బడ్జెట్​ లో విద్యుత్​ శాఖకు భారీగా నిధులు కేటాయింపు

బడ్జెట్​ లో విద్యుత్​ శాఖకు భారీగా నిధులు కేటాయింపు
  • విద్యుత్ శాఖకు పవర్​ బడ్జెట్‌‌లో రూ.21,221 కోట్లు
  • నిరుటి కంటే రూ.4,815 కోట్లు ఎక్కువ
  • అగ్రికల్చర్‌‌‌‌కు ఫ్రీ కరెంట్ కోసం రూ.11,500 కోట్లు
  • గృహజ్యోతి స్కీమ్, ఇతర సబ్సిడీలకు రూ.3 వేల కోట్లు

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వం బడ్జెట్‌‌లో విద్యుత్ శాఖకు భారీగా నిధులు పెంచింది. ఈసారి రూ.21,221 కోట్లు కేటాయించింది. పోయిన బడ్జెట్‌‌లో రూ.16,410 కోట్లు కేటాయించగా, ఈసారి రూ.4,815 కోట్లు పెంచింది. వ్యవసాయ రంగానికి అందించే విద్యుత్ సబ్సిడీ కోసం రూ.11,500 కోట్లు కేటాయించింది. 

గృహజ్యోతి పథకం కింద అమలు చేస్తున్న ఫ్రీ కరెంట్ కోసం, 30 వేల ప్రభుత్వ విద్యాసంస్థలకు అందిస్తున్న ఉచిత విద్యుత్​కోసం రూ.3వేల కోట్ల కేటాయింపులు చేసింది. విద్యుత్ శాఖకు కేటాయించిన నిధుల్లో ప్రగతి పద్దు కింద ట్రాన్స్‌‌కోకు రూ.14,444.42 కోట్లు ప్రతిపాదించింది. ఇది పోయినేడాది రూ.11,905.62 కోట్లుగా ఉంది. అంటే నిరుటి కంటే రూ.2,539.40 కోట్లు పెంచింది.

 ఇందులో వ్యవసాయనికి ఉచిత విద్యుత్,​ ఇతర సబ్సిడీలకు గాను రూ.8,260 కోట్లు, స్పిన్నింగ్ మిల్లుల కరెంట్ సబ్సిడీకి రూ.50 కోట్లు, గృహజ్యోతి స్కీమ్‌‌కు  రూ.1,523.48 కోట్లు, విద్యుత్ బాండ్ల కోసం రూ.72 లక్షలు, బయోమాస్ టారీఫ్ ఇన్సెంటివ్స్‌‌కు రూ.10 కోట్లు, డిస్కంలు, ట్రాన్స్‌‌కోకు సాయం కోసం రూ.1,509.40 కోట్లు, విద్యాసంస్థల సబ్సిడీ కోసం రూ.198.87 కోట్లు, జెన్​కోకు సాయం కోసం రూ.754.70 కోట్లు, సోలార్ విలేజ్​ స్కీమ్​ కోసం రూ.1,132.05 కోట్లు, ఈఆర్సీకి రూ.25 లక్షలు, గ్రీన్​ఎనర్జీ పాలసీ ప్రమోషన్ ​కోసం రూ.754.70 కోట్లు, ఉదయ్ పథకం కింద విద్యుత్ సంస్థలకు ఇచ్చిన హామీలో భాగంగా రూ.250 కోట్లు, తెలంగాణ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌‌కు రూ.25 లక్షలు కేటాయించింది.

40 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ లక్ష్యం.. 

రాష్ట్రంలో గరిష్ట విద్యుత్ డిమాండ్ 16,918 మెగావాట్లకు చేరుకున్నా, ప్రజలకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని ప్రభుత్వం బడ్జెట్‌‌లో పేర్కొంది. సంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగంపై దృష్టిసారించామని తెలిపింది. ‘‘ఇందుకోసం క్లీన్ అండ్​ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025 ప్రకటించాం. 2030 నాటికి 20 వేల మెగావాట్లు, 2035 నాటికి 40 వేల మెగావాట్ల గ్రీన్​ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నాం. గ్రిడ్ స్థిరత్వాన్ని మెరుగుపరిచేందుకు శంకర్ పల్లి వద్ద 250 మెగావాట్ల/500 మెగా హెడ్జ్‌‌ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నాం. సింగరేణి, రెడ్‌‌కో జాయింట్​వెంచర్‌‌‌‌గా జియో థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని సాధించే ప్రయత్నాలు చేస్తున్నాం” అని చెప్పింది. 

రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ అంబులెన్స్ సేవలు.. 

నల్గొండ జిల్లా దామరచర్లలో జెన్‌‌కో నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ 2 యూనిట్లలో ఉత్పత్తి ప్రారంభమైందని, 2025 మే నాటికి మొత్తం 5 యూనిట్లలోనూ విద్యుత్ ఉత్పత్తి చేయడానికి  చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం పేర్కొంది. ‘‘ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలు అందించేందుకు విద్యుత్ అంబులెన్స్ సర్వీస్‌‌ను ప్రారంభించాం. విద్యుత్ సమస్యలపై1912 టోల్ ఫ్రీ నంబర్‌‌‌‌కు ఫిర్యాదు చేసిన వెంటనే, సిబ్బంది చేరుకొని సమస్యను పరిష్కరిస్తారు. ఈ అంబులెన్స్‌‌లో ఒక ఏఈ, ముగ్గురు లైన్‌‌మెన్లు ఉంటారు. ఒక ట్రాన్స్‌‌ఫార్మర్, థర్మల్ విజన్ కెమెరాలు, రిపేరింగ్​ పరికరాలు ఉంటాయి. హైదరాబాద్‌‌లో 57 సబ్ డివిజన్లకు ఒక్కో వాహనం కేటాయించాం. త్వరలో రాష్ట్రమంతా విస్తరిస్తాం” అని తెలిపింది.