అమెరికాను వణికిస్తున్న భారీ తుఫాన్.. టోర్నడోల బీభత్సం.. ఎగిరిపోతున్న ఇళ్ల పైకప్పులు.. విస్తరిస్తున్న మంటలు

అమెరికాను వణికిస్తున్న భారీ తుఫాన్.. టోర్నడోల బీభత్సం.. ఎగిరిపోతున్న ఇళ్ల పైకప్పులు.. విస్తరిస్తున్న మంటలు

అమెరికాను తుఫాన్ అతలాకుతలం చేస్తోంది. టోర్నడోల బీభత్సంతో ఏకంగా ఇళ్ల పైకప్పులే ఎగిరిపోతున్నాయి. దాదాపు 145 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలులతో జనజీవనం స్థంభించిపోయింది. బుధవారం (మార్చి 5) టోర్నడోలు సృష్టించిన బీభత్సానికి ఓక్లహోమా నగరంలో ఇళ్ల పైకప్పులు ఎగిరిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ తుఫాన్ ధాటికి ముగ్గురు మృతిచెందడంతో రెడ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు. 

పసిఫిక్ వైపు నుంచి వస్తున్న తుఫాన్ కారణంగా కాలిఫోర్నియాతో పాటు పశ్చిమ ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తుఫాన్ తో పాటు వస్తు్న్న బలమైన టోర్నడోలతో పలు నగరాలు, గ్రామాలు నేలమట్టమయ్యే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కాలిఫోర్నియా ప్రభుత్వం ప్రకటించింది.

కరోలినా, ఫ్లోరిడా, విర్జీనియా ప్రాంతాలలో భారీగా టోర్నడోలు ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని బుధవారం హెచ్చరికలు జారీ చేశారు. యూనియన్ విల్లీ ఏరియాలో సంభవించిన భారీ టోర్నడో కారణంగా (145 kph) దాదాపు అన్ని వ్యవస్థలు దెబ్బతిన్నాయని, పవర్ సప్లై పూర్తిగా నిలిచిపోయిందని తెలిపారు. 

ఇక టెక్సాస్ ప్రాంతంలో భారీగా వీస్తున్న గాలులతో అటవీ ప్రాంతంలో మంటలు విజృంభిస్తున్నాయని అధికారులు తెలిపారు. ఈ మంటలు గ్రామాలకు వ్యాపించడంతో ఒకరు కాలిపోయినట్లు ప్రకటించారు. అదే విధంగా 20 గ్రామాలకు మంటలు అంటుకుని తీవ్ర నష్టం వాటిల్లినట్లు తెలిపారు. 

తుఫాన్ చేసిన విలయానికి దక్షిణ అమెరికా రాష్ట్రాలలో వేలాది మంది ప్రజలు కరెంటు లేక చీకట్లో మగ్గుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. టెక్సాస్ లో వ్యాపార సంస్థలతో పాటు 51 వేల ఇండ్లకు కరెంట్ సప్లై నిలిచిపోయింది. విర్జీనియాలో 27 వేలు, టెన్నెస్సీలో 17 వేల ఇండ్లకు పవర్ సప్లై నిలిచిపోయినట్లు తెలిపారు. మొత్తం 800 ఫ్లైట్స్ క్యాన్సల్ చేశారు.