సూర్యాపేట/నల్గొండఅర్బన్/యాదాద్రి, వెలుగు : స్వాతంత్య్ర పోరాటంలో టీచర్ల పాత్ర ఎంతో గొప్పదని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి చెప్పారు. గురుపూజోత్సవం సందర్భంగా సోమవారం సూర్యాపేట, నల్గొండ, భువనగిరిలో నిర్వహించిన వేడుకలకు ఆయన చీఫ్ గెస్ట్‌గా హాజరై మాట్లాడారు. టీచర్లు క్లాస్‌రూమ్స్‌కే పరిమితం కాకుండా స్వాతంత్య్ర ఉద్యమంలో వారు చేసిన కృషి మరువలేనిదన్నారు. టీచర్లకు సమాజంలో ఎనలేని గుర్తింపు ఉంటుందన్నారు. సమాజ మార్పు కోసం కృషి చేసేవారే టీచర్లని, స్టూడెంట్లలో ఉండే నైపుణ్యాలను వెలికితీసి వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులది కీలకపాత్ర అన్నారు. అనంతరం బెస్ట్ టీచర్లను సన్మానించారు. సూర్యాపేటలో జడ్పీ చైర్‌పర్సన్ గుజ్జ దీపికా యుగంధర్‌రావు, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్, మున్సిపల్ చైర్మన్ అన్నపూర్ణమ్మ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, నల్గొండలో ఎమ్మెల్యేలు గాదరి కిశోర్‌కుమార్, కంచర్ల భూపాల్‌రెడ్డి, రవీంద్రకుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, అడిషనల్ కలెక్టర్ రాహుల్ శర్మ, డీఈవో భిక్షపతి, భువనగిరిలో జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి, మున్సిపల్ చైర్మన్ ఆంజనేయులు, జడ్పీటీసీ బీరుమల్లయ్య, ఎంపీపీ నరాల నిర్మల పాల్గొన్నారు. అలాగే సూర్యాపేట జిల్లాలోని 28 స్కూళ్లకు సంబంధించిన సైన్స్ టెస్టింగ్ కిట్స్‌ను డీఈవోకు అందజేశారు. ట్రాన్స్‌ఫర్లు, ప్రమోషన్లు చేపట్టాలంటూ తపస్ అధ్యక్ష, కార్యదర్శులు పాశం కృష్ణమూర్తి, జైని వెంకటేశ్వర్ భువనగిరిలో మంత్రికి వినతిపత్రం అందజేశారు. అలాగే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా టీచర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వేపల్లి రాధాకృ-ష్ణ ఫొటోకు పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం టీచర్లను సన్మానించారు.
పింఛన్ల మంజూరులో తెలంగాణ రికార్డు
ఆసరా పింఛన్ల మంజూరులో తెలంగాణ ప్రభుత్వం రికార్డు సృష్టిస్తోందని మంత్రి జగదీశ్‌రెడ్డి చెప్పారు. నల్గొండ మండలంలోని పలువురు లబ్ధిదారులకు మంజూరైన పింఛన్ కార్డులను సోమవారం ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డితో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాకముందు పింఛన్ల రూపంలో రూ. 800 కోట్లు ఇస్తుండగా, తెలంగాణ వచ్చాక రూ. 12 వేల కోట్లు అందజేస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అడ్డుకునేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రం నుంచి పన్నులను వసూలు చేస్తున్న కేంద్రం తాను ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోగా లోన్లు మంజూరు కాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, ఎమ్మెల్యే రవీంద్రనాయక్, నల్గొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి పాల్గొన్నారు.
మునుగోడులో అందరినీ కలుపుకొని పోతం
మునుగోడు ఉపఎన్నికలో చిన్నా, పెద్ద అన్న తేడా లేకుండా అందరినీ కలుపుకొని ముందుకు పోతామని మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి చెప్పారు. సోమవారం నల్గొండలో జరిగిన టీచర్స్ డే ప్రోగ్రాం అనంతరం మీడియాతో మాట్లాడారు. మునుగోడులో టీఆర్‌ఎస్ క్యాండిడేట్ గెలుపే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. సమాచారలోపంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, వాటిని సరి చేసుకొని మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ను కూడా కలుపుకుపోతామన్నారు.