హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు, నాలాల పరిరక్షణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రాపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. హైడ్రా కూల్చివేతలు, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్‌పై సచివాలయంలో ఇవాళ (అక్టోబర్ 7) భట్టి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.
అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు నిరాధార ఆరోపణలు చేస్తున్నాయని.. తప్పుడు ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని సీరియస్ అయ్యారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోన్న మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్‌పై తప్పుడు ప్రచారంతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ విషయంలో కాంగ్రెస్ నేతలకు వ్యక్తిగత అజెండా లేదని.. ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన మాత్రమే ప్రభుత్వానికి ఉందని భట్టి స్పష్టం చేశారు.
హైదరాబాద్ అంటేనే లేక్స్, రాక్స్, పార్క్స్ అన్నారు. కానీ గడిచిన కొన్ని సంవత్సరాల నుండి నగరంలో రాక్స్, పార్కులు కబ్జాలకు గురయ్యాయని.. ఇక మిగిలిన లేక్స్ కూడా కబ్జాలకు గురి కావొద్దనే మా ప్రభుత్వ ఆలోచన అని హైడ్రా కూల్చివేతలపై క్లారిటీ ఇచ్చారు. హైదరాబాద్ మహానగరాన్ని భవిష్యత్ తరాలకు అందించాలనేదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఇది ప్రజా ప్రభుత్వం.. పారదర్శక ప్రభుత్వమని పేర్కొన్నారు.