- పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్
- సీపీఐ ఆధ్వర్యంలో ఏచూరి సంతాపసభ
హైదరాబాద్, వెలుగు:మతతత్వ శక్తులపై సీతారాం ఏచూరి రాజీలేని పోరాటం చేశారని.. దేశం అలాంటి లౌకికవాదిని కోల్పోవడం బాధాకరమని పీపీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్ గౌడ్అన్నారు. స్వాతంత్ర్య ఉద్యమం, ప్రజా పోరాటాలతో సంబంధం లేని బీజేపీ.. మతం, కులం, ప్రాంతంపేరుతో ప్రజలను విభజించి గద్దెనెక్కిందని, అలాంటి శక్తులకు వ్యతిరేకంగా సీతారాం ఏచూరి జీవితాంతం పోరాడారని ఆయన కొనియాడారు.
హైదరాబాద్ లోని ఏఐటీయూసీ కార్యాలయంలో మంగళవారం సీపీఐ ఆధ్వర్యంలో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారాం ఏచూరి జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మహేశ్‌కుమార్ గౌడ్ మాట్లాడారు. సమకాలీన రాజకీయాల్లో సీతారాం ఏచూరి ఆదర్శప్రాయుడని, ఆయన సామాన్య కార్యకర్త స్థాయి నుంచి సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి స్థాయికి ఎదగడం మామూలు విషయం కాదన్నారు.
విద్యార్థి ఉద్యమం నుంచి కమ్యూనిస్టు భావాలను పుణికి పుచ్చుకుని, నమ్మిన సిద్ధాంతం కోసం చివరి శ్వాస వరకు పోరాడిన ధీశాలి అని కొనియాడారు. దేశంలో ఎన్నో విప్లవాత్మక పోరాటాల్లో భాగస్వామ్యమైన ఆయన.. 2004లో యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు, కనీస ఉమ్మడి కార్యక్రమం రూపకల్పనలో క్రీయాశీలక పాత్ర పోషించారనిపేర్కొన్నారు.
ఏచూరి అంతర్జాతీయ నాయకుడు: కూనంనేని
సీతారాం ఏచూరి దేశ నాయకుడు కాదని, అంతర్జాతీయ నాయకుడని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆయన కృషి వల్లే నేపాల్ కమ్యూనిస్టు పార్టీ అధికారం చేపట్టిందన్నారు. దేశంలో అన్ని ఎర్రజెండాలు ఏకతాటిపైకి రావాలని, అన్ని ఎర్రజెండాలు కలిసి ఒకటే ఎర్ర జెండా కావాల న్నారు. రానున్న రోజుల్లో కమ్యూనిస్టులదే అధికారమని పేర్కొన్నారు.
సీపీఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎంపీ సయ్యద్ అజీజ్ పాషా మాట్లాడుతూ.. దేశం, ప్రజల పట్ల గొప్ప ఆలోచన, ముందు చూపు ఉన్న రాజకీయ నాయకుడు సీతారాం ఏచూరి అని కొనియాడారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు నర్సింహా రావు, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు పశ్యపద్మ, వనజ, సీపీఐ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎన్.బాలమల్లేశ్ పాల్గొన్నారు.
ఆదిలాబాద్‌లో పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్త
ఆదిలాబాద్ జిల్లా ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట అని, ఆ జిల్లాలో పార్టీకి తిరిగి పూర్వ వైభవం తీసుకువస్తానని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఆదిలా బాద్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ఆధ్వర్యంలో ఆ నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలు మంగళవారం గాంధీ భవన్ కు వచ్చి మహేశ్ కుమార్ గౌడ్‌ను కలిసి అభినందించారు.
ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ..ఆదిలాబాద్ జిల్లాలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేస్తే అక్కడ వేరే పార్టీకి చోటే ఉండదన్నారు. చిన్న వయస్సులోనే ఉద్యమాల బాటపట్టి ఉద్యమకారునిగా పేరు సంపాందించిన వెడ్మ బొజ్జు ఎమ్మెల్యేగా గెలుపొందడం అభినందనీయమన్నారు.