సూర్యాపేట, వెలుగు: సమాజాన్ని పట్టి పీడిస్తున్న కుల అంతరాలు పోవాలంటే చదువు ఒక్కటే మార్గమని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి చెప్పారు. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం ఐలాపురం గ్రామంలో రూ. 4.2 కోట్లతో నిర్మించిన టీటీడబ్ల్యూఆర్‌జేసీ బాలికల స్కూల్, కాలేజీని ఆదివారం ప్రారంభించారు. అలాగే పట్టణంలోని ముదిరాజ్, పెరిక కమ్యూనిటీ భవనాలకు శంకుస్థాపన చేయడంతో పాటు ఎస్సీ, ఎరకల కమ్యూనిటీ భవనాలు ఓపెన్ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కాలేజీకి కాంపౌండ్ వాల్, రోడ్డు నిర్మాణం, సోలార్ స్ట్రీట్ లైట్లతో పాటు సీసీ కెమెరాల ఏర్పాటుకు నిధులు మంజూరు చేశామని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని చెప్పారు. ప్రతి కులానికి ఆత్మగౌరవ భవనాలు నిర్మించడంతో పాటు అన్ని విధాలుగా అండగా ఉంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సంజీవ్ నాయక్ , గ్రామ సర్పంచ్ బి సునీత, కాలేజీ ఆర్సీ కే లక్ష్మయ్య, ప్రిన్సిపాల్ మంజుల పాల్గొన్నారు.