జాతీయ బీసీ కమిషన్​ అధికారాలేంటి.?

జాతీయ బీసీ కమిషన్​ అధికారాలేంటి.?

 

ఇందిరా సహానీ వర్సెస్​ భారత ప్రభుత్వం వ్యాజ్యంలో సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి  జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్​ ఏర్పడింది. 1993లో పార్లమెంట్​ ఆమోదించిన చట్టాన్ని అనుసరించి నేషనల్​ బ్యాక్​వర్డ్​ క్లాసెస్​ను ఏర్పరిచారు. ఇది చట్టబద్ధ కమిషన్​. నేషనల్​ బ్యాక్​ వర్డ్​ క్లాసెస్​ కమిషన్​కు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించాలనే ఉద్దేశంతో నరేంద్ర మోదీ ప్రభుత్వం 102వ రాజ్యాంగ సవరణ ద్వారా జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్​కు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించారు. జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ పేరును ఇకముందు జాతీయ విద్య, సామాజిక వెనుకబడిన తరగతుల కమిషన్​(ఎన్​సీఈఎస్​బీసీ)గా పేర్కొంటారు. 

కేల్కర్​ కమిషన్

340వ అధికరణ రాష్ట్రపతి ఓబీసీ స్థితిగతులను అధ్యయనం చేసి వారి సంక్షేమం కోసం చేపట్టాల్సిన చర్యలను సూచిస్తూ నివేదికను సమర్పించాలని కోరుతూ కమిషన్​ ఏర్పాటు చేయవచ్చు. రాజ్యాంగం, చట్టంపరంగా ప్రభుత్వాలు కల్పించిన అవకాశాల అమలు తీరును ఈ కమిషన్​ పర్యవేక్షిస్తుంది. బీసీల సంక్షేమం కోసం చేపట్టాల్సిన చర్యలను సూచిస్తూ కమిషన్​ సమర్పించిన నివేదికను కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్​ ముందు ఉంచుతుంది. 1953లో నెహ్రూ ప్రభుత్వం మొదటి బీసీ కమిషన్​ కాకా సాహెబ్​ కేల్కర్​ నేతృత్వంలో ఏర్పాటు చేసింది. 1951 జనాభా లెక్కల ప్రకారం కేల్కర్​ కమిషన్​ బీసీల జనాభా 52 శాతం ఉన్నట్లుగా పేర్కొన్నది. 3473 బీసీ కులాలు ఉన్నట్లుగా పేర్కొన్నది. 330 కులాలను ఎంబీసీలుగా అంటే అత్యంత వెనుకబడిన వర్గాలుగా పేర్కొన్నది. ఓబీసీలకు ప్రత్యేక రిజర్వేషన్​ సౌకర్యాలు కల్పించాలని సూచించింది. కాకా సాహెబ్​ కేల్కర్​ సూచన అమలుకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఓబీసీలకు విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను మొదటగా మైసూర్​ (కర్ణాటక) ప్రభుత్వం కల్పించింది. బిహార్​ రాష్ట్రంలో ఓబీసీలకు ముఖ్యమంత్రి బి.పి.మండల్​ రిజర్వేషన్లను కల్పించారు. సమైక్య రాష్ట్రంలో 1960 దశాబ్దం చివరిలో ఓబీసీలకు సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రిజర్వేషన్​ కల్పించారు.

బి.పి.మండల్​ కమిషన్​

1978లో జనతా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో ఓబీసీలకు రిజర్వేషన్​ కల్పించే అంశంపై అధ్యయనం చేసి తగిన నివేదిక సమర్పించాలని కోరుతూ బి.పి.మండల్​ నేతృత్వంలో ఒక ప్రత్యేకమైన రెండో వెనుకబడిన తరగతుల కమిషన్​ను ఏర్పాటు చేసింది. మండల్​ కమిషన్ కేంద్ర ప్రభుత్వ విద్యా ఉద్యోగాల్లో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్ కల్పించాలని సూచించింది. 1963లో ఎం.ఆర్​.బాలాజీ, 1964లో దేవదాసన్​ కేసుల్లో సుప్రీంకోర్టు రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని తీర్పు చెప్పడాన్ని దృష్టిలో పెట్టుకుని ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని మండల్​ కమిషన్ సూచించింది. 1979లో జనతా ప్రభుత్వం పతనంతో కమిషన్​ సిఫారసులు అమలు కాలేదు. 1990లో వి.పి.సింగ్​ ప్రభుత్వం మండల్​ కమిషన్​ సూచనల అమలుకు శ్రీకారం చుట్టింది. మండల్​ కమిషన్​ సిఫారసుల అమలును ఇందిరా సహానీ కేసులో సవాల్​ చేశారు. దీనిని మండల్​ కేసుగా పేర్కొంటారు. 

మండల్​ కేసు తీర్పులో ముఖ్యాంశాలు 

ఓబీసీలకు కల్పించిన రిజర్వేషన్లను సమర్థించింది.  సంక్షేమం స్వభావం కూడా రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగం.  ఓబీసీల్లోని సంపన్నశ్రేణి (క్రిమిలేయన్​)ను మినహాయించాలి.  రిజర్వేషన్లు 50 శాతం మించరాదని పునరుద్ఘాటించింది. ప్రభుత్వ ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్​లు కల్పించరాదు.  జాతీయ స్థాయిలో బీసీ కమిషన్​ను ఏర్పాటు చేయాలి. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో పి.వి.నరసింహారావు ప్రభుత్వం జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్​ను ఏర్పాటు చేస్తూ 1993లో భారత పార్లమెంట్​ ద్వారా చట్టాన్ని రూపొందించారు. మొదటి జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్​ చైర్మన్​గా జస్టిస్ ఆర్​.ఎన్​.ప్రసాద్​ పనిచేశారు. జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్​కు రాజ్యాంగబద్ధతను కల్పించడాని కంటే ముందు చైర్మన్​గా జస్టిస్ వంగాల ఈశ్వరయ్య పనిచేశారు. 

76వ రాజ్యాంగ సవరణ తమిళనాడు రాష్ట్రంలో అన్నివర్గాలకు కల్పించిన రిజర్వేషన్లు 69 శాతం ఉండటంతో తమిళనాడు రాష్ట్రం కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి 76వ రాజ్యాంగ సవరణ ద్వారా తమిళనాడు రిజర్వేషన్లను 9వ షెడ్యూల్​లో చేర్చారు. అయితే, ఐఆర్​ కొయాల్స్​ వర్సెస్​ స్టేట్​ ఆఫ్​ తమిళనాడు (2007) వ్యాజ్యంలో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ 9వ షెడ్యూల్​లో పొందుపరిచిన అంశాలను కూడా న్యాయసమీక్షకు గురిచేస్తానని పేర్కొన్నది. 1973 తర్వాత 9వ షెడ్యూల్​లో చేర్చిన అంశాలు ఏవైననూ రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధంగా ఉన్నట్లయితే వాటిని న్యాయసమీక్షకు గురిచేస్తానని సుప్రీంకోర్టు పేర్కొన్నది. 9వ షెడ్యూల్​ను ఒక ప్రత్యేక ఉద్దేశంతో అంటే భూ సంస్కరణల కోసం మన రాజ్యాంగంలో పొందుపర్చారు. రాజ్యాంగ ఉద్దేశాలకు విరుద్ధంగా ఏవైనా అంశాలను 9వ షెడ్యూల్​లో చేర్చితే వాటిని కూడా న్యాయసమీక్ష చేస్తానని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొన్నది.

102వ రాజ్యాంగ సవరణను అనుసరించి రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన జాతీయ వెనుకబడిన తరగతుల మొదటి కమిషన్​ను రాష్ట్రపతి నియమించారు. చైర్మన్​గా హన్స్​రాజ్​ గంగారామ్​ ఆహిర్​, వైస్​ చైర్మన్​గా లోకేష్​ కుమార్​ ప్రజాప్టి, సభ్యులుగా కుషాలేంద్రసింగ్​, మిస్టర్​ భువన్, తల్లోజు ఆచారి నియమితులయ్యారు. జాతీయ బీసీ కమిషన్ పదవీకాలం మూడేండ్లు. సభ్యుల పదవీకాలం ముగియడాని కంటే ముందే రాజీనామా చేయవచ్చు. చైర్మన్ గానీ సభ్యులను గానీ తొలగించే అధికారం రాష్ట్రపతి కలిగి ఉంటారు. సభ్యులుగా పనిచేసినవారు తిరిగి నియామకం పొందడానికి అర్హులే. జాతీయ బీసీ కమిషన్​కు చైర్మన్​గా పనిచేసే వ్యక్తి సుప్రీంకోర్టులో గానీ హైకోర్టులో గానీ న్యాయమూర్తులుగా పనిచేసినవారై ఉండాలి. ఓబీసీ కులాల జాబితాలో ఏవైనా కులాలను చేర్చడానికి అలాగే తొలగించడానికి సంబంధించిన సిఫారసులను చేసే అధికారం జాతీయ బీసీ కమిషన్ క​లిగి ఉంటుంది. జాతీయ బీసీ కమిషన్​ సివిల్​ కోర్టు అధికారాలను కలిగి ఉంటుంది. 

అధికారాలు 

  • ఓబీసీ కులాల్లో మార్పులు, చేర్పులను సూచించడం. 
  • రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా ఓబీసీలకు కల్పించిన అవకాశాల అమలుతీరును పర్యవేక్షిస్తుంది.   
  • రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా ఓబీసీలకు కల్పించిన అవకాశాల అమలులో ఎదురవుతున్న సమస్యలను విశ్లేషిస్తుంది.  
  • ఓబీసీలకు కల్పించే అవకాశాలను సమర్థవంతంగా అమలు పరచడానికి అవసరమైన సూచనలు చేస్తుంది.
  • ప్రభుత్వాలు ఏవైనా కొత్త సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టే సందర్భంలో జాతీయ బీసీ కమిషన్​ను సంప్రదించవచ్చు.   
  • ఏ అధికారినైనా తమ ముందు హాజరై తగిన వివరణ ఇవ్వాలని ప్రభుత్వ అధికారులను ఆదేశించవచ్చు. 
  • రాష్ట్రపతి ఇతర వెనుకబడిన తరగతులకు సంబంధించిన సంక్షేమంపై అప్పగించిన బాధ్యతలను నిర్వర్తించడం. 
  • 102వ రాజ్యాంగ  సవరణతో మార్పులు 
  • 338–బి: జాతీయ విద్యా, సామాజికంగా వెనుకబడిన తరగతుల కమిషన్​ ఏర్పాటు చేస్తారు. 

342–ఏ: రాష్ట్రపతి దేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని విద్యా, సామాజికంగా వెనుకబడిన వర్గాలు కులాల జాబితాకు నిర్వచనాన్ని నోటిఫికేషన్​ ద్వారా ప్రకటిస్తారు. సంబంధిత రాష్ట్రాల గవర్నర్లు, కేంద్రపాలిత ప్రాంతాల పాలకులను సంప్రదించిన అనంతరం రాష్ట్రపతి ప్రకటన చేస్తాడు. పార్లమెంట్​ వెనుకబడిన తరగతుల కులాల జాబితాలో మార్పులు, చేర్పులు అంటే కొన్ని కులాలను ఆ జాబితాలో చేర్చడం, అలాగే ఏవైనా కులాలను తొలగించాలన్న పార్లమెంట్​ చేసే చట్టాల ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. 

366(26బీ): వెనుకబడిన తరగతుల అంటే విద్యాపరంగా, సామాజికంగా వెనుకబడిన తరగతులుగా నిర్వచనాల్లో పేర్కొన్నారు.