సూర్యాపేట జిల్లా : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని ఆపేందుకు కుట్ర జరుగుతోందని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపించారు. అన్ని పర్యావరణ అనుమతులు తీసుకున్న తర్వాతే నిర్మాణం మొదలుపెట్టామని చెప్పారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్ జీటీ) తీర్పు ఏకపక్షంగా ఉందన్నారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం ఆపాలంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఈ కామెంట్స్ చేశారు.
ఎన్ జీటీ తీర్పు యావత్ దేశానికి నష్టం కలిగేలా ఉందని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. వేల కోట్ల రూపాయలతో నిర్మాణం చేపట్టిన తర్వాత వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడం సరైంది కాదని చెప్పారు. ప్లాంట్ నిర్మాణం ఆపాలంటూ లేవనెత్తిన అంశాలు పూర్తి అసంబద్ధంగా ఉన్నాయని తెలిపారు. ‘ముంబైలో ఉన్న సంస్థకు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కు సంబంధం ఏంటి..? దీని వెనకాల కచ్చితంగా కుట్ర దాగి ఉంది’ అని వ్యాఖ్యానించారు.
గతంలో ఇదే సంస్థ కేసు వేసినప్పుడు ఎన్ జీటీ ట్రిబ్యునల్ కేసు కొట్టి వేసిందని, కేసు వేసిన ముంబై సంస్థ వెనకాల అదృశ్య శక్తులు ఉన్నాయని మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపించారు. అన్ని చట్టాలకు లోబడే యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం జరుగుతోందన్నారు. ఎన్ జీటీ తీర్పుపై రివ్యూ పిటిషన్ వేస్తామని చెప్పారు. అనుకున్న సమయానికల్లా యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం పూర్తి చేసి, ఉత్పత్తి ప్రారంభిస్తామని తెలిపారు. యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం ఆపాలని వచ్చిన తీర్పుపై న్యాయ పోరాటం చేస్తామన్నారు.
అనుమతులు పొందాం : అధికార పార్టీ నేతలు
సుమారు రూ.30వేల కోట్ల నిధులతో 4,000 మెగావాట్ల సామర్థ్యంతో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కేంద్ర పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ నుంచి ఈసీ (ఎన్విరాన్ మెంట్ క్లియరెన్స్ ) 2017, జూన్ 29వ తేదీన పర్యావరణ అనుమతులు పొందామని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఆ తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం ప్లాంట్ నిర్మాణ పనులను ప్రారంభించిందని అంటున్నారు.