
మయన్మార్లోని ఓ ప్రాంతంలో భూకంపం తర్వాత భూమిలో నుంచి నీళ్లు ఉబికి వస్తుండటం విస్మయానికి గురిచేసింది. ఒక్కోసారి వందల అడుగులు బోరు వేసినా దొరకని నీళ్లు భూకంపం దెబ్బకు పొంగుకుంటూ వస్తున్నాయని ఈ వీడియో చూసిన వాళ్లంతా నోరెళ్లబెట్టారు. అయితే.. భూకంపం వల్ల వాటర్ లైన్స్ పగిలిపోయి ఇలా అయి ఉండొచ్చని.. అంతేతప్ప ఇవి భూమి లోపల నుంచి వస్తున్న నీళ్లు కావని ఎక్కువ మంది నెటిజన్లు అభిప్రాయపడ్డారు. భూ ఫలకాల్లో మార్పులు సంభవించినప్పుడల్లా భూకంపాలు సంభవిస్తుంటాయి.
Magnitude 7.7 quake in Myanmar causes water to surface from the ground 😮 pic.twitter.com/HCJEiSDqdj
— BladudX (@BladudX) March 29, 2025
నేపాల్, టిబెట్, భూటాన్, చైనాలోని ఎత్తైన ప్రాంతాలపై దీని ప్రభావం ఉంటుంది. ఇండియన్, యూరేషియన్ ఫలకాల మధ్య రోజూ జరుగుతున్న ఘర్షణలే.. ఈ భూకంపాలకు కారణం అవుతున్నాయి. ఈ ఫలకాల మధ్య రాపిడి కారణంగానే హిమాలయాలు ఏర్పడ్డాయి. భవిష్యత్‌లోనూ భూకంప ప్రమాదాలు పొంచి ఉన్నాయని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు.
భూకంపం ధాటికి మయన్మార్, బ్యాంకాక్ చిగురుటాకులా వణికిపోయాయి. చాలా బిల్డింగ్లు పేక మేడల్లా కుప్పకూలిపోయాయి. జనమంతా భయంతో వీధుల్లోకి పరుగులు తీశారు. నిమిషాల వ్యవధిలోనే ఆరుసార్లు భూమి కంపించింది. మెయిన్ రోడ్లు, బ్రిడ్జీలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆఫీసులు, షాపింగ్ మాల్స్ గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి. ప్లాట్‌ఫామ్‌పై ఉన్న మెట్రో రైళ్లు ఊగిపోయాయి.
Also Read :- భూకంపానికి ముందు.. తర్వాత మయన్మార్ ఎలా ఉందో చూడండి..!
మయన్మార్లో భూకంపం కారణంగా వెయ్యి మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 2 వేల మందికి పైగా గాయాలపాలయ్యారు. భూకంపం ధాటికి పెద్ద పెద్ద భవనాలు పేక మేడల్లా కూలిపోయాయి. పలుచోట్ల ఎత్తైన ఆలయాలు, గోపురాలు కుప్పకూలాయి. మండాలెలో ఇర్రవడ్డీ నదిపై ఉన్న అతి పురాతన అవా బ్రిడ్జి కూలిపోయింది. నేపిడాలోని వెయ్యి పడకల హాస్పిటల్ కుప్పకూలింది. ఇక్కడ భారీగా ప్రాణ నష్టం సంభవించింది.
సెంట్రల్ మయన్మార్‌లోని మోనివా నగరానికి తూర్పున 50 కిలో మీటర్ల దూరంలో 10 కిలో మీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే గుర్తించింది. థాయ్ లాండ్ లోనూ భూకంపం విధ్వంసం సృష్టించింది. బిల్డింగ్లపై ఉన్న ఓపెన్ స్విమ్మింగ్ పూల్స్లోని నీళ్లు కిందకు పడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. థాయ్లాండ్ ప్రధాని షినవత్ర ఆ దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించారు.