- కాంగ్రెస్ పాలనలో అవే నిర్బంధాలు, అణచివేతలు
- సంపన్న వర్గాల నుంచి అట్టడుగు వర్గాల వరకూ బాధపడుతున్నరు
- తెలంగాణను కాపాడుకునేందుకు మరో సంకల్ప దీక్షకు సిద్ధం కావాలి
- ఈ నెల 29న రాష్ట్రవ్యాప్తంగా దీక్షా దివస్ చేపడుతున్నట్టు వెల్లడి
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్కు అధికారమిస్తే రాష్ట్రాన్ని అంధకారంలోకి నెడుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సంపన్న వర్గాల నుంచి అట్టడుగు వర్గాల దాకా అందరూ బాధపడుతున్నారని వ్యాఖ్యానించారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనతో తెలంగాణలోని ప్రతి వర్గం, ప్రతి మనిషి బతుకు ఛిద్రం అయిందని, మళ్లీ ఇప్పుడు అదే కాంగ్రెస్ పాలనలో అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయని అన్నారు. కాంగ్రెస్ సర్కారు రాగానే అవే నిర్బంధాలు, అవే అణచివేతలు, అవే దుర్భర పరిస్థితులు మొదలయ్యాయని తెలిపారు.
ఆదివారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. నాడు ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ సాధించిన కేసీఆర్ స్ఫూర్తితో.. ఇప్పుడు మళ్లీ రెండు జాతీయ పార్టీల మెడలు వంచాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపైనా ఉందన్నారు. కాంగ్రెస్ కబంధ హస్తాల నుంచి 4 కోట్ల తెలంగాణ ప్రజలను కాపాడుకునేందుకు మరో సంకల్ప దీక్ష చేపట్టాల్సిన అవసరం ఉన్నదని, రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 29న దీక్షా దివస్ను నిర్వహించబోతున్నామని చెప్పారు.
స్వీయ రాజకీయ అస్థిత్వం కావాలె
స్వీయ రాజకీయ అస్థిత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని ప్రొఫెసర్ జయశంకర్ తరచూ చెప్తుండేవారని కేటీఆర్ గుర్తుచేశారు. కాంగ్రెస్ పాలనను చూశాక ప్రజలంతా కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, ఆనాటి పాలన మళ్లీ రావాలనుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంపై కేసీఆర్ వేసిన ముద్రను గుర్తు చేసుకుంటూ రెండు జాతీయ పార్టీలకూ బుద్ధి చెప్పేలా ప్రతి కార్యకర్త ముందుకెళ్లాలని సూచించారు.
దీక్షా దివస్ నిర్వహణకు అన్ని జిల్లాలకూ సీనియర్ నాయకులను ఇన్చార్జులుగా నియమించామని చెప్పారు. ఈ నెల 26న అన్ని జిల్లాల్లోనూ సన్నాహక సమావేశాలు నిర్వహిస్తామన్నారు. కేసీఆర్ దీక్ష ముగించిన డిసెంబర్ 9న మేడ్చల్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని తెలిపారు. కేసీఆర్ దీక్షలో నిమ్స్ హాస్పిటల్ పాత్ర కీలకమని, దీక్షా దివస్ రోజు నిమ్స్హాస్పిటల్లో అన్నదానం, రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమాలను చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.