హాస్టల్ ఖాళీ చేయిస్తే డ్యూటీ చేయం

  • కేఎంసీలో మహిళా జూడాలపై 
  • ఆఫీసర్ల జులుం

వరంగల్ సిటీ, వెలుగు: కాకతీయ మెడికల్ కాలేజీ హాస్టల్ నుంచి మహిళా జూడాలను ఖాళీ చేయించేందుకు కేఎంసీ ఆఫీసర్లు బిల్డింగ్ కు కరెంట్ సప్లై నిలిపేశారు. దీంతో వాళ్లంతా సోమవారం రాత్రంతా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హాస్టల్ బిల్డింగ్ ఖాళీ చేస్తేనే కరెంట్ కనెక్షన్​ ఇస్తమంటున్నరని, అసలు ఫెసిలిటీస్ లేని బిల్డింగ్ లోకి పొమ్మంటున్నరని వాపోయారు. కరోనా కేసులు పెరుగుతుండడంతో ఆ బిల్డింగ్ ను ఐసోలేషన్ సెంటర్ మార్చేందుకు ఎంజీఎం సూపరింటెండెంట్ సర్క్యులర్ జారీ చేశారు.

హాస్టల్ ఖాళీ చేయిస్తే డ్యూటీ చేయం... 
కరోనా టైంలో ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్న తమను ఆఫీసర్లు ఇబ్బందులకు గురి చేస్తున్నారని, బలవంతంగా హాస్టల్​ ఖాళీ చేయించేందుకు ప్రయత్నిస్తున్నారని జూనియర్​ డాక్టర్లు ఆందోళనకు దిగారు. కేఎంసీ లేడీస్ హాస్టల్ ఎదుట 2016 బ్యాచ్ హౌస్ సర్జన్లు సోమవారం ధర్నా చేశారు. కేఎంసీ ఆఫీసర్ల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హాస్టల్లో ఉన్న సమస్యలను పరిష్కరించకపోగా.. ఆ బిల్డింగ్​ను ఐసోలేషన్ సెంటర్ గా మార్చేందుకు తమను ఖాళీ చేయాలని బలవంతపెడుతున్నారని మండిపడ్డారు. హాస్టల్ కు కరెంట్ కట్ చేసి.. వాటర్​ సప్లై నిలిపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీల్స్ కూడా బంద్ పెట్టి తమను వేధిస్తున్నారని ఆరోపించారు. తమను వేరే బిల్డింగ్​లోకి పొమ్మంటున్నరని.. అక్కడ కనీసం సౌలతులు లేవని చెప్తున్నారు. 82 మందికి 16 రూమ్స్ ఎలా సరిపోతాయని ప్రశ్నించారు. ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకుంటలేరని వాపోయారు. బలవంతంగా ఖాళీ చేయిస్తే డ్యూటీలు బంద్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు.