270 కిలోల ట్రయిల్.. విషాదకరంగా ప్రాణాలు కోల్పోయిన పవర్ లిఫ్టర్

270 కిలోల ట్రయిల్.. విషాదకరంగా ప్రాణాలు కోల్పోయిన పవర్ లిఫ్టర్

17 ఏళ్ల మహిళా పవర్ లిఫ్టర్, గోల్డ్ మెడల్ విజేత యష్టికా ఆచార్య(Yashtika Acharya) విషాదకరంగా ప్రాణాలు కోల్పోయింది. కోచ్ పర్యవేక్షణలో జిమ్‌లో శిక్షణ పొందుతున్న సమయంలో 270 కిలోల బరువును ఎత్తబోయి.. బార్‌బెల్ మెడపై పడి అక్కడిక్కడే ప్రాణాలు వదిలింది. 

బార్‌ మెడపై పడిన కొద్ది క్షణాల్లోనే .. అక్కడున్న వారు CPR చేసి యష్టికను బ్రతికించే ప్రయత్నం చేశారు. వెంటనే ఆమెను అత్యవసర వైద్యం కోసం సమీప ఆసుపత్రికి తరలించారు. కానీ, వారి ప్రయత్నాలు ఫలించలేదు. ఆమె ఆస్పత్రికి చేరుకునే లోపే మరణించింది. అందుకు సంబంధించిన వీడియో అందరినీ కంట తడి పెట్టిస్తోంది. అధిక బరువు కావడంతో కోచ్ ఏమీ చేయలేకపోయాడు. బరువైన రాడ్డు మెడ మీద పడటంతో ఆ భాగంలోని ఎముకలు, నరాలు పూర్తిగా దెబ్బతిన్నట్లు వైద్యులు తెలిపారు.

గోల్డ్ మెడల్

ఇటీవల రాజస్థాన్ స్టేట్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ నిర్వహించిన పోటీల్లో యష్టికా ఆచార్య రెండు పతకాలు గెలుచుకుంది. ఎక్విప్డ్ విభాగంలో స్వర్ణం, క్లాసిక్ విభాగంలో రజతం సాధించింది.

యష్టిక తండ్రి ఐశ్వర్య ఆచార్య (50) ఒక కాంట్రాక్టర్. ఈయనకు నాలుగు కుమార్తెలు కాగా.. వీరిలో ఇద్దరు పవర్ లిఫ్టర్లు. ఈ ఘటనపై కుటుంబసభ్యులు ఎటువంటి చట్టపరమైన ఫిర్యాదు దాఖలు చేయనప్పటికీ, పోలీసులు స్వతంత్ర దర్యాప్తు మొదలు పెట్టారు.