తమ పాలనా కాలం స్వర్ణయుగమని, తమ హయాంలో కరెంటు కోతలే లేవని, రైతులకు పంట నష్టపరిహారం ఇచ్చామని, రాష్ట్రంలో కరువే రాలేదంటూ బీఆర్ఎస్ అగ్ర నాయకులు ప్రగల్భాలు పలుకుతున్నారు. గులాబీ పార్టీ అధ్యక్షుడు కే.చంద్రశేఖర్‌రావు, ఆయన కొడుకు కేటీ రామారావు, అల్లుడు హరీష్ రావు చేస్తున్న బొంకులు చూసి ప్రజలే ఆశ్చర్యపోతున్న పరిస్థితి. ‘వరి వేసుకుంటే..ఉరి వేసుకునట్లే’ అని తన హయాంలో ప్రకటించిన కేసీఆర్ ఇప్పుడు పంటలు ఎండిపోతున్నాయంటూ పర్యటనలకు వెళ్లడం.. ప్రజాప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేయడం ఎబ్బెట్టుగా ఉంది.
కేసీఆర్ దశాబ్ద పాలన కాలంలో రైతుబంధు పేరిట కొండలు, గుట్టలకు పెద్ద మొత్తంలో ప్రజాధనాన్ని తన కులం వారికి దోచిపెట్టారు. రైతుబంధు పేరుతో రైతులకు ఇతర రూపాల్లో అందాల్సిన రాయితీలు, ప్రోత్సాహకాలు అన్నింటిని నిలిపివేశారు. కేసీఆర్ పాలనా కాలంలో 2014 నుంచి 2023 వరకు యాసంగి పంటలకు నీరు అందక పొలాలు ఎండిపోయాయి. ఎండిపోయిన పంటలకు రైతులు నిప్పు పెట్టిన ఘటనలు, పొలాల్లో పశువులను మేపిన ఘటనలు కోకొల్లలు. నాగార్జున సాగర్, ఎస్సారెస్పీ ఆయకట్టులో యాసంగి పంటల రక్షణకు రైతులు బోర్లు, బావులు తవ్వించిన ఘటనలు అనేకం. వాటిపై నాడు అన్ని పత్రికల్లోనూ ప్రత్యేక కథనాలు కూడా వచ్చాయి. తన పాలనా కాలంలో కేసీఆర్ ఏనాడూ ఎండిన పంటలను పరిశీలించడం గానీ, రైతులకు పంట నష్టపరిహారం అందించిన దాఖలాలు కానీ లేవు.
కేసీఆర్ హయాంలోనే కరువు ఛాయలు
తెలంగాణలో గతేడాది అక్టోబరు తర్వాత సరైన వర్షాలే పడలేదు. డిసెంబరు మొదటివారం వరకు రాష్ట్రంలో కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వమే ఉంది. కేసీఆర్ హయాంలోనే కరువు ఛాయలు కమ్ముకొన్నాయి. అప్పటికే జలాశయాలు అడుగంటాయి. కమీషన్ల కక్కుర్తితో కట్టిన మేడిగడ్డ ప్రాజెక్టు ఎన్నికలకు ముందే గతేడాది అక్టోబరు నెలలో కుంగిపోయింది. మరమ్మతుల కోసమంటూ కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే గేట్లను ఎత్తి నీటిని వదిలేశారు. ఈ విషయాన్ని అప్పుడే కేసీఆర్ మర్చిపోయారా? అసలు డిసెంబరు నాటికి రాష్ట్రంలోని జలాశయాల్లో ఉన్న నీరెంత? యాసంగి పంటల సాగు విస్తీర్ణం ఎంత? అనే అంశాలపై బీఆర్ఎస్ పార్టీ నేతలకు కనీస అవగాహన ఉందా? ఉంటే యాసంగి పంటల విషయంలో ముందుగా రైతులను బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు అప్రమత్తం చేయలేదు. తన పాలనా కాలంలో ఫోన్ ట్యాపింగ్, కమీషన్ల వసూలు, సేవకులకు, నాయకులకు దోచిపెట్టడంలో మునిగిపోయిన కేసీఆర్ యాసంగి సాగు విషయంలో ఎటువంటి సమీక్ష చేయలేదు. అన్నదాతలను అప్రమత్తం చేయలేదు. ఫలితమే ప్రస్తుతం ఎదురవుతున్న సాగునీటి కష్టాలు. జలాశయాల్లో నీరు లేదని తెలిసినా
కాలువలకు సాగు నీరు విడుదల చేయాలని కేసీఆర్ డిమాండ్ చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
అమలులోకి ఎన్నికల కోడ్
