రామగుండం ప్లాంట్ జెన్​కోకే కేటాయించాలి .. పవర్ ​ఎంప్లాయీస్​ జేఏసీ డిమాండ్

రామగుండం ప్లాంట్ జెన్​కోకే కేటాయించాలి  ..  పవర్ ​ఎంప్లాయీస్​ జేఏసీ డిమాండ్
  • రాష్ట్రవ్యాప్తంగా పవర్ ​ఎంప్లాయీస్​ జేఏసీ నిరసనలు

హైదరాబాద్, వెలుగు : రామగుండం పవర్​ ప్లాంట్​ను సింగరేణి, జెన్​కో జాయింట్​వెంచర్​గా నిర్మించాలని తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పవర్​ఎంప్లాయీస్​ జేఏసీ ఆందోళన చేపట్టింది. ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న  విద్యుత్​ సంస్థల వద్ద బ్యానర్లు, ప్లకార్డులు పట్టుకుని నిరసనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సింగరేణితో జాయింట్​ వెంచర్​ ఒప్పుకునేది లేదని జేఏసీ నేతలు స్పష్టం చేశారు. రామగుండం ప్లాంట్ ను ప్రభుత్వ రంగ సంస్థ అయిన జెన్​కోకే కేటాయించాలని డిమాండ్ చేశారు. జాయింట్​ వెంచర్​ను నిరసిస్తూ.. గత నెల 26  నుంచి విద్యుత్​ సంస్థల్లో ఉద్యోగులందరు నల్లబ్యాడ్జీలతో నిరసనలు చేస్తున్నారు. 

జెన్ కో విద్యుత్​ కేంద్రాల్లో మూడు రోజుల పాటు గేట్​మీటింగ్ లు పెట్టిన జేఏసీ.. శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు విద్యుత్​ కేంద్రాలు, కార్పొరేట్​ ఆఫీసులు, ట్రాన్స్​కో సర్కిల్​ కార్యాయాలు, డిస్కంల సర్కిల్​, డివిజనల్​ ఆఫీసులలో లంచ్​అవర్​ లో నిరసనలు చేపట్టింది. విద్యుత్​సౌధలో జరిగిన నిరసన కార్యక్రమంలో జేఏసీ నేతలు సదానందం, కర్రొళ్ల కిశోర్​,  వెంకట నారాయణరెడ్డి, బాలకృష్ణ, నగేశ్.. మింట్​ కాంపౌండ్​లో జరిగిన ఆందోళనలో జేఏసీ కన్వీనర్​ రత్నాకర్​రావు, కోకన్వీనర్​ బీసీ రెడ్డి, జనప్రియ, వేణు, ఈశ్వర్​దాస్​ తదితరులు పాల్గొన్నారు.