట్ ఆఫీస్ నుంచే ఉన్నతాధికారులు ఆన్లైన్లో ఆయా ఏరియాల్లో కరెంటు సరఫరా వ్యవస్థ పనితీరును పర్యవేక్షించే అవకాశం కలుగనుంది.
ఇక వివరాలన్నీ యాప్‌లోనే
విద్యుత్ డిస్కంల పరిధిలోని ఆయా ప్రాంతాల్లో ఉండే సబ్ స్టేషన్ల వివరాలు, ఫీడర్లు, కేటగిరీల వారీగా ఉన్న కరెంటు లైన్లు, కరెంట్ రెగ్యులేటరీ కెపాసిటీ వివరాలు సేకరిస్తున్నారు. కరెంట్పోల్ల మధ్య దూరం, జీపీఎస్ వారీగా వాటి లొకేషన్, పోల్ కెపాసిటీ, పోల్‌పై ఉండే ఐరన్ కాసారాలు, కరెంటు తీగల పరిమాణం, లైన్లకు ఏరకమైన ఇన్సులేషన్ వాడారు? తదితర వివరాలన్నింటితో పాటు ఆయా పరికరాల ఫొటోలను నంబర్‌తో ప్రత్యేక యాప్‌లో అప్లోడ్ చేస్తున్నారు. రాష్ట్రంలో జిల్లాలు, ఏరియాల వారీగా అక్కడ ఇప్పటి వరకు ఎన్ని కరెంట్ పోల్స్ ఏర్పాటు చేశారు? వాటి కెపాసిటీ ఎంత? ఏ సబ్ స్టేషన్ పరిధిలో ఎన్ని కరెంట్ పోల్స్ ఉన్నాయి? కరెంట్ లైన్ల పనితీరు ఎలా ఉంది? ఎలాంటి ఫీడర్లు ఉన్నాయి? లాంటి వివరాలు సేకరించే పనిలో క్షేత్రస్థాయి అధికారులు నిమగ్నమయ్యారు.
తాజాగా చేపడుతున్న కరెంట్ సర్వేలో ప్రతి ఏటా ఎన్ని కొత్త లైన్లు వేస్తున్నారు? కరెంట్ పోల్స్ ఎన్ని ఏర్పాటు చేస్తున్నారు? వీటి కోసం ఎన్ని నిధులు వెచ్చించారు? తదితర వివరాలన్నీ అంచనా వేయొచ్చని ఆఫీసర్లు అంటున్నారు. ఈ సర్వేను విడతలవారీగా కొనసాగిస్తామని డిస్కం అధికారులు చెబుతున్నారు.ఈ ప్రత్యేక సర్వే ద్వారా సేకరించిన వివరాలతో భవిష్యత్తులో ఎక్కడ కరెంట్ సమస్య వచ్చినా సులభంగా పరిష్కరించొచ్చని అంటున్నారు.
దశలవారీగా శాటిలైట్ సర్వే
కరెంటు సరఫరాను పర్యవేక్షించే కార్యక్రమంలో భాగంగా మొదటి దశలో రాష్ట్రంలోని జిల్లా కేంద్రాల్లోని విద్యుత్వ్యవస్థపై సర్వే చేస్తున్నారు. ఆ తర్వాత దశలవారీగా మండల కేంద్రాలు, గ్రామాల్లో ఈ సర్వే చేపట్టనున్నారు. గృహ వినియోగదారులు వినియోగించే 33 కేవీ, 11 కేవీ లో టెన్షన్ లైన్ల వారీగా, కరెంట్పోల్స్ వారీగా పోల్ టు పోల్ సర్వే చేయాలని సిబ్బందికి సదరన్ డిస్కం సీఎండీ ఆదేశాలు ఇచ్చారు. దీంతో టీజీఎస్పీడీసీఎల్ పరిధిలోని జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో సిబ్బంది రంగంలోకి దిగి శాటిలైట్ సర్వే నిర్వహిస్తున్నారు.