అస్తవ్యస్త పరిస్థితి నుంచి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే సమయానికే లోక్‌సభ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చింది. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత రైతు రుణమాఫీని కాంగ్రెస్ కచ్చితంగా అమలు చేస్తుంది. రైతులు, వ్యవసాయం విషయంలో కేసీఆర్‌తో నీతులు చెప్పించుకునే స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. వర్షాభావానికి నిలయమైన తెలంగాణను నాగార్జున సాగర్, జూరాలతో పాటు పదుల సంఖ్యలో చిన్న, మధ్య తరహా జలాశయాల నిర్మాణంతో అన్నపూర్ణగా మార్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాలది. ఈ అంశాన్ని విస్మరించి కాంగ్రెస్ కరువు తెచ్చిందంటూ కేసీఆర్ లేకి బుద్ధిని ప్రదర్శిస్తుంటే అదే నిజమంటూ ఆయన కొడుకు కేటీ రామారావు, అల్లుడు హరీశ్‌రావు వంత కొడుతూ మరిన్ని బొంకులు బొంకుతున్నారు. అహంకారం, అబద్ధాలతో సాగిన కుటుంబ పాలనకు ప్రజలు చరమగీతం పాడిన తర్వాత కూడా వారి తీరులో మార్పురాలేదు. కాలం, కరవు, వర్షం ఎవరి చేతిలో ఉండవనే సోయి కాంగ్రెస్ నేతలకు ఉంది. నిజం చెప్పాలంటే ఇప్పుడు రాష్ట్రంలో కొంత సాగు నీటి సమస్య ఉండవచ్చు తప్ప పూర్తిస్థాయి కరువు లేదు. ఇప్పుడు ఉన్న అసలు కరువు కేసీఆర్ కుటుంబానికి అధికారం లేకపోవడం, వారికి కమీషన్లు వసూలు చేసుకునే అవకాశం లేకపోవడం, బీఆర్ఎస్ పార్టీని వదిలి వెళ్లిపోతున్న నేతలను నిలుపుకొనే విశ్వాసం లేకపోవడమే.
గత ప్రభుత్వ అప్పులతో ఆర్థిక పరిస్థితి అధ్వానం
ప్రపంచవ్యాప్తంగా మారిన వాతావరణ పరిస్థితులతో ఏటేటా రుతుపవనాలు ఆలస్యమవుతున్నాయి. జులై నెలాఖరుకు, ఒక్కోసారి ఆగస్టు నెలలోగానీ జలాశయాల్లోకి నీరు చేరడం లేదు. అంటే ప్రస్తుతం జలాశయాల్లో ఉన్న కొద్దిపాటి నిలవలతోనే మరో నాలుగు నెలలు హైదరాబాద్ నగరంతో పాటు పట్టణాలు, గ్రామాలకు తాగునీరు సరఫరా చేయాల్సి ఉంటుంది. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్న సమయంలో సుమారు పదేండ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై దిగజారుడు విమర్శలు చేస్తూ తన లేకి బుద్ధిని చాటుకుంటు న్నారు. రుణమాఫీ, ఉచిత విద్యుత్ సరఫరా విషయంలో బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సూర్యునిపై ఉమ్మేసినట్లే ఉంది. దేశవ్యాప్తంగా రైతు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్‌ది. ఉమ్మడి రాష్ట్రంలోనే ఉచిత విద్యుత్ సరఫరా చేసిన ఘనత కూడా కాంగ్రెస్‌దే. బీఆర్ఎస్ పదేండ్ల పాలన కాలంలో రైతు రుణమాఫీ హామీని పూర్తిగా నెరవేర్చలేదు. ఇప్పటికే రైతులు బ్యాంకుల రుణ కోరల్లోనే చిక్కుకొని ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన రూ.2లక్షల హామీని నెరవేర్చేందుకు వంద శాతం కట్టుబడి ఉంది. కమీషన్ల కక్కుర్తితో ఇష్టారీతిగా కేసీఆర్ చేసిన అప్పులతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వానంగా మారింది.
- సత్తు మల్లేశం, పీసీసీ ప్రధాన కార్యదర్శి