నేపాల్ భూకంపం విధ్వంసమే సృష్టించింది.. 100 దాటిన మృతులు.. వేలాది ఇళ్లు నేలమట్టం

నేపాల్ భూకంపం విధ్వంసమే సృష్టించింది.. 100 దాటిన మృతులు.. వేలాది ఇళ్లు నేలమట్టం

ఎటు చూసినా నేలమట్టమైన ఇండ్లూ, గృహ సముదాయాలు, కుప్పలు కుప్పలుగా పడి ఉన్న శకలాలు, దేహి దేహి అంటూ వినిపిస్తున్న ఆర్తనాదాలు, తవ్వే కొద్ది బయట పడుతున్న మృతదేహాలు.. వెరసి చల్లగా, శీతల గాలులతో మనోరంజకంగా ఉండే టిబెట్ ఇప్పుడు శవాల దిబ్బగా కనిపిస్తోంది. మంగళవారం (7 జనవరి 2025) ఉదయం సంభవించిన భారీ భూకంపంతో టిబెట్ లో సుమారు 100 మంది చనిపోయారు. రిక్టర్ స్కేలుపై 7.1 మ్యాగ్నిట్యూడ్ తో సంభవించిన ఈ భూకంపం నేపాల్ ను కూడా షేక్ చేసింది. అదే విధంగా  ఇండియాలోని కొన్ని ప్రాంతాలపై భూకంప తీవ్రత ప్రభావం చూపింది. ఈ మేరకు చైనా మీడియా వెల్లడించింది. 

ఎవరెస్టు శిఖరానికి ఉత్తర ద్వారంగా పిలుచుకునే టింగ్రీ గ్రామంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైందని, ఈ  విపత్తులో సుమారు 95 మంది చనిపోగా, 135 మందికిపైగా గాయపడినట్లు చైనా ప్రకటించింది. అయితే మృతుల సంఖ్య తాజాగా 100కు చేరినట్లు చైనా మీడియా తెలిపింది. ఎవరెస్టుకు 80 కిలోమీటర్ల దూరంలో ఎపిక్ సెంటర్ ఉందని వెల్లడించింది. 

భూకంప ధాటికి  నేపాల్ బార్డర్ గ్రామాలలో స్వల్ప ప్రభావం ఉందని, ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని నేపాల్ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. సహాయక చర్యల నిమిత్తం విపత్తు నిర్వహణ బలగాలను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. 

భూకంప ప్రభావం టిబెట్ లోని పవిత్ర ప్రాంతమైన షిగాట్సె నగరంతో పాటు టిబెటన్ బుద్ధిస్టులకు ఆరాధ్య ప్రాంతమైన పంచన్ లామా పైన కూడా పడింది. సహాయక చర్యల కోసం అన్ని బలగాలను ప్రభావిత ప్రాంతాలలో దింపామని, ఇండ్లు కోల్పోయిన వారికి పునరావాసం ఏర్పాటు చేస్తున్నట్లు చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ తెలిపారు. 

ALSO READ | సౌదీ అరేబియాలో కుండపోత వర్షం.. కొట్టుకుపోయిన కార్లు.. మునిగిపోయిన ఇళ్లు

భూకంప కేంద్రం నమోదమైన టింగ్రి గ్రామంలో ఒకదాని వెంట ఒకటిగా వచ్చిన కంపనాలతో చాలా వరకు గృహాలు నేలమట్టం అయినట్లు చైనా మీడియా తెలిపింది. భూకంప కేంద్రం ఉన్నటువంటి 20 కిలోమీటర్ల పరిధిలో 6 వేల 9 వందల మంది నివసిస్తున్న 27 గ్రామాలలో దాదాపు ఒక వెయ్యి  ఇండ్లు నేలమట్టం అయ్యాయని న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. 

అయితే 1950 నుంచి ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో 21 భూకంపాలు సంభవిస్తే.. 2017లో 6.9 తీవ్రతతో వచ్చిన భూకంపం పెద్దదని తెలిపింది. మంగళవారం సంభవించిన భూకంపం వీటన్నింటికంటే తీవ్రమైనదని, దాదాపు వంద మంది మృతి చెందగా, చాలా వరకు ఆస్తి నష్టం జరిగినట్లు చైనా మీడియా తెలిపింది.