- టెక్నికల్ సమస్యతో రెండు యూనిట్లు బంద్
జైపూర్, వెలుగు : మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలో సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్(ఎస్టీపీపీ) లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. కొద్ది రోజులుగా సాంకేతిక కారణాలతో పవర్ ఉత్పత్తి పూర్తిగా ఆగిపోయింది. యూనిట్ –1లో గత నెల 20 న టర్బైన్ లీకుతో ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయినట్లు తెలిసింది. యూనిట్– 1లో నుంచి సాంకేతిక సమస్యలు ఏర్పడడంతో యాన్యువల్ ఓవరాలింగ్ పనులు చేస్తున్నట్లు ఓ అధికారి చెప్పారు.
ఈనెల 1 నుంచి యూనిట్–2లో కూడా ట్యూబుల లీకేజీతో ఎస్టీపీపీలో పూర్తి స్థాయిలో పవర్ ప్రొడక్షన్ ను ఎస్టీపీపీ ఆఫీసర్లు నిలిపివేసినట్లు తెలిసింది. 600 మెగావాట్ల ఒక యూనిట్ నుంచి రోజు సుమారు 13 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఉత్పత్తి నిలిచిపోతే ఒక యూనిట్ ద్వారా సుమారు రూ.6 కోట్ల వరకు నష్టం జరుగుతుందని కార్మికులు ఆందోళన చెందుతున్నారు.
ఈ విషయంపై ఎస్టీపీపీలోని పర్సనల్ డిపార్ట్ మెంట్ ఆఫీసర్ ను వివరణ కోరగా యూనిట్ –1 లో యాన్యువల్ ఓవరాలింగ్ పనులు జరుగుతున్నాయని, యూనిట్ 2లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయిన విషయం తమ దృష్టికి రాలేదని చెప్పారు